కాళేశ్వరం ఆహ్వానం అందని బాధలో హరీష్ రావు : జగ్గారెడ్డి సానుభూతి

(ప్రశాంత్ రెడ్డి)

ప్రాజెక్టులు ఎవరు కట్టినా సమర్ధించాలని మేము కేసీఆర్ ని సమర్థించామని   సంగారెడ్డి ఎమ్మెల్యే ,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అన్నారు.  ఈ రోజు విలేకరులతో ముచ్చటిస్తూ తాను కాలేశ్వరాన్ని సమర్థించడాన్ని టిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

నీటిపారుదల మంత్రిగా ఎంతో కష్టపడినా, కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని బాధతోనే హరీష్ రావు ఏవేవో మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెబుతున్నారని జగ్గారెడ్డి అన్నారు.

ఆహ్వానం రాకపోవడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే, ఈ బాధలో హరీష్ రావు కాంగ్రెెస్ ను నిందించడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు.

‘ కాంగ్రెస్ ఏ ప్రాజెక్ట్ కట్టిందో నీకు తెలియకపోతే మీ మామని అడిగి తెలుసుకో, అది తప్పుకాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదనే  బాధలోనే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నావని  మాకు తెలుసు,’ అని ఆయన హరీష్ మీద చురకంటించారు.

కాంగ్రెస్ పై ఆరోపణలు మానుకోకుంటే…చూస్తూ ఊరుకోము,  కాంగ్రెస్ కట్టిన ప్రాజక్టుల  నీళ్లు తాగే నువ్వు పెద్దోడివి అయ్యవన్నది మర్చిపోవద్దు అని  జగ్గారెడ్డి హితవు చేశారు.

30 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్ట్ కట్టలేదని హరీష్ రావు చేసిన వ్యాఖ్యాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం సరికాదని, ఇలా తెలిసీ తెలియక మాట్లాడటం అవగాహన లేనితనమని  జగ్గారెడ్డి మండిపడ్డారు.

‘నీకు తాగే నీళ్లు అందించే  సింగూరు ప్రాజక్టు, మంజీరా ప్రాజెక్టు లు కట్టింది కాంగ్రెస్ కాదా?  కల్వకుర్తి.. నెట్టెంపాడు ఎల్లంపల్లి, జూరాల, ఎస్ ఎల్ బిసి దేవాదుల ప్రాజెక్ట్ లు కట్టింది కాంగ్రెస్ కాదా, ఈ విషయం ఎలా మర్చిపోతావు,’ అని ఆయన హరీష్ ను ప్రశ్నించారు.

‘మేము కట్టిన ప్రాజెక్ట్ ల నుండి తాగ నీరు సాగు నీరు ప్రజలకు అందాయి. 40 ఏండ్లుగా సింగూరు మంజీరా నీళ్లు జనం తాగుత లేరా, కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నావ్ , హరీష్,’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే అన్నారు,