మే 31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం 

(రాయలసీమ సాగునీటి సాధన సమితి)
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రకృతి అనేక వనరులను సమకూర్చింది. అనేక రకాల ఆహార, వాణిజ్య, ఉద్యానవన పంటలు పండే సారవంతమైన పొలాలు ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల పంటలకు అనువైన వాతావరణం కూడ ఉంది. సుమారు 1000 శతకోటి ఘణపుటడుగుల (TMC) నీరు తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదుల గుండా రాయలసీమ భూభాగంపై ప్రవహిస్తున్నాయి. నైపుణ్యవంతమైన, కష్టపడే రైతాంగం, రైతు కూలీలు ఈ ప్రాంతంలో ఉన్నారు.
ప్రకృతి వనరులను ప్రసాదించినప్పటికి సాగునీటి నిర్మాణాలు పూర్తి కాకపోవడం, వాటి నిర్వహణ పట్ల శ్రద్ధ లేకపోవడం, విధానపరమైన నిర్ణయాలలో వివక్షతల వలన రాయలసీమ తరతరాలుగా తాగు, సాగునీటికై విలపిస్తూనే వస్తుంది.

https://trendingtelugunews.com/telugu/rayalaseema-fight-for-siddheswaram-alugu-bojja-dasaratha-rami-reddy/

ఈ నేపథ్యంలో కీలకమైన తాగు, సాగునీటి సాధన లక్ష్యంగా, సమానాభివృద్దికై “రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక” రాయలసీమ నీటి సాధనకై ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వాల ముందుకు తీసుకొచ్చాయి.
ప్రధాన డిమాండ్లు 
** ఇప్పటికే చట్టబద్ధమైన నీటి హక్కులున్న ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందించడం.
** మిగులు జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను సత్వరం నిర్మించడం.
** మిగులు జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులకు చట్టబద్ధమైన నీటి కేటాయింపులు చేపట్టడం. (కృష్ణా నదీ వివాద పరిష్కారాల ట్రిబ్యునల్- 2 గా ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని కేటాయించి, మిగిలిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా తుది తీర్పు నిచ్చింది)
** అత్యల్ప వర్షపాతం ఉండే రాయలసీమలో ప్రతి ఎకరాకు ఒక్క ఆరుతడి పైరుకైనా నీరందించడం.

https://trendingtelugunews.com/telugu/siddheswaram-padayatra-gets-rousing-reception-along-the-way/

ప్రతిపాదనలు
రాయలసీమ ప్రజా సంఘాలు తాగు, సాగునీటి సమస్యలను ప్రభుత్వం ముందుంచడమే కాకుండా వాటి పరిష్కారానికి మార్గాలను కూడా పాలకులు ముందుంచింది. రాయలసీమలోని ఒక్కొక్క జిల్లాకు వంద టి.ఎం.సీ.ల చొప్పున కనీసం 400 టి.ఎం.సీ.ల నికర జలాలను కేటాయించాయిలన్నది సాధారణంగా వినిపించే డిమాండ్. కానీ రాయలసీమ ప్రజా సంఘాలు తమ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్ధిష్ట ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం ముందుంచాయి.

Like this story? Please share it to a friend!

రాయలసీమకు 144.70 టి.ఎం.సీ.ల చట్టబద్ధ నీటి హక్కు ఉంది. తుంగభద్ర, కృష్ణా నదులలో నీళ్లు వరదలతో సముద్రం పాలవుతున్న సంవత్సరాలలో కూడా 70 టి.ఎం.సీ. ల నీళ్ళను వినియోగించుకునే పరిస్థితులు లేవు. అదేవిధంగా మిగులు జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులు కృష్ణా నదిలో వరదలున్నా నీటిని వినియోగించుకునే పరిస్థితులు లేవు. వీటికి ప్రధాన కారణాలు తగినంతగా నీటిని నిలువచేసుకునే రిజర్వాయర్లు లేకపోవడం, కాలువల సామర్థ్యం తక్కువగా ఉండటం.

రాయలసీమ సిద్ధేశ్వరం పాదయాత్ర రేపే

నికర జలాలున్న సాగునీటి ప్రాజెక్టులకు సక్రమంగా నీరందించడానికి చేపట్టవలసిన స్థీరీకరణ ప్రాజెక్టుల గురించి మరియు నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులకు చట్టబద్ధ నీటి హక్కులకై కింద వివరించిన ప్రతిపాదనలను ప్రజా సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి‌.‌
* తుంగభద్ర హెచ్ ఎల్ సి ప్రాజెక్టు స్థిరీకరణకు – తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణం.
*తుంగభద్ర దిగువ కాలువ స్థిరీకరణకు – వేదవతిపై రిజర్వాయర్ మరియు ఎత్తిపోతల పథకం. హాలహర్వి, మొలగవెళ్ళి వద్ద నాలుగు టి.ఎం.సీ. ల సామర్థ్యం తో రిజర్వాయర్ల నిర్మాణం.
*కెసి కెనాల్ స్థిరీకరణకు – గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం.
*నికర జలాలున్న ఎస్ ఆర్ బి సి, చెన్నై త్రాగు నీటి పథకం, మిగులు జలాల హక్కు ఉన్న తెలుగు గంగ, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గాలేరు – నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నీరు సక్రమంగా అందడానికి – శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులకు పునరుద్ధరణకై విధానపరమైన నిర్ణయాలు చేయమని కోరడమైనది.
*బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ శ్రీశైలం రిజర్వాయర్ కు కేటాయించిన క్యారీ ఓవర్ రిజర్వు నిలువలను రాయలసీమ ప్రాజెక్టులకు వినియోగించుకునేందుకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం.
* శ్రీశైలం రిజర్వాయర్ పూడికతో ఇప్పటికే 93 టి.ఎం.సీ. ల నీటి నిర్వహణా సామర్ధ్యం కోల్పోయింది. శ్రీశైలం ప్రాజెక్టు జీవితం కాలం పెంచేందుకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడం.
*గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా మళ్ళించడం, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మళ్ళించడం, పులిచింతల తదితర నిర్మాణ, నిర్వహణ సౌలభ్యాలతో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 512 టి.ఎం. సీ.ల కృష్ణా జలాల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు చట్టబద్ధ కేటాయింపులు చేయాలని కోరడమైంది.
* పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ సామర్థ్యం 75000 క్యూసెక్కులకు పెంచడం.
* వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి బ్రహ్మ సాగర్ కు నీటిని అందించే మద్రాసు కాలువను 8000 క్యూసెక్కుల స్థాయికి పెంపొందించడం.
* హాంద్రీనీవా ఎత్తిపోతల సామర్థ్యం 22000 క్యూసెక్కులకు పెంచడం.
* హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు నిధులు, నీళ్ళు కేటాయించి త్వరితగతిన నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడం‌.
* రాయలసీమలోని ప్రతి ఎకరాకు ఒక్క ఆరుతడి పైరుకైనా నీరు కేటాయించడానికి ప్రత్యేక సాగునీటి కమీషన్ ఏర్పాటు చేయడం. ఈ కమీషన్ కింది రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టడం. వీటిని వాగులు వంకలు, కాలువలతో అనుసంధానం చేయడం. రాయలసీమలో వర్షాలు అధికంగా కురవడానికి, సామాజిక అడవుల పెంపకం చేపట్టడం. తద్వారా నదుల పునరుద్ధరణ చేపట్టడం. రాష్ట్ర నిధులతో పాటు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులతో రాయలసీమ సాగునీటి కమీషన్ ఏర్పాటు చేయడం తదితర ఆచరణాత్మక ప్రతిపాదనలు చేయడమైనది.
సాగునీటి సాధన కార్యాచరణ కార్యక్రమాలు
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చాల్సిన భాద్యత రాజకీయ పార్టీలదే. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతం పట్ల గత ఏడు దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఈ ప్రాంత ప్రజలు పరాధీనతకు లోనయ్యారు. కనీసం తమ ఆశలను, ఆకాంక్షలను కూడా స్పష్టంగా వెలుబుచ్చలేని పరిస్థితులు సీమలో నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రజలకు నీటి వాటా, హక్కులపై అవగాహన కలిగించి, సంఘటితం చేయడమైనది. రాయలసీమ న్యాయమైన నీటి హక్కులను, ప్రాజెక్టులను సాధించుకునే లక్ష్యంతో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి అంకురార్పణ చేయడం జరిగింది. సీమ ప్రజానీకం చేపట్టిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమం రాయలసీమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ తగినది. రాయలసీమ తాగు, సాగునీటి పట్ల పాలకులు వివక్షను సభ్యసమాజం ముందుంచడంలో ఈ సిద్దేశ్వరం ప్రజా శంకుస్థాపన సఫలీకృతం అయ్యింది. పోరాడితే రాయలసీమ తాను కోల్పోయిన హక్కులను సాదించవచ్చన్న స్ఫూర్తినిచ్చింది. ఈ స్పూర్తితో గత ఐదు సంవత్సరాలుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాలు అనేక కార్యక్రమాలును నిర్వహిస్తూ పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను చేపట్టాయి.
** రాయలసీమ తాగు, సాగునీటి పై “ప్రజా అవగాహన కార్యక్రమాలు” గ్రామ స్థాయి, మండలం స్థాయిలో నిర్వహించడం.
** పాలకులు రోడ్లను తవ్వి, మండుటెండలో తాగడానికి తెచ్చుకున్న నీటిని పారబోసినా, మొక్కవోని దీక్షతో, శాంతియుతంగా, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా “సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన” నిర్వహించడం.
** రాయలసీమకు “నీటి బిక్ష కాదు, చట్టబద్ధ నీటి హక్కులు” కావాలంటూ ఒకే రోజు రాయలసీమలో “వంద కేంద్రాల్లో సత్యాగ్రహం” నిర్వహించడం.
** సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన ప్రధమ వార్షికోత్సవ సంధర్బంగా రాయలసీమ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు కార్యాచరణ చేపట్టాలంటూ రాయలసీమ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున “రాయలసీమ మహాజన సభ” నిర్వహించడం.
** శ్రీశైలం రిజర్వాయర్ ను కాలిచేసి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు త్రాగునీరు కూడా అందకుండా చేస్తున్న వైఖరికి నిరసనగా “కర్నూలు కలెక్టరెట్ ముట్టడి” కార్యక్రమం.
** సిద్దేశ్వరం అలుగు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీటి లభ్యతకై “సిద్దేశ్వరం వాహనం యాత్ర” కార్యక్రమం
** రాయలసీమ తాగు, సాగు నీటి పట్ల వివక్షతను వీడేలాగా పాలకులకు సద్బుద్ధి కలిగించాలని కోరుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా “సంగమేశ్వర శంకల్పదీక్ష” కార్యక్రమం.
** పులికనుమ ప్రాజెక్టు పూర్తిచేయాలని “పులికనుమ పాదయాత్ర” కార్యక్రమం
** నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలకై రాజకీయ పార్టీలను నిలదీయండి అని ప్రజలను కోరుతూ “వీదిమూల ప్రదర్శనలు”.
**  శ్రీబాగ్ ఒడంబడికను అమలు పరచండని కోరతూ విజయవాడలో పెద్ద ఎత్తున “రాయలసీమ సత్యాగ్రహం”.
** కృష్ణా నది నీటి వినియోగంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయలను, వాటి పరిష్కారాలపై అఖిల పక్ష రైతు సంఘాల నాయకులతో తిరుపతిలో “రౌండ్ టేబుల్ సమావేశం”.
** శ్రీబాగ్ ఒడంబడికను అమలు పరచండని కోరతూ అనంతపురంలో పెద్ద ఎత్తున “రాయలసీమ సత్యాగ్రహం”.
** గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరుతూ పెద్ద ఎత్తున రెండు రోజుల “గుండ్రేవుల పాదయాత్ర”
** 2019 సార్వత్రిక ఎన్నికల్లో “రాయలసీమ తాగు, సాగునీటి అంశాలను తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చమని” కోరుతూ విసృత స్థాయిలో కార్యక్రమ నిర్వహణ.
** మా చెరువులకు నీళ్ళివ్వండని అనంతపురంలో పెద్ద ఎత్తున “ట్రాక్టర్ల యాత్ర”.
** సిద్దేశ్వరం తృతీయ వార్షికోత్సవ సందర్భంగా రాయలసీమ చట్టబద్ధ నీటి హక్కులపై నాలుగు రోజుల్లో “100 కి.మీ. పాద యాత్ర”.
** అభివృద్ధి వికేంద్రీకరణ, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలని డిమాండ్ చేస్తు “రాయలసీమ సంకల్పం దీక్ష”ను కడపలో భారీగా నిర్వహణ.
** రాయలసీమకు తాగు, సాగునీటి లో జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుకు వినతి పత్రాలు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదులు మరియు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు, CWC కి, కేంద్ర జలవనరుల, హోం శాఖ మంత్రికి “వినతి పత్రాలు అలుపెరగక నిరంతరం అందచేస్తున్న కార్యక్రమాలు”.
** “నిరంతరం పత్రికా సమావేశాలు” నిర్వహించి రాయలసీమ తాగు, సాగునీటి సమస్యలు, పరిష్కారాలు, హక్కులు, పాలకుల భాద్యతలను సమాచార మాధ్యమాలు ద్వారా సమాజం ముందుంచే కార్యక్రమాలు.
రాయలసీమ ప్రజల సంపూర్ణ సహకారంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వ స్పందనను ఆహ్వానిస్తున్నాము. రాయలసీమకు హక్కుగా రావలసిన నీటిని మరియు వరద కాలంలో వృధాగా సముద్రం లోనికి వెలుతున్న నీటిని మళ్ళించడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 203 ద్వారా చేపట్టిన నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాము.

పాలకుల ప్రకటనలు కార్యరూపం దాల్చి లక్ష్యం పూర్తి అయ్యే వరకు, రాయలసీమ తాగు, సాగునీటి హక్కులను సంపూర్ణంగా సాదించేంత వరకు రాయలసీమ ప్రజా సంఘాలు పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమాలను చేపట్టాలి. ఏ మాత్రం అదమరిచినా మొదటికే మోసం వస్తుంది.

సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం 
రాయలసీమ తాగు, సాగునీటి పోరాటానికి స్పూర్తినిచ్చిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన జరిపి మే 31, 2020 నాటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది. నాలుగవ వార్షికోత్సవాన్ని ఘనంగా జరపాలని అనుకొన్నాం. కరోనా మహమ్మారితో ఆ కార్యక్రమం నిర్వహించలేకపోతున్నాం.
రాయలసీమకు నీళ్ళు బిక్ష కాదు, చట్టబద్ధ హక్కలకై పోరాట స్ఫూర్తినిచ్చిన సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన నాలుగోవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని రాయలసీమ వాసులు, ప్రజాస్వామిక వాదులు తమ తమ నివాసాల లోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా పై పేర్కొన్న రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీర్చే విధంగా పాలకులపై మరియు రాయలసీమ‌ అభివృద్ది పట్ల నిర్మాణాత్మకంగా వ్యవహరించేలాగా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొద్దాం.
(రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థ)