Home Breaking పవన్ తల్లి ఎపిసోడ్ లో అల్లు అరవింద్ సెన్సేషనల్ స్కెచ్!

పవన్ తల్లి ఎపిసోడ్ లో అల్లు అరవింద్ సెన్సేషనల్ స్కెచ్!

460
0

పవన్ తల్లిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేయించింది రాంగోపాల్ వర్మే. దానిలో సందేహమేమీ లేదు. అయితే పవన్ మొన్నటినుంచి శివాలెత్తిపోయి, ఆ నాలుగు మీడియా సంస్థలపై చిందులు తొక్కటం వెనక ఉన్నది మాత్రం ఆయన బంధువు, అగ్రనిర్మాత అల్లు అరవింద్. పవన్ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి వెళ్ళి ఆగ్రహావేశాలు ప్రదర్శించిన ముందు రోజు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలే పవన్ రెచ్చిపోయేటట్లు చేశాయి. అదెలాగో చూడండి.

కొన్నాళ్ళుగా అల్లు అరవింద్, ఆయన సుపుత్రులు చిరంజీవి కుటుంబంతో అంటీ ముట్టనట్లు ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫాన్స్‌కూ, అల్లు అర్జున్‌కు మధ్య కొన్ని నెలలుగా ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తున్న సంగతి కూడా విదితమే. అల్లు అర్జున్ నటించిన సరైనోడు ఆడియో ఫంక్షన్ లో పవన్ గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ నినాదాలు చేస్తుంటే, ‘చెప్పను బ్రదర్’ అంటూ వ్యాఖ్యానించి బన్నీ వివాదానికి తెరలేపాడు. ఇలా వ్యాఖ్యానించటానికి కారణం తెలియాలంటే మరికాస్త వెనక్కు వెళ్ళాలి. బన్నీ మంచి డాన్సులు, ఈజ్ తో టాలీవుడ్ లో ఒక రేంజికి ఎదిగాడు… సొంతంగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు… మళయాళంలోకూడా మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. అయితే వరస సక్సెస్ ల ప్రభావమో, ఏమోగానీ అతను ‘మెగా’ బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడటానికి, తన బ్రాండ్ ఇమేజ్ తనకుందని చెప్పటానికి అతను కొన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కొన్నాళ్ళుగా తన సినిమా ఫంక్షన్లలో అభిమానులనుద్దేశించి మాట్లాడేటప్పుడు ‘మెగా అభిమానులు’ అని కాకుండా, ‘నా అభిమానులు’ అని సంబోధిస్తూ వస్తున్నాడు. మొత్తం మీద తన స్థానం తనదే అనే భావన ప్రజలకు కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటివాడికి తన ఆడియో ఫంక్షన్ లో పవన్ కు జై కొట్టమనేటప్పటికి కోపం పొడుచుకొచ్చింది. అందుకే ‘చెప్పను బ్రదర్’ అన్నాడు. తర్వాతకూడా ఒకటి రెండు సందర్భాలలో పవన్ ప్రస్తావన వచ్చినప్పుడు అతని గొప్పతనమేమీ లేదని, చిరంజీవి వలనే అతను పెద్దవాడయ్యాడన్నట్లుగా మాట్లాడాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ బన్నీపై పగబట్టారు. అతనిని టార్గెట్ చేశారు. సరైనోడు తర్వాత వచ్చిన ‘డీజే’ చిత్రం సమయంలో వారికి తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. డీజే టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన వెంటనే ప్రపంచంలోనే ఎక్కడా లేనిస్థాయిలో లక్షల సంఖ్యలో దానికి ‘డిస్ లైక్’ బటన్ నొక్కి రికార్డ్ సృష్టించారు. పైగా యూట్యూబ్ లో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు వార్నింగ్ లు ఇస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. దీంతో ఇలాంటి ప్రతిస్పందన ఊహించని అల్లు బ్యాచికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే కష్టమనే భావన అల్లు కుటుంబానికి మొదటిసారి కలిగింది(మరి అన్ని లక్షలమంది పవన్ ఫ్యాన్స్ టిక్కెట్లు కోల్పోవటమంటే నష్టమేగా!).

ఇదిలా ఉంటే, రాంచరణ్ ఇటీవల రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి పర్ఫార్మెన్స్ పరంగా, రికార్డుల పరంగా ఊహించని ఎత్తులకు చేరుకున్న సంగతి తెలిసిందే. చరణ్ ఈ చిత్రంతో చిరంజీవి వారసుడు అనే ముద్రనుంచి బయటపడి తన ఇండివిడ్యువాలిటీని నిరూపించుకున్నాడు. రంగస్థలం రిలీజైన వెంటనే అతని నటనను, సినిమాను ట్విట్టర్ లో అందరూ ప్రశంసిస్తున్నప్పటికీ నోరు మెదపని అల్లు అర్జున్, అరవింద్ కు మెల్ల మెల్లగా దాని సక్సెస్ రేంజి తెలిసిరావటంతో కళ్ళు తిరిగాయి. దీనితో మెగాస్టార్, పవర్ స్టార్ తర్వాత తానే అనుకుంటున్న అల్లు అర్జున్ కు, అతని తండ్రి అరవింద్ కు కళ్ళు నేలమీదికి వచ్చాయి. అర్జెంటుగా ‘మెగా’ బ్రాండ్ ఇమేజ్ అవసరం గుర్తొచ్చింది. వెంటనే చిరంజీవిని అల్లు అర్జున్ కొత్త చిత్రం నాపేరు సూర్య సెట్ కు ఆహ్వానించి సన్మానం చేసి ఫోటోలు దిగి ఆ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసి మెగా ఫ్యామిలీ అంతా ఒకటేననే బిల్డప్ ఇవ్వటానికి ప్రయత్నించారు.

ఇంతలో అల్లు బ్యాచికి పవన్ కు దగ్గరవటానికి శ్రీరెడ్డి అనే రూపంలో మరో అవకాశం ముందుకొచ్చింది. అలా వచ్చినదానిని అల్లు బ్యాచ్ అంత తేలిగ్గా వదులుకుంటారా. వెంటనే పెట్టుకున్నారు. పవన్ తల్లిని తిట్టడాన్ని ఖండించటానికి అరవింద్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. పవన్ తల్లిని పట్టుకుని అంతమాటలు అనిపిస్తావా అంటూ వర్మపై నిప్పులు చెరిగాడు. నీచుడు, నికృష్టుడు అంటూ తిట్ల దండకం చదివాడు. ప్రతిపనిలోనూ వ్యాపార ప్రయోజనాలు చూసే అల్లు అరవిందే ఇంతలా కదిలిపోయి బయటపడి వర్మని బూతులు తిట్టటంతో పవన్ కు ఎక్కడో గుచ్చుకుంది. వెంటనే అర్థరాత్రి ట్విట్టర్ కు ఎక్కాడు. ట్వీట్లు మొదలుపెట్టాడు.

తెల్లారగానే ఫిలింఛాంబర్ కార్యాలయానికి వెళ్ళి అర్జెంటుగా వర్మపై నిషేధం విధించాలని మా కార్యవర్గం గొంతుమీద కూర్చున్నాడు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అల్లు అరవింద్ అల్లు అర్జున్ ను ఛాంబర్ కార్యాలయానికి పంపించాడు. రాంచరణ్, మిగిలిన మెగా హీరోలకంటే ముందుగానే ఛాంబర్ కు చేరుకున్న అల్లు అర్జున్ పవన్ ను ఒకనిమిషంపాటు కౌగలించుకుని తన సంఘీభావాన్ని ప్రకటించాడు. అయితే అల్లు బ్యాచ్ కుట్రలేమీ తెలియని పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను మామూలుగానే కౌగలించుకుని తన ట్వీట్లు, తిట్లు పనిలో తాను ఉన్నాడు. అల్లు అరవింద్ కూడా స్వయంగా ఛాంబర్ కార్యాలయానికి వెళ్ళాడు… పవన్ న్యాయవాదులతో జరిపిన సమావేశానికి కూడా హాజరయ్యాడు.

 

ఇది ఇలా ఉంటే, నిన్న జరిగిన నా పేరు సూర్య ఆడియో కార్యక్రమంలో కూడా అల్లు అర్జున్ పవన్ పై తనకు కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమను ప్రదర్శించాడు. ఇటీవలి కాలంలో మొదటిసారిగా అభిమానులను ఉద్దేశించి మెగా అభిమానులు అని సంబోధించాడు. పవన్ కళ్యాణ్ సినీరంగంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ, కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖాలను, సౌకర్యాలను వదులుకుని రాజకీయాలలోకి ప్రవేశించాడని, అతనిని దెబ్బకొట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ ను వ్యక్తిగతంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం చాలా తప్పు అని అన్నాడు. మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలున్నాకూడా అందరమూ కలిసే ఉంటామని, ఎండ్ ఆఫ్ ది డే అందరమూ ఒకటేనని చెప్పాడు. రాంచరణ్ కు రంగస్థలం హిట్ అయినందుకు అభినందనలు తెలియజేశాడు.

ఎప్పుడు ఏమి చేస్తారో, ఏమి మాట్లాడతారో తెలియని శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ వంటి వ్యక్తుల చర్యలను, మాటలను పట్టుకుని, వాటిని సీరియస్ గా తీసుకుని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఏదో భూమి బద్దలయిపోయిందన్నట్లు, అర్జంటుగా పవన్ పై ప్రేమ పుట్టుకొచ్చినట్లు అల్లు అరవింద్ ఆవేశంతో ఊగిపోయాడు. పవన్ ను రెచ్చగొట్టాడు, తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ కు తాను, తన కుమారుడు సన్నిహితులమే అన్న భావన ఎవరికి కల్పించాలో వారికి కల్పించాడు. అదీ అరవింద్ తెలివితేటలు. అసలు చిరంజీవి నాడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నాశనమవ్వటానికి కూడా ఈయనే ప్రధాన కారణం అని కూడా ఆ పార్టీలో పని చేసిన వారు పలువురు అంటుంటారు. అరవింద్ వ్యవహారశైలి, విధానాల వలనే ప్రజారాజ్యానికి ప్రారంభంలో ఉవ్వెత్తున లభించిన ప్రజాదరణ అంతకంతకూ దిగజారి కేవలం 18 సీట్లకు పరిమితమయిందని వారి వాదన.

కొసమెరుపు: నిన్న జరిగిన ‘నాపేరు సూర్య’ కార్యక్రమాన్ని లైవ్ గా చూపిస్తామని టీవీ 9 న్యూస్ ఛానల్ వారు మూడురోజులుగా ప్రోమోలు ఇచ్చినప్పటికీ, ఆ కార్యక్రమం లైవ్ ను ప్రసారం చేయలేదు. ఆ స్థానంలో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియని బాలకృష్ణ జైసింహా చిత్రం శతదినోత్సవ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. బహుశా అల్లు అర్జున్ తన ప్రసంగంలో న్యూస్ ఛానల్స్ పై విమర్శలు చేస్తాడని ముందే ఊహించి ఆపేసినట్లున్నారు. అంటే ప్రసార హక్కులకోసం నిర్మాతకు కట్టిన డబ్బులుకూడా వదులుకున్నట్లుగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here