ఈ పాలమూరు శత్రువులను ఇఫ్తార్ కలిపింది

పాలమూరు జిల్లాలో నాగం జనార్దన్ రెడ్డి, వనపర్తి చిన్నారెడ్డి ఇద్దరూ రాజకీయ విరోధులు. బద్ధ వ్యతిరేకులు. భౌగోళికంగా ఒకరి మీద మరొకరు పోటీ చేయకపోయినా.. వారి రాజకీయ జీవితంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నరోజులే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు కత్తులు కౌగిలించుకుంటున్నాయి.
రంజాన్ పండుగ సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలో సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు నాగం జనార్దన్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం మౌజాన్ ఈమామ్ లకు శాలువాతో సత్కరించారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండగా శుభాకాంక్షలు తెలిపారు.గతంలో మజీద్ లకు, ఈద్గా లకు,దర్గా లకై ఎంతో సహాయం చేసానని ఆయన అన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఎమ్ఎల్ ఎ చిన్నారెడ్డి,మాజి ఎంపి మల్లురవి పాల్గొన్నారు.
గతంలో నాగం టిడిపిలో ఉన్న రోజుల్లో చిన్నారెడ్డితో తీవ్రమైన వైరం ఉండేది. నాగం ను ఉద్దేశించి ఖడ్గ మృగం అని చిన్నారెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అయితే నాగం కూడా తక్కువ తినలేదు. చిన్నారెడ్డి నిజమైన డాక్టరా? లేక మున్నాభాయ్ ఎంబిబిఎస్ డాక్టరా అని విమర్శించారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. కంతకాలం కేసులు తిరిగిన తర్వాత ఇద్దరూ హుందాతనంతో రాజీపడ్డారు.
ఇంత వైరం వీరిద్దరి మధ్య ఎందుకుంది అంటే ఎవరివద్దా సమాధానం లేదు. అసలు వీరిద్దరూ ఏనాడూ ఒకరి మీద మరొకరు పోటీ చేసిన దాఖలాలు లేవు. రాజకీయ ప్రత్యర్థులు కారు. ఆమాటకొస్తే.. వనపర్తిలో చిన్నారెడ్డికి ప్రత్యర్థిగా రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సుదీర్ఘ కాలం అయితే చిన్నారెడ్డి, లేదంటే రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తిలో గెలుస్తూ వచ్చారు. అలా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఏనాడూ చిన్నపాటి విమర్శలు కూడా చేసుకున్న దాఖలాలు లేవు. ఏదైనా ఉంటే సైద్ధాంతిక విమర్శలే తప్ప పరుషమైన ధూషణలకు ఏనాడూ దిగలేదు. కానీ నాగం, చిన్నారెడ్డి బంధం మాత్రం అలా కాదు. ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న పరిస్థితి ఉండేది.
మొత్తానికి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. పాత శత్రువులు మిత్రులయ్యారు. ఏకంగా ఇద్దరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆశ్చర్యకరంగా ఉందని పాలమూరు వాసులు అంటున్నారు. ఇక మిగిలిన రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎప్పుడు టిడిపి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతాడా అని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. అయితే రావుల చంద్రశేఖర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి సొంత అన్నదమ్ముల వలే టిడిపిలో మెలిగారు. ఇద్దరి మద్య అంత సాన్నిహిత్యం ఉన్నా.. రావుల మాత్రం ఇంకా టిడిపిలోనే కొనసాగుతున్నారు. నాగం తెలంగాణ ఉద్యమ కాలంలో టిడిపి వీడి బిజెపిలో చేరడం.. అక్కడినుంచి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం జరిగిపోయాయి. ఇప్పుడు రావులను సైతం కాంగ్రెస్ లోకి రావాలంటూ చిన్నారెడ్డి ఆహ్వానించడం జరిగిపోయింది కూడా. మొత్తానికి పాలమూరు రాజకీయాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *