అమరావతి వాస్తు బాగలేదా, అందుకేనా ఈ సంక్షోభం!

(కోపల్లె ఫణికుమార్)
చంద్రబాబునాయుడు ఎంపిక చేసిన అమరావతి అభివృద్ధి జరగకపోవటానికి రాజకీయ కారణాలు ఎలాగున్నా వాస్తే అసలు సమస్యగా మారిందా ? ఎప్పుడైతే అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేశారో వెంటనే చాలామంది వాస్తు పండితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ వాస్తు పండితుడు శ్రీనివాస గార్గేయ నుండి చాలామంది రాజధాని నిర్మాణానికి అమరావతి ఏమాత్రం సూట్ కాదని గట్టిగానే చెప్పారు.
ఎంతమంది ఎన్ని రకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా చంద్రబాబు మాత్రం పట్టించుకో లేదు. పైగా నరేంద్రమోడి రాజధాని శంకుస్ధాపన చేసిన ప్రాంతం పూర్తిగా వాస్తు విరుద్ధమని కూడా చాలా మందే మొత్తుకున్నారు. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందకపోవటానికి ప్రస్తుత వాస్తును పక్కన పెట్టినా చారిత్రక నేపధ్యం కూడా ఇదే చెబుతోంది.
అమరావతి ప్రాంతాన్ని పరిపాలించిన శాలివాహనులు రాజధానిని ధాన్యకటకం నుండి అమరావతి ప్రాంతానికి మార్చగానే పతనం మొదలైంది. అప్పటి వరకూ ఉజ్వలంగా ప్రకాశించిన ఈ ప్రాంతం రాజధానిగా అమరావతి అనగానే దెబ్బ తినేసింది. అమరావతి రాజధాని ఏర్పడిన దగ్గర నుండి అంతః కలహాలతో రాజకుటుంబం దెబ్బ తినేసిందట.
అమరావతిని పాలించిన చివరి రాజు వాసిరెడ్డి వెంకట్రాదినాయుడు కుటుంబం కూడా పూర్తిగా దెబ్బ తినేసింది. దాంతో అప్పటి నుండి అమరావతి అంటేనే పాలకులు భయపడి పారిపోయేవారు. స్ధల ప్రభావం కారణంగానే ఈ ప్రాంతాన్ని దాదాపు పాలకులంతా వదిలిపెట్టేశారు.
నయా పాలకుడు చంద్రబాబునాయుడు హయాంలో జరిగింది చూసిన తర్వాత వాస్తు ప్రభావమే ఎక్కువగా ఉందేమో అనే అనిపిస్తోంది. లేకపోతే స్వయంగా ప్రధానమంత్రే వచ్చి శంకుస్ధాపన చేసిన తర్వాత అభివృద్ది రేసు గుర్రంలాగ పరిగెత్తాలి. కానీ జరుగుతున్న అభివృద్ధి నత్తను తలపిస్తోంది. ప్రధాని చేసిన శంకుస్ధాపనల తర్వాత మళ్ళీ అరుణ్ జైట్లీ లాంటి కేంద్రమంత్రులను పిలిపించి మళ్ళీ మళ్ళీ శంకుస్ధాపనలు చేయించటమే పెద్ద జోక్ అయిపోయింది.
విచిత్రమేమిటంటే చంద్రబాబు ఐదేళ్ళూ తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేస్తునే ఉన్నారు. భవనాలు నిర్మించే ముందు పెద్ద పెద్ద వాస్తు పండితుల సూచనల ప్రకారమే నిర్మించిన గేట్లను కూడా తర్వాత ఎన్నోసార్లు మార్పించిన విషయం అందరికీ తెలిసిందే.
రాజధానిని అంత బ్రహ్మాండంగా డెవలప్ చేసిన తర్వాత కూడా చంద్రబాబు ఇంత ఘోరంగా ఓడిపోవటానికి వాస్తే ప్రధాన కారణమనే అనిపిస్తోంది. ఈ విషయాలు తెలిసేనేమో జగన్ అమరావతికి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారు.