మాదిరెడ్డి సులోచన కుమ్మరి వృత్తి మీద రాసిన నవలేమిటో తెలుసా?

(కందుకూరి రమేశ్ బాబు)
విద్యావతి అసోసియేట్ ప్రొఫెసర్.  RBVRR విమెన్స్ కాలేజీలో తెలుగు శాఖకు అధిపతిగా పనిచేసి రిటైర్ అయ్యారు. సామాన్యశాస్త్రం గ్యాలరీలో గత ఏడు నిర్వహించిన ‘బొమ్మరిల్లు’ ప్రదర్శనకు తాను ఆత్మీయ అతిథి.
అప్పటినుంచి కొత్త ప్రదర్శనలకు వారు రాలేకపోయారు. చాలా రోజులైందని పద్మారావు నగర్ లో నివాసం ఉండే విద్యావతి గారిని కలిసినప్పుడు, ఇటీవల వారు తెచ్చిన పుస్తకం ఒకటి తీసి పెట్టమని ముందు రోజే అడిగాను. వెళ్ళగానే తాను మాదిరెడ్డి సులోచన గారిపై రాసిన మోనోగ్రాఫ్ తో పాటు, సంగిశెట్టి శ్రీనివాస్ గారితో సంపాదకత్వం వహించి వెలువరించిన మాదిరెడ్డి గారి కథల సంపుటి కూడా ఇచ్చారు (పైఫోటో).
తెలుగు నవలల గురించి మాట్లాడుకుంటే, వ్యాపార నవలలు ప్రధానంగా చెప్పుకోవాలి. అవి పాఠకులను ఉర్రూతలూగిస్తున్న సమయంలో, ఆ ఘడియలకు కాస్త ముందుగానే మాదిరెడ్డి సులోచన గారు ఎన్నో సామాజిక నవలలు రాశారు.
తెలంగాణ దృక్పథంతో ఇక్కడి జీవితాలను పలుకుబళ్ళు, సామెతలతో వ్యక్తిత్వ పోషణ చేశారు. మనదైన సాహిత్య సాగుబడి ఎంత అవసరమో ఎరిగిన దీర్గ దర్శి కావడం మూలాన ముందు చూపుతో వారు చేసిన కృషి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తప్పక వెలుగులోకి రావలసి ఉన్నది. ఆ బాధ్యత ఎరిగి, ఒక్కమాటలో పి హెచ్ డి చేసినంతగా ఆరాటపడి ఎంతో శ్రద్దగా దాదాపు 155 పేజీల గ్రంథాన్ని తేవడం విద్యావతి గారు చేసిన మహత్తరమైన పని. వారికి కృతజ్ఞతలు తెలపడం ఎనలేని తృప్తి.
చిత్రమేమిటంటే, పుస్తక ప్రియులకు మాదిరెడ్డి సులోచన గారి పేరు వినని వారుండరు. చాలా పెద్ద రైటర్. కానీ విద్యావతిగారు ముందుమాటలో పేర్కొన్నట్టు, “తెలంగాణా రచయిత్రుల సాహిత్య గరిమకు ‘మచ్చుతునక’ – మాదిరెడ్డి సులోచన” అన్నంత గాడంగా, అభిమానంగా చెప్పిన వారు లేరు. మన తెలంగాణ రచయిత్రుల సాహిత్య ప్రస్థానంలో ఆచార్య యశోదారెడ్డి తర్వాత మనదైన దృక్పథంతో కలం పట్టిన వారని చాలామందికి తెలియనే తెలియదు.
ఒకటి కాదు, రెండు కాదు, వారు 72 నవలలు రాశారు. 100 కు పైగా కథలు రాశారు. దిన, వార, మాస పత్రికల్లో, ప్రసిద్ద ప్రచురణ సంస్థల నుంచి వారి రచనలు దాదాపు రెండు దశాబ్దాలు నిరాటంకంగా ప్రచురిత మయ్యాయంటే మాటలు కాదు. ఆ విషయాలన్నీ విద్యావతి గారు వివరించి చెబుతుంటే, వారి రచనా వైశిష్ట్యం గురించి పలు విషయాలు పంచుకుంటుంటే ఈ మోనోగ్రాఫ్, కథల పుస్తకం చదివి విద్యావతి గారిని ఇంటర్వ్యూ చేయడం మంచి పని అనిపించింది.
ఆ మాట అంటే – తన పరిశీలనలో కుమ్మరి వారి జీవితాలపై మాదిరెడ్డి గారు రాసిన నవల ‘సుషుప్తి’ గురించి ప్రత్యేకంగా చెప్పారు విద్యావతి గారు. అది ‘తెలంగాణ బహుజన వృత్తి నవల’ అన్నారు. సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఆ నవలను తెలంగాణ ప్రచురణల కింద ప్రచురించిన విషయం కూడా పంచుకున్నారు. లక్కీగా శిథిలావస్థలో ఉన్న ఆ నవలను తాను లైబ్రరీలో చూడటం, అది పుస్తకంగా భయటకు రావడం ఎంతో నయమైందని సంతోషంగా చెప్పారు. అది తప్పక చదవమన్నారు. అంతేకాదు, మాదిరెడ్డి గారు 1969 – తెలంగాణ ప్రత్యేక ఉద్యమం వస్తువుగా సంధ్యారాగం’ నవల రాశారని, రజాకార్ల గురించి కూడా వారు మరో నవల రాశారని చెప్పి మరింత ఆశ్యర్య పరిచారు.
అవన్నీ వింటున్నప్పుడు, విస్మృతిలోకి వెళ్ళిపోయిన మన రచయితలు, కళాకారుల గురించి విచారం కలిగింది. వారిని నేడు అభిమానంగా తలచుకుంటుంటే, ‘వారు ఉన్నప్పుడు సరైన గౌరవానికి పరిస్థితులు లేకపాయే కదా’ అన్న ఆవేదన కలిగింది. అదే పంచుకుంటే, మన వాళ్ళ ద్రోహాల గురించి కూడా తల్చుకుని బాధపడవలసి వచ్చింది.
అవును మరి. ‘నిద్ర మబ్బు’ (సుషుప్తి) అన్నది వారి ఒక పుస్తకం పేరు ఐనట్లే, మాదిరెడ్డి గారి ప్రశస్తి గురించి ఆంధ్ర వాళ్ళు సరే, మన తెలంగాణ నవలా రచయితలు, నా ముందు తరం వారు ఎక్కడా ఘనంగా చెప్పకపోవదాన్ని ఏమనాలే? నిద్ర మబ్బు అనాలా? మనోళ్ళు నిద్ర మబ్బు నటించారనుకోవాలా? ఇది స్వయంకృతాపరాధం కాదా?
చరిత్రలో ‘తెలంగాణ వెనుకబాటు’కు కొద్దిమంది తెలంగాణ వారు చేసిన ద్రోహం చిన్నది కాదనిపించింది. అంతేకాదు,
ఇలాంటి ఆలోచనలతో, మాదిరెడ్డి గారి పరిచయంతో ఎంతో ఆనందం, ఆవేదనతో కాసేపు కాసేపు గడిపాం.
వెళ్ళే ముందు, నా వచ్చే ప్రదర్శనల గురించి మాట్లాడుతుంటే, ముగ్గుల గురించి ప్రస్తావించాను. మళ్ళీ ఈ సంక్రాంతికి బొమ్మల ప్రదర్శన పెట్టాలనిపిస్తోంది అని చెప్పాను. ఆ మాట అనగానే, మాదిరెడ్డి గారి ‘ఋతుచక్రం’ నవల ఎంతో బాగా వ్యవసాయ జీవితాన్ని, పండుగలను వర్ణించిందని, అది తప్పక చదవాలని అన్నారు.
“చదువుతాను. రాస్తాను” అనుకున్నాను. అంతేకాదు, అప్పుడు గానీ, ఇప్పుడు గానీ …కలం పట్టి స్వతంత్ర రచనలు చేసే వారు బాగానే ఊరేగుతున్నారు. మంచిదే. కానీ, అదే కలంపట్టి అసలు మన చరిత్ర తవ్విన వారు చాలా విలువైన కృషి చేసారని గ్రహించాలి. వారికి రచయితలతో సమానంగా గుర్తింపు దొరకకపోవడం తెలంగాణ పునర్నిర్మాణంలో అంత మంచి పరిణామం కాదు. వారికి సముచిత మర్యాదా మన్ననా, అభినందనలు దక్కాలి. అందులో ప్రొఫెసర్లు ఉన్నారు. లైబ్రేరియన్లు ఉన్నారు. విమర్శకులు ఉన్నారు,. పాత్రికేయులూ ఉన్నారు. ఎందరో మహానుభావులు. బహుముఖ పాత్ర పోషిస్తున్న భూమిపుత్రులున్నారు. గతంలోని మన మంచిని వర్తమానంకోసం పరిష్కరిస్తున్న వారెందరో… అందరికీ వందనాలు. సంగిశెట్టి శ్రీనివాస్ గారు, కె. విద్యావతి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక నమస్సులు. వారిని ‘అక్క’ అంటాను. కలిసినందుకు ఎంతో తృప్తి.
అన్నట్టు నిన్న రాత్రే ‘సుషుప్తి’ నవలను కూడా ప్రేమ రాజ్ గారి ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను. అది కుమ్మరి జీవితాలపై వచ్చిన తొలి తెలుగు నవల. సంపాదకులు సంగిశెట్టి గారు దానికి ముందుమాట రాస్తూ ఇలా చెప్పారు: “ఇప్పటివరకూ తెలంగాణ సాహిత్య చరిత్రలో ఇంత గొప్ప ఆణిముత్యం వెలువడిందనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఏ విశ్వ విద్యాలయంలో ఈ నవల పై చర్చ, పరిశోధన జరగలేదు. భవిష్యత్ లో అట్లాంటి చర్చకు ఈ పుస్తక ప్రచురణ దారి తీయాలని కోరుకుంటున్న. ఈ పుస్తకానికి అడగగానే విపులమైన ముందు మాట రాసిచ్చిన డాక్టర్ విద్యావతి గారికి కృతజ్ఞతలు”
-కందుకూరి రమేష్ బాబు (హైదరాబాద్ సాహితీ మిత్రులందరికి ఆత్మీయుడు,  రచయిత, స్వతంత్ర జర్నలిస్టు,ఫోటోగ్రాఫర్ సామాన్యశాస్త్రం పేరుతో గ్యాలరీ నిర్వహిస్తాడు. ఫోన్ నెంబర్ 9948077893 )