తబ్లిగి నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అయితే… : టి.లక్ష్మీనారాయణ

(టి.లక్ష్మీనారాయణ)
1. ప్రపంచ ఆరోగ్య సంస్థ “నావెల్ కరోనా వైరస్” ను విపత్తుగా ప్రకటించిన పూర్వరంగంలో నిజాముద్దీన్ మర్కజ్ లో “తబ్లిగ్ – ఈ – జమ్మాత్” ను నిర్వహించడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యం, నిర్వాహక సంస్థ చేసిన పెద్ద తప్పు.
2. ఆ కార్యక్రమం నిర్వహించుకోవడానికి, విదేశీయులకు వీసాలిచ్చి పాల్గొనడానికి అనుమతించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించి తప్పు చేసింది.
3. మర్కజ్ కార్యక్రమానికి హాజరై స్వస్థలాలకు తిరిగొచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి “కోవిడ్ -19” వైద్య పరీక్షలు చేయించుకోకుండా, క్యారంటైన్ కు వెళ్ళకుండా, వారు తమ ఇళ్ళకే పరిమితం కాకుండా జనంలో తిరగడం పెద్ద నేరం. పర్యవసానంగా వ్యాధి సోకిన వాళ్ళు కుటుంబ సభ్యులకు, ఇతరులకు కరోనా వైరస్ ను వ్యాప్తి చేసినట్లు వైద్య పరీక్షల గణాంకాలు నిర్ధారిస్తున్నాయి. “కోవిడ్ -19”, ఎయిడ్స్ లాంటి మహమ్మారి కాదు కదా! ఎందుకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా మొఖం చాటేయాలి!
4. అవకాశం దొరికింది కదా అని కొందరు పనికట్టుకొని మతం రంగు పులిమి లబ్ధి పొందుదామని ఉభలాటపడుతున్నట్లుంది. ఆ మనస్తత్వం దేశ లౌకిక వ్యవస్థ పునాదులకే ప్రమాదం తెచ్చిపెడుతుంది.
5. మర్కజ్ లో “తబ్లిగ్ – ఈ – జమ్మాత్” నిర్వహించిన సంస్థపైన, దాని నిర్వాహకులపైన కఠినమైన శిక్షలు తీసుకోవాలి.
6. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యతవహిస్తూ కేంద్ర హోం మంత్రి తక్షణం రాజీనామా చేయాలి.
7. “మూలిగే నక్కపై తాటి పండు పడ్డ” నానుడిగా పెద్ద నోట్ల రద్దు నాటి నుంచి సంక్షోభం వైపు ప్రయాణిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ “కోవిడ్ -19” గొడ్డలి పెట్టుకు గురైయ్యింది. ఈ నేపథ్యంలో మర్కజ్ కు వెళ్ళి వచ్చిన వాళ్ళు ప్రాణాంతకమైన కరోనా అంటువ్యాధి వ్యాప్తికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెట్టిన వారౌతారు.

( టి.లక్ష్మీనారాయణ,ప్రముఖ సాంఘిక రాజకీయ విశ్లేషకుడు, హైదరాబాద్)