గీ గట్టుప్పల్ గడ్డపాయన గోడు పట్టించుకోరా? (వీడియో)

బంగారు తెలంగాణలో ఈ నిండు గడ్డపాయన బాధ తీర్చేవారే లేరా? ఈయన కోరేది గొంతెమ్మ కోరిక కాదు.. తన ఇంట్లోకేం అడగలేదు. అడిగిన వారికి అడగని వారికి వరాలిచ్చే తెలంగాణ ప్రభుత్వాధినేత కేసిఆర్ కు ఈ గడ్డపాయన గోడు వినిపించేవారే కరువయ్యారా?

ఈయన పేరు ఇడం కైలాసం. గట్టుప్పల మండల సాధన కమిటీ కన్వీనర్. అసలు వివరాలేమంటే.? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దసరా ముహూర్తాన కొత్త జిల్లాల ఏర్పాటు చేసింది సర్కారు. ఆ సమయంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 31 జిల్లాలకు పెంచింది. అడిగినోళ్లందరికీ జిల్లాలు ఇచ్చేశారు సిఎం కేసిఆర్.

కానీ ఏమైందో ఏమో నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్ అనే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. అన్నీ సమకూర్చారు. ఎమ్మార్వో ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీసు స్టేషన్ తోపాటు ఇతరత్రా ఆఫీసులన్నీ కేటాయించేశారు. కొబ్బరికాయలు కూడా కొట్టేశారు. తీరా రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. గట్టుప్పల్ మండలం తెర మీదనుంచి మాయమైపోయింది. మండలం లేదు గిండలంలేదు అని పాలక పెద్దలు తేల్చి పారేశారు. ఎమ్మార్వో ఆఫీసు బోర్డు, పోలీసు స్టేషన్ బోర్డులు పీకి పడేశారు.

దీంతో రగిలిపోయిన గట్టుప్పల్ జనాలు 600 రోజులకు పైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. గట్టుప్పల్ మండలాన్ని సాధించేవరకు దీక్షలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. 600 రోజులు అవుతున్నా టెంట్ మాత్రం తీయలేదు. ప్రతి రోజు ఏదో ఒక గ్రామానికి చెందినవారు వచ్చి దీక్షలో కూర్చొని నిరసన తెలుపుతున్నారు.

వీరి విషయంలో ఇప్పటికైనా తెలంగాణ సర్కారు స్పందించి తగిన న్యాయం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.

మండల ఏర్పాటు విషయంలో కైలాసం ఏమంటున్నారో కింద వీడియో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *