అవార్డు లందకపోయినా ఆకాశమంతెత్తు ఎదిగిన మహానటుడు

తెలుగులో ఎవరూ అందుకోలేని శిఖరాలు ఆయన అందుకున్నాడు. తన కాలంలో ఏ  సూపర్ స్టార్ కు తగ్గని సినిమాలు నటించాడు. అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నారు.  అయితే, ఎందుకో ఆయనకు పెద్ద అవార్డులేవీ అందలేదు.  అయినా సరే అది ఆయన స్టేచర్ ను తగ్గించలేదు. ఆయనే ఉత్తమోత్తనటుడని అంతాఅంగీకరిస్తారు. …ఎవరాయన.  ఆయనే ఎస్వీ రంగారావు.
ఎస్వీ రంగారావు అనగానే ఆయన వేసిన పాత్రలన్నీ మనకళ్ల ముందు ప్రత్యక్ష మవుతాయి. ఆయన తర్వాత  అలాంటి పాత్రలేమయ్యాయి?  గొప్ప హీరోలు పోయాక అంత గొప్పహీరోలు కాకపోయినా, హీరోలయితే వచ్చారు. హీరో పాత్ర అనేది అంతరించలేదు.
కాని, రంగారావు పోయాక, ఆయన పోషించినటు వంటి పాత్రలు మాయమయ్యాయి. అశ్చర్యం.  ఆయన పోయాక వందల సినిమాలొచ్చాయి. ఆయనలా నటించి మనజ్ఞాపకాల్లో ఆస్థానం కాకపోయిన ఆయన పక్కన నిలబడేంత స్థానం ఆక్రమించే నటులెవరూ తయారు కాలేదు. రంగారావు పోయాక, ఆయన పాత్రలూ మాయమయ్యాయి. ఒక యుగం అంతరించడమంటే ఇదేనేమో.
రంగారావు ఏదేని పాత్ర ధరిస్తే…అది సినిమా అంతా ఆక్యుపై చేస్తుంది. ఆ పాత్ర సినిమాను తనవైపు తిప్పకుంటుంది. సినిమాని చిరంజీవిని చేస్తుంది. ఇలాంటి గుణం సాధారణంగా హీరో పాత్రలకుంటుంది. కాని రంగారావు ప్రవేశంతో ఇది మూడో పాత్ర సినిమా ప్రధానమయికూచుంది.
తెలుగు సినిమాల స్వర్ణయుగం అనే 1950-1970ల మధ్య వచ్చిన సినిమాలలో  సినిమాని నిలబెట్టడంలో,  ఆయన పాత్రలు కీలక పాత్రవహించాయి. అందుకే ఆసినిమా పేరు చెబితే హీరోలకంటే ముందుగుర్తొచ్చే పేరు ఎస్వీ రంగారావుదే.
ఆయన విగ్రహం, వాక్కు,హావబావాలు అలాంటివి.  దీనికి మయా బజార్ ను తీసకుందాం. ఆయన వేసిన పాత్ర ఘటోత్కచుడు.  కథలో ఘటోత్కచుడు అంత ప్రధానం కాదు. ఘటోత్కచుడి పాత్ర ధరిస్తున్నది ఆజాను బాహువు రంగారావు కాబట్టి పాత్ర స్టేచర్ పెరిగింది. పాత్ర మాయాబజార్ ను శాసించింది. చివరకు సినిమానే నిలబెట్టింది. ఇపుడు హృదయం మీద చెయ్యేసి చెప్పండి మయాబజార్అం టే టకీమని ఎవరు గుర్తొస్తారు. ఘటోత్కచుడు కాదా, ఆయన ‘వివాహ భోజనంబు’ కాదా.
అదీ ఎస్వీరంగారావు  సినిమాలో పాత్రలకు అందించే మంత్ర శక్తి. ఇలాంటిదే పాతాళ బైరవి లోని ‘నేపాల మాంత్రికుడు’. సినిమాకు ఆయువు పట్టు.  ఇక్కడ కూడా  సినిమా రంగారావు భజస్కందాల మీద నడుస్తుంది.
మీకొక హోం వర్క్. రంగారావు నటించిన సినిమాలలో ఆయన మన మీద ముద్ర వేయని సినిమా ఏదైనా ఉందా ఒక సారి రివ్యూ చేసుకోండి.
రంగారావు సినిమాని సంపన్నం చేస్తారు. ఆయన ఉనికి సినిమాకి నిండు దనమిస్తుంది. ఘటోత్కచుడే కాదు, హరిశ్చంద్రడు, కంసుడు, కీచకుడు, హిరణ్య కశిపుడు, నరకాసురుడు, రావణుడు…కుటుంబ పెద్ద నాన్నగారి, తాత గారి పాత్ర దాకా తన పాత్ర సినిమాని తన చేతుల్లోకి తీసుకుంటుంది. రంగారావు నటనతో ఆ పాత్రల ఔన్నత్యం పెరిగేది.

1918జూలై 3న  ఆయన నూజివీడు జమీందారు కుటుంబంలో పుట్టారు.ఇంటి దైవం శ్రీవెంకటేశ్వరుడి పేరును ఆయనకు పెట్టారు. ఆయన తండ్రి కోటేశ్వరరావు ఎక్సైజ్  ఇన్స్ పెక్టర్, తాత డాక్టర్.  ఆయన మామ కోటయ్య నాయుడు చెంగల్పట్టులో ఉండేవారు. విశాఖ పట్టణంలో ఇంటర్ మీడియట్ చదువుతున్నపుడుఆయన మనసు నాటకాలవైపుమళ్లింది. ఆయన మొదటి నాటకం వీధిగాయకులు. అంజలీదేవితో కలసి నటించారు. ఈ నాటకాన్ని చూసిన ఒక ఫైర్ డిపార్ట్ మెంటు అధికారి ఆయన ఉద్యోగమిచ్చారు. తర్వాత బివి రామానందం ఆయనకు ‘వరూధిని’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. అయితే అదంతగా విజయవంతం కాలేదు. దీనితో మళ్లీ ఉద్యోగంలో చేరారు. ఈ సారి ఆయన జంషేడ్పూర్ లో టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు.
తర్వాత సినిమా అవకాశాలు వస్తూండటంతో ఆయన మకాం చెన్నై  కి మార్చారు.  అక్కడ ఉన్నపుడేపెళ్లి చేసుకున్నారు.
తర్వాత ‘షావుకారు’ చిత్రం ఆయనకు మొదట గుర్తింపుతెచ్చింది. ఎల్ వి ప్రసాద్ దీని డైరెక్టర్. ఇందులో ఎన్టీరామారావు, షావుకారు జానకి, గోవిందరాజుల సుబ్బారావు తదిరులున్నారు.
తర్వాత ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో  ఒక పాత్ర లభించింది. తర్వాత ‘పాతాళ భైరవి’ అవకాశం వచ్చింది. ఇది సూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా రంగంలో ఒక ఉజ్వల తార ఉదయించింది.

ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. ఆయన తెలుగుతో పాటు తమిళ సినిమాలలో  నటించారు. ఇందులో తమిళ చిత్రాలు53 ఉన్నాయి.. ఆయనకు నటించిన బిరుదులన్నీ-విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నట సింహా వగైరా- ప్రేక్షకులనుంచి వచ్చినవే. 1963లో , నర్తనశాల లో ఆయన ధరించిన పాత్ర కీచక పాత్రకు  జకార్తాలో జరిగిన ఆఫ్రోఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమనటుడు అవార్డు లభించింది.
భారత ప్రభుత్వ అవార్డు లేవీ అందక పోవడం ఆశ్చర్యం. పద్మ అవార్డులను ఎపుడో 1954లోనే ఏర్పాటుచేశారు. నిజానికి తెలుగు చిత్రాల స్వర్ణయుగమంతా ఆయన విశ్వరూపమే కనిపిస్తుంది. పద్మ అవార్డుల కమిటీకి మాత్రం ఆయన కనిపించలేదు.
ఆయన రెండు సినిమాలకు దర్శకత్వం (చదరంగం, బాంధవ్యాలు)కు దర్శకత్వం వహించారు.
1974, జూలై 18న ఆయన చెన్నైలో చనిపోయారు.