నాడు బాబు చేసిన తప్పు నేడు వైసిపి చేస్తున్నది !

ప్రభుత్వం మూడు రాజదానుల ప్రతిపాదన చేసిన తర్వాత విపక్ష నేత చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనను అధికార వైసిపి వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసన సహజం కానీ నిరసన వేరు అడ్డుకోవడం వేరు. విశాఖకు పాలనా రాజధానిని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. సహజంగా అక్కడి ప్రజలలో కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. అందుకే చంద్రబాబు ఈ మధ్య ఉత్తరాంధ్ర పర్యటన చేయలేదు.
ఇళ్ల పట్టాల పంపిణీకి గాను ప్రజల నుంచి భూమిని సమికరించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడంతో భూమిని కోల్పోయే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిని పరామర్శించే పేరుతో బాబు విశాఖ పర్యటనకు వెళ్లారు.
మిగిలిన ప్రాంతాల్లో అమరావతికి మద్దతుగా పర్యటనలు చేసిన బాబు విశాఖపట్నం పర్యటనను మాత్రం స్థానిక సమస్య పై వెళుతున్నారు అంటే అక్కడ ప్రజలలో అమరావతి అనుకూల వాతావరణం లేదు అని గుర్తించారు.
ప్రభుత్వం బాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే బాబు అమరావతికి అనుకూలంగా మాట్లాడితే ఉత్తరాంధ్ర లో వ్యతిరేకత , మాట్లాడకపోతే అమరావతి ప్రజలలో అనుమానం వచ్చి వుండేది. రాయలసీమ ప్రాంతంలో అమరావతి కి అనుకూలంగా మాట్లాడినా సీమకు హైకోర్టు ను పెద్దగా వ్యతిరేకించలేదు. బహుశా విశాఖలో బాబు పర్యటన సజావుగా జరిగితే అనివార్యంగా పాలనా రాజధానికి తాను ఎందుకు వ్యతిరేకమో చెప్పక తప్పనిసరి పరిస్థితి ఉండేది. ఏ కారణంగా
వ్యతిరేకంగా మాట్లాడినా బాబుకు రాజకీయంగా ఉత్తరాంధ్ర లో నష్టం జరిగి ఉండేది. ఇపుడు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం వల్ల చర్చ మొత్తం అడ్డుకోవడం , ప్రజాస్వామ్య విలువలు చుట్టూ జరుగుతుంది.
పాలనా రాజధానిని తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో విశాఖ , ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన చంద్రబాబు కు అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పించుకునే అవకాశం ప్రభుత్వమే కల్పించినట్లు అయింది
-మాకి రెడ్డి పురుషోత్తమ రెడ్డి