Home Features ఈ రోజు ‘రాయలసీమ’ పుట్టిన రోజు, ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే….

ఈ రోజు ‘రాయలసీమ’ పుట్టిన రోజు, ఒకసారి చరిత్రలోకి తొంగిచూస్తే….

SHARE
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి*)
రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాదకాదు. 1800 సంవత్సరం ముందు సీమ రతనాలసీమే. నైజాం ఆదీనంలోకి వెల్లిన తర్వాతనే నాటి నిజాం ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల వ్యవస్ద తోనే రాయలసీమ కరువు సీమగా మారింది.
అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడింది.
చరిత్రలోకి వెలితే…
1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసి తంగడి యుద్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం వరుస దాడులు కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ద భయంతో ఉన్న నిజాము ఆంగ్లేయులతో సైనిక సహరం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహరం ఇవ్వలేని నిజాము సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేసినారు. ఆ మొత్తం వ్యవహరంలో సీమ ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోలేదు.
ఫలితంగా పాలేగాళ్లు ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంభంలో ఆంగ్లేయులకు పాలేగాళ్ల నుంచి ప్రతిఘటన వచ్చింది.

(ఈ స్టోరీ నచ్చితే Facebook లో Like కొట్టండి. Follow అవండి. మీ మిత్రులకి షేర్ చేయండి)

బలమైన సైనిక సామర్ద్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలేగాళ్లు నిలువలేకపోయినారు. అలా ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలేగాళ్లు తొలి స్వాతంత్యోద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచినారు.
కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్దానం రాయలసీమకు లభించలేదు. ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీ డె డ్ జిల్లాలుగా పివబడింది. దీన్నే తెలుగు అర్దంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీ డె డ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్థం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అని అర్థం. అలా పిలవడం కన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్నలనను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీ డె డ్ ప్రాంతంగా పిలవబడింది.
నంద్యాల సభలో కీలక నిర్ణయం…….
1913 లో ప్రారంబమైన ఆంద్రమహసభలు 1928న 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశానికి అవకాశం ఇస్దేనే తాము సహకరిస్దామన్న ఈ ప్రాంతనేతల వత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అద్యక్షతన ప్రథమ దత్తమండలం సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అధ్యాపకులు శ్రీకాకులం వాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినారు.
ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అన్న ప్రతిపాదనను ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది.
ఘన చరిత్రను అధికారికంగా గుర్తించకపోవడం దురదృష్టం…
రాయలసీమకు గొప్ప చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్యంలో అబివృద్ధి చెందిన ప్రాంతంగా, అన్నమయ్య, వేమన లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన ప్రాంతం సీమ.
తిరుమల తిరుపతి దేవస్థానం తప్ప అన్నమయ్యను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోదు.
పప్పూరి తెలుగు ప్రజలు గర్వించదగ్గ దేశభక్తుడు కాని ప్రభుత్వం అధికారికంగా వారి జయంతిని నిర్వహించదు.
తొలి స్వాతంత్రసమరయోదిడిగా ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి అని తెలుస్తున్నా ఆ వైపుగా ప్రభుత్వం ప్రయత్నం చేయదు.
చివరకు దైవ కార్యక్రమము అయిన క్రిష్ణాపుష్కరాలను నది ప్రారంభమైన శ్రీశైలం దగ్గర కాకుండా సముద్రలో కలిసే విజయవాడలో నిర్వహిస్తుంది.
అలా రాయలసీమ ఘనచరిత్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెలుగులోకి రాలేక నష్టపోతుంది.
అనుభవాలనుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం అన్యాయం…
1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే ఆంధ్ర ప్రాంతం తో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడుస్తున్న రోజులలో ఆంధ్ర  విశ్వవిద్యాలయం అనంతలో స్దాపించాలని1926 లో జరిగిన ఆంధ్ర మహసభ మరియు మద్రసు శాసనసభ తీర్మానాన్ని సైతం ఉల్లంగించి అనంతలో ఉండాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ అటు పిమ్మట వైజాగ్ తరలించారు.
ఆ సంస్దకు తెలివిగా సీమకు చెందిన కట్టమంచిని వైస్ చాన్స్ లర్ గా నియమించి వారితోనే వైజాగ్ లో ఉండటం మంచిదని చెప్పించినారు.
అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహనతో వారితో కలిపి ఆంధ్ర రాష్ట్రాంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాలకే పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికన తెలంగాణతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా మారినపుడు కర్నూలు రాజధానిని వదులుకున్నా కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రస్దావించనూ లేదు. కాని ముఖ్యమంత్రిగా మాత్రం రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డిని నియమించినారు.
అలా పదవులు సీమకు పనులు మాత్రం సర్కారు, హైదరాబాదు వారికిగా మారింది. పెద్దమనుషుల ఒప్పందం అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన తెలంగాణ సమాజం రాష్ట్రం కోసం పోరాడి సాదించుకుంది.
ఆ సందర్బంలో జరిగిన సమైఖ్య ఉద్యమంలో కీలక సమయం వచ్చినపుడు తప్పుడడుగుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ పరిస్దితి ఏమిటి అన్న విషయం వదలి సమైఖ్యమత్తులో మునిగిపోయాము. విడిపోవడం ఖాయం మీకు ఏమికావాలో అడగండి అని కేంద్రం అడిగినా మాకు ఏమీ వద్దు సమైఖ్యమే ముద్దు అన్న నినాదంతో గుడ్డిగా ముందుకు వెల్లినాము.
కాని సీమ ప్రజల చేత సమైక్య ఆందోళన చేయించిన సర్కారు పెద్దలు వారు మాత్రం ఆందోళన వదలి డిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి అబివృద్ది ఉపయోగపడే పోలవరం, రాజధానికి నిదులు. కోస్తా కారిడార్ లాంటి విలువైన విషయాలను చట్టంలో పొందుపరుచుకున్నారు.
రాయలసీమ కోసం కనీసం ఒక్కటంటే ఒక్కటి చట్టబద్దంగా చేయించుకోలేకపోయినాము. వివక్షకు పరాకాష్టగా రాజధానిగా అమరావతి ఎంపిక, జీ నెం 120, క్యాన్స్ ర్ పరిశోధనా కేంద్రం తరలింపు, కండలేరు పథకం రద్దు, నంద్యాలకు ఇస్తామన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరుకు మార్పు, మన్న వరం కుందింపు, ఉన్న శ్రీసిటిని నెల్లూరు పరిధి లోకి మార్చడం ఇలా విభజన తర్వాత సీమ వివక్షకు గురి అవుతూనే ఉన్నది.అదికూడా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రాయలసీమవారు ఉన్న సందర్బంలోనే కావడం.
అందుకే 91 సంవత్సరాల క్రితం అవమానకరంగా పిలిచుకున్న దత్తమండలం నుంచి ఆత్మగౌరవంతో కూడిన రాయలసీమగా మారిన మన సీమ మన ప్రాంత నేతల పదవి వ్యామోహం మూలంగా అధికారంలో ఉన్న పెద్దల వివక్షపూరిత పాలన కారణంగా మరింతగా పతనం కాబడి కువైట్  చెన్నై, కేరళలో బిక్షాటన చేసుకునే అవమానకర పరిస్థితి ఎదుర్కొంటున్నాము.
వేల మంది రైతులు ఆత్మహత్యలు, లక్షల మంది వలసలు, సీమలో పుడుతున్న 100 మంది పిల్లలలో 45 మంది బలహీనంగా పుతున్నారన్న ఐక్యరాజ్యసమితి గణాంకాలు , 100 రోజులుగా శ్రీశైలం నిండుగా ఉన్నా , 1200 టీఎంసీల నీరు క్రిందకు వదిలేసిన కూడా రాయలసీమ లో 115 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులలో నింపిన నీరు 50 – 60 టీఎంసీలు మాత్రమే.
పాలకుల నుంచి గాని, మన సీమ నేతల నుంచి కానీ కనీస స్పందన ఉండటంలేదు. నేతల తీరుతోబాటు ప్రజలు సైతం కులం, మతం, పార్టీల అబిమానం పేరుతో గుడ్డిగా సమర్దిస్తున్నాము పలితం ఒకనాటి రతనాల సీమ నేడు రాళ్లసీమగా మారింది. ఆత్మగైరవ నినాదంతో ప్రారంబమైన రాయలసీమ ప్రజల ప్రస్దానం చైతన్యంతో వివక్ష అంతం అయ్యేదాక ఆత్మాబిమానంతో మన జీవితాలు ఉండేరోజు కోసం పోరాడుతూనే ఉండాలి………
(*మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,సమన్వయ కర్త,రాయలసీమ మేధావుల ఫోరం
(feature photo Deccan Chronicle)