మీ రాయలసీమ ఎజండా ఎక్కడ? : పార్టీలకు సీమ సంఘాల ప్రశ్న

రాజకీయ పద్మ వూహ్యంలో చిక్కుకున్న   రాయలసీమ సమస్యలపైన రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించి సమస్యల  పరిష్కారం కోసం తమ కార్యాచరణ ప్రణాలికను ను ప్రకటించాలని రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక   కన్వీనర్ బొజ్జ దశరథరామి రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన అన్ని పార్టీల జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్ష, కార్యదర్సులకు  లేఖలు రాశారు.  
సుమారు వంద సంవత్సరాలుగా కరువు కాటకాలతో తల్లడిల్లుతూ రాజకీయ సుడిగుండంలో చిక్కి  అల్లాడుతున్న రాయలసీమ ప్రజలపైన అన్ని రాజకీయ పార్టీలు చూపుతున్న సానుభూతికి, చేస్తున్న ప్రకటనలకు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు. అయితే నాయకుల సానుభూతి, చేస్తున్న ప్రకటనలు సీమ వాసుల బ్రతుకులు బాగు చేయడానికి గత 70 వసంతాలుగా ఉపయోగపడ లేదని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వైఖరిని, కార్యాచరణను ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.   
శ్రీభాగ్ ఒప్పందం అమలు నుండి, విభజన చట్టం హామీల అమలు, సాగు నీటి రంగంలో సీమకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి తీసుకోవలసిన చర్యల గురించి, గోదారి జలాల మల్లింపు- వాటిని సీమకు కేటాయించే అంశంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి అన్ని రాజకీయ పార్టీలు తమ ఆలోచనలను వెల్లడించి, రాయలసీమను నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చడానికి చేపట్టే కార్యాచరణను ప్రకటించాలని ఆయన తన లేఖలో రాజకీయ పార్టీలను కోరారు.   
మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పడటానికి కోస్తా, రాయలసీమ  నాయకులు కలసి 1937 నవంబర్ 16 న చేసుకున్న శ్రీభాగ్ ఒప్పందం నేటికీ అమలుకు నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు. శ్రీ భాగ్ ఒప్పందం మేరకు రాయలసీమకు రావలసిన నీళ్లు, శాసనసభలో కోస్తాతో సామానంగా ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించడం, రాయలసీమను మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడం,  రాజధాని లేదా హైకోర్టు లలో ఒకదానిని సీమకు కేటాయించడం జరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఈ ఒప్పందాన్ని చట్టబద్దం చేయించడంలో నాయకులు విఫలం కావడం వల్ల ఇవేవీ ఇప్పటికీ అమలు జరగలేదని, అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు గత 7 దశాబ్దాలుగా రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  
ఇప్పటికైనా రాజకీయ నాయకులు, పార్టీలు మేల్కొని  శ్రీభాగ్ ఒడంబడిక అమలు, రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలు,  పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లాంటి సమస్యల పరిష్కారానికి మీ వ్యక్తిగత, పార్టీ వైఖరిని, అందుకోసం చేపట్టనున్న కార్యాచరణ ప్రణాలికను స్పష్టంగా  ప్రకటించాలని ఆయన కోరారు. 
  విభజన చట్టం – హామీల అమలు గురించి:
తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించి, అత్యంత వేగంగా పార్లమెంటు తలుపులు మూసివేసి 2014లోఆమోదించిన రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన అరకొర హామీలను కూడా కేంద్రం అమలు చేయలేదు. రాష్ట్రం అమలు చేయించలేదు. ఆ హామీల అమలుపై మీవైఖరి, కార్యాచరణను ప్రకటించండి.
ఇది కూడా చదవండి

నంద్యాలలో ఆ రోజు పతాకావిష్కరణ https://trendingtelugunews.com/rayalaseema-forums-ask-political-parties-to-make-their-rayalaseema-action-plan-public/

రాష్ట్ర విభజన సమయానికి  రెండు రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి దుమ్ముగూడెం – నాగార్జునసాగర్  టైల్ పాండ్ ప్రాజెక్టును విస్మరించడంతో పాటు అప్పటికే నిర్మాణంలో ఉన్నగాలేరు- నగిరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయడానికి గాని, నీటి కేటాయింపులు చేయించడంలో కానీ  కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అలాగే వెనుకపడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజి మంజూరు, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు లాంటి కేంద్ర హామీలు నేటికీ అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. 
 సాగునీటి రంగంలో రాయలసీమకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే అంశాలు గురించి
సాగునీటి రంగంలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్నిసరిదిద్దడానికి శ్రీశైలం  ప్రాజెక్టును పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, తెలంగాణా లోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలోని కరువు ప్రాంతాల అవసరాలకే కేటాయించాలని,  వరద సమయంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఆయన కోరారు. సీమలో నిర్మాణంలో ఉండి నత్తనడకన సాగుతున్న జి.ఎన్.ఎస్.ఎస్, ఎస్.ఆర్.బి.సి, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన “పోతిరెడ్డిపాడు” కెపాసిటీ పెంచడం, అందుకు అనుగుణంగా కాల్వల సామర్త్యాన్ని పెంచాల్సిఉంది. హంద్రీ- నీవా కు వరద కాలంలో రోజుకు 33వేల క్యూసెక్కుల నీళ్లు తరలించదానికి అనువుగా కాలువ సామర్థ్యము పెంచడం మరియు 100 టిఎంసీల కేటాయింపులు చేయడం, చట్టబద్ధ హక్కులున్న నీటిని  సక్రమంగా సరఫరా చేయడానికి చేపట్టవలసిన చర్యలపై మీ వైఖరిని ప్రకటించాలని ఆయన కోరారు.
అలాగే గోదావరి జలాల మల్లింపు, ఆ నీటిని రాయలసీమతో పాటు మిగిలిన  కరువుప్రాంతాలకు కేటాయించే అంశంపై పార్టీలు తమ విధానాలను స్పష్టం చేయాలని ఆయన కోరారు.
 అభివృద్ధి వికేంద్రీకరణ
అభివృద్ధి కేంద్రీకరణ కారణంగానే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగి రాష్ట్రంవిడిపోయిందని ప్రస్తుతం కూడా  అదే జరుగుతున్నదని అందువల్ల మరోసారి రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర నినాదం ఊపిరిపోసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ కు సంబందించి రాజదాని లేదా హైకోర్టు ను రాయలసీమకు కేటాయించడం రాజదాని ప్రాంతాన్ని ఫ్రీజోన్ చేసి అందరికి ఉద్యోగాల్లో సమానం అవకాశం కల్పించడం,  రాష్ట్ర స్థాయి కార్యాలయాల ఏర్పాటులో అన్నిజిల్లాలకు  సమాన ప్రాతినిధ్యం కల్పించడం, AIMS ను అనంతపురంలో ఏర్పాటు చెయ్యడం‌ లాంటి అంశాలపై మీ పార్టీ స్పష్టమైన వైఖరిని వెల్లడించి, కార్యాచరణ ప్రకటించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
రాయలసీమ ప్రాంత సమస్యల గురించి ఇతర ప్రాంత ప్రజలతో కానీ, నాయకులతో కానీ మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా “మీ వారే కదా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసింది. వారిని నిలదీయకుండా మా ప్రాంతాన్ని, నాయకులను విమర్శించడంలో ఔచిత్యం ఉందా?” అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మా ముఖ్యమంత్రులు పని చేశారని, అందువల్ల రాయలసీమ అభివృద్ధికి ఇతర ప్రాంతాల నాయకులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

-యనమల నాగిరెడ్డి