Home Features Exclusive! ఇది నిజంగా సంచలనం: తమిళ బిగ్‌బాస్ 3 విన్నర్ ఓ తెలుగువాడు!

Exclusive! ఇది నిజంగా సంచలనం: తమిళ బిగ్‌బాస్ 3 విన్నర్ ఓ తెలుగువాడు!

SHARE

(తమిళ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ను ఓ తెలుగువాడు గెలుచుకున్న విషయాన్ని తెలుగు మీడియాలో మొదటి సారి ‘ట్రెండింగ్‌తెలుగున్యూస్’ బయటపెడుతోంది.)

(శ్రవణ్ బాబు)

అవును, గతవారం ముగిసిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను  గెలుచుకున్న ముగేన్ రావు మలేషియా దేశానికి చెందిన తెలుగు సంతతి కుర్రాడు. టీనేజ్ లో గ్యాంగ్ స్టర్ లాగా అవ్వాలని అనుకుని, తిరిగి ఆ దారిని వదిలి సింగర్ గా మారి ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీ అయిపోయిన ఈ 24 ఏళ్ళ యువకుడి ప్రస్థానం అనూహ్యం, విలక్షణం.

తెలుగులో బిగ్‌బాస్ 3 ఇప్పుడు చివరి దశకు చేరగా, తమిళంలో మూడో సీజన్ గతవారమే ముగిసింది. కానీ భీభత్సమైన రచ్చ జరిగిన తమిళంతో పోల్చుకుంటే తెలుగు బిగ్ బాస్ చాలా ప్రశాంతంగా సాగుతోందని చెప్పాలి. 105 రోజులు సాగిన తమిళ బిగ్ బాస్ సీజన్ 3 ఆద్యంతం వివాదాస్పదంగా, సంచలనాత్మకంగా సాగింది. సినిమా, టీవీ, మోడలింగ్, సంగీతం వంటి వివిధ రంగాలకు చెందిన  17 మంది హౌస్ మేట్స్‌గా టైటిల్ కోసం పోటీ పడ్డారు. వీరిలో అలనాటి తార మంజుల – విజయ్ కుమార్‌ల కుమార్తె వనిత విజయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు చేరన్, క్యారెక్టర్ యాక్టర్ ఫాతిమా బాబు కూడా ఉన్నారు. వీరితో బాటు తెలుగులో పలు టీవీ ఛానల్స్ లో నటన, యాంకరింగ్ రంగాలలో పని చేసిన పసుపులేటి రేష్మా కూడా ఉండటం గమనార్హం. తమిళంలో ఇప్పుడు మంచి క్యారెక్టర్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న బాబీ సింహాకు ఈ రేష్మా కజిన్. ఈమె ప్రస్తుతం తమిళంలో సినిమా, టీవీ రంగాలలో పలు పాత్రలలో నటిస్తున్నారు. మరోవైపు శ్రీలంకకు చెందిన మోడల్ లోస్లియా కూడా హౌస్ లో ఒక సభ్యురాలుగా ఉంది. తమిళనాడు మాత్రమే కాకుండా మలేషియా, శ్రీలంక దేశాలలో ఎక్కువగా ఉండే తమిళులను ఆకట్టుకోవటంకోసం హౌస్ మేట్స్ ను బిగ్ బాస్ ఒక స్ట్రాటజీ ప్రకారం ఇలా ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. తెలుగులో కూడా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వటమే కాకుండా తమిళుడైన బాబా భాస్కర్‌ను కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.

తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3లో ఇద్దరు హౌస్ మేట్స్ ను అర్థంతరంగా బిగ్ బాస్ బయటకు పంపశాడు. వీరిలో ఒకరైన కమెడియన్ మధుమిత ఆత్మహత్యకు ప్రయత్నించినందుకుగానూ బయటకు పంపబడింది. ఇంటి సభ్యుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమె చెప్పారు. మరొక హౌస్ మేట్, నటుడు శరవణన్ ను కూడా బిగ్ బాస్ బయటకు పంపాడు. తాను గతంలో ఆడవారిని తాకటానికి సిటీ బస్సులలో ప్రయాణించేవాడినని శరవణన్ ఒక సందర్భంలో హౌస్ లో చెప్పటం, దానిపై తమిళనాడు అంతటా తీవ్రమైన నిరసన వ్యక్తం కావటంతో బిగ్ బాస్ అతనిని బయటకు పంపించాడు. ఇక వనిత విజయ్ కుమార్ ను ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన ఒక కేసు విషయమై విచారించటానికి హైదరాబాద్ నగరానికి చెందిన ఆల్వాల్ పోలీసులు చెన్నైలో బిగ్ బాస్ సెట్ లోకి వెళ్ళారు. ఆమెను అరెస్ట్ చేయొచ్చని ఊహాగానాలు సాగినప్పటికీ, చివరికి ఆమె కుమార్తె అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వటంతో అరెస్టేమీ జరగలేదు.

ఇక మన హీరో ముగేన్ రావు విషయానికొస్తే, ఇతను మలేషియా దేశస్థుడు. తండ్రి పేరు ప్రకాష్ రావు, తల్లి పేరు నిర్మలాదేవి. తమ్ముడి పేరు విగ్నేష్ రావు. ముగేన్ కౌలాలంపూర్ లోనే పుట్టాడు. అయితే తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా చిన్నతనమంతా ఒడిదుడుకులతో నడిచింది. దాని కారణంగానో, ఏమో బాగా దుడుకుగా ఉండేవాడు. అతని కోపం వలన మొదటినుంచీ అందరితో గొడవలు ఉండేవి. టీనేజ్ వయసులో మలేషియా గ్యాంగ్ స్టర్ ల వైపు ఆకర్షితుడయ్యాడు. అయితే ఒకానొక సమయంలో పూర్తిగా మారిపోయి తన ఎనర్జీ మొత్తాన్ని తనకున్న టాలెంట్ వైపు మళ్ళించాడు. సింగర్‌గా, యాక్టర్‌గా ప్రయత్నాలు ప్రారంభించాడు. మలేషియాలోని లింకోక్వింగ్ యూనివర్సిటీలో పర్ఫామింగ్ ఆర్ట్స్ లో డిప్లొమాకూడా చేశాడు. పలు టీవీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, టీవీ కమర్షియల్స్ లో సింగర్ గా, యాక్టర్ గా, లిరిసిస్ట్ గా, మోడల్ గా పనిచేశాడు. 2016లో అతను చేసిన ‘కాయల్ విళి’ అనే పాప్ సింగిల్ పాట యూట్యూబ్‌లో  వైరల్ గా మారి విపరీతమైన పాపులారిటీ తీసుకొచ్చింది. ఇప్పుడు మలేషియాలో సోషల్ మీడియాలో పెద్ద యూట్యూబర్‌గా, సింగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ కారణంగానే బిగ్ బాస్ ఇతనిని హౌస్‌మేట్ గా ఎంపిక చేశాడు.

ఇక ఇతని తెలుగు మూలాల విషయానికొస్తే, ఇతని మాతృభాష తెలుగు అన్న సంగతి, షో జరుగుతున్న సమయంలో బయటపడింది. షో చివరిదశకు వచ్చేటప్పుడు ఆయా హౌస్ మేట్స్ కుటుంబసభ్యులను కొద్ది సేపటికోసం లోపలికి అనుమతిస్తారన్న విషయం తెలిసిందే. ఇతనికోసం తల్లి నిర్మలాదేవి, చెల్లెలు జనని లోపలికి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు కొన్ని సార్లు అప్రయత్నంగా ముగేన్ తెలుగులో మాట్లాడాడు. మరోవైపు, హౌస్ లో ఒక సందర్భంలో పవన్ సినిమా ‘అజ్ఞాతవాసి’లోని ‘గాలి వాలుగా…’ అనే పాటను ఇతను పూర్తిగా పాడాడు. అలా పాడేటప్పుడుకూడా అతని యాస పూర్తిగా తెలుగువారు పాడినట్లే ఉంది. అదీకాక ఇతని పోర్ట్ ఫోలియోలో ‘కన్ను రాపులో’ అనే తెలుగు పాటకూడా ఉంది.  అసలు ఇతని పేరులో ‘రావు’ ఉండటమే అతని తెలుగు మూలాలను తెలుపుతోంది. ఈ ‘రావు’ను తెలుగువారుగానీ, కన్నడవారుగానీ, మరాఠీవారుగానీ మాత్రమే పెట్టుకుంటారు. తమిళంవారు ఎప్పుడూ కూడా ఈ ‘రావు’ను పేరులో పెట్టుకోరు. పైగా సొంత కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాతృభాషలో మాట్లాడతామనే సంగతి తెలిసిందే. పై కోణాలు అన్నింటి నుంచి చూస్తే ఇతను తెలుగువాడనే విషయం నిర్ధారణ అయింది. ఇంకా కొద్దిగా పరిశోధన చేయగా ఇతను మలేషియా తెలుగువాడని పక్కాగా తేలింది.

బిగ్‌బాస్ 3 తమిళ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మలేషియా వెళ్ళిన ముగేన్ – తెలుగులో మాట్లాడుతున్న ఫేస్‌బుక్ వీడియోను కింద చూడండి.

After exclusive interview with Bigg Boss 3 Champion Mugen Rao MGRGood news coming soon | Stay Tuned Like & Share #MalaysiaTeluguMediahttps://www.facebook.com/malaysiatelugumedia/

Posted by Malaysia Telugu Media on Monday, October 14, 2019

తమిళ సినిమా రంగంలో రాణించటం, పలు మ్యూజిక్ వీడియోలు చేయటం తన లక్ష్యమని ముగేన్ చెబుతున్నాడు. తమిళంలో ప్రస్తుతం విశాల్ రెడ్డి, బాబీ సింహా వంటి తెలుగువారు తమ ప్రతిభతో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. గతంలో కూడా కన్నాంబ, సావిత్రి, ఎస్వీ రంగారావు వంటివారు తెలుగుతోబాటు తమిళంలోకూడా అద్భుతమైన పేరు గడించిన సంగతి తెలిసిందే. మరి వారి జాబితాలో ముగేన్ రావుకూడా చేరతాడేమో చూడాలి.

Feature Photo sources mugenrao.com

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, ఫోన్ నెం.99482 93346)