హుస్సేన్‌సాగర్‌ లోకి ఫుల్ గా నీళ్లు, ట్యాంక్ బండ్ కు ముప్పులేదంట

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరం నడిబొడ్డున ఉన్న  హుస్సేన్‌సాగర్‌ నిండిపోయింది. ఇంకా భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఫుల్ టాంక్ లెవెల్ (ఎఫ్‌టీఎల్‌) స్థాయిని దాటింది.
హుస్సేన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు కాగా. ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం పెరుగుతున్న హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్‌ఎంసీ తెలిపింది.
2016 ఆగస్ట్‌లో కూడా  హైదరాబాద్‌లో భారీ వర్షం వచ్చింది. అప్పుడు హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తివేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తోంది.
 గత రాత్రి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా కురిసి వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి దిల్ సుఖ్ నగర్ ,ఎల్ బినగర్  సహా చాలా చోట్ల భారీ వాన కురిసింది. ఈ వార్త రాస్తున్నప్పటికి ఇంకా బోరును కురుస్తూనే ఉంది.అనేక కీలకమయిన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
సుమారు రెండు గంటలకు పైగా వర్షం కురియడంతో  హైదరాబాద్ తడిసి ముద్దయింది.
రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. పలు చోట్ల బైక్‌లు కొట్టుకుపోయాయి. మ్యాన్‌హోల్స్‌ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో నగరమంతటా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫ్లైఓవర్లపైనా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇప్పటివరకు తిరుమలగిరిలో 6.5 సెంటీమీటర్లు, బాలానగర్ 5.5, మల్కాజ్‌గిరి 5.1, షేక్‌పేట 4.8, అసిఫ్‌నగర్ 4.5, వెస్ట్‌మారెడ్ పల్లి 3.9, అల్వాల్ 3.5, శేరిలింగంపల్లి 3.1, ఖైరతాబాద్‌లో 3 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు