ఆంధ్ర, తెలంగాణ సిఎంల మధ్య సామరస్యం లేకుంటే రాష్ట్రాలకు నష్టం

(వి శంకరయ్య)
కృష్ణ గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు ముగిశాయి. ఇరు రాష్ట్రాల పరస్పర ఆరోపణలతో సమావేశాలు జరిగాయి. బోర్డులు – ఇవన్నీ కట్ట గట్టి కేంద్ర జల సంఘానికి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు పంపు తున్నారు. అప్పుడే కేంద్ర జల శక్తి శాఖ డిపిఆర్ లు సమర్పించ కుండా కృష్ణ నదిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణం నిలుపుదల చేయమని ఆదేశించింది. ఇందులో తెలంగాణకు చెంది ఎక్కువ ప్రాజెక్టులున్నాయి.
ప్రస్తుతం” బాల్” కేంద్ర ప్రభుత్వ కోర్టు చేరింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే విధంగా పోట్లాట కొనసాగించితే కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక వంక బెట్టి గోదావరి జలాలను తమిళనాడుకు తరలించ వచ్చు. ఇందుకు చెందిన డిపిఆర్ తయారు చేసుకొని రెడిగా వుంది. ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యానికి సిద్ధం కాక పోతే అంతిమంగా రెండు రాష్ట్రాలు నష్ట పోతాయి. ఏ ప్రాజెక్టులు కొత్తవి ఏవి పాతవి అనే అంశంపై సాగుతున్న రగడకు బోర్డు తెరదించింది.
ప్రస్తుతం సాంకేతిక అనుమతులు లేని ప్రాజెక్టులన్నీ కొత్తవేనని కృష్ణ నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. డిపిఆర్ లు సమర్పించితే హైడ్రాలజీ డిజైన్లు తదితర అంశాలను కేంద్ర జల సంఘం అపెక్స్ కౌన్సిల్ పరిశీలించి అనుమతులు ఇస్తుందని సమావేశానంతరం బోర్డు చైర్మన్ పరమేశం ప్రకటించారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు చెంది పలు ప్రాజెక్టుల పనులు ఆగి పోయి కెసిఆర్ సాగు నీటి రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానంగా పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం ఆగి పోవడంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో రాజకీయంగా ప్రతి ఘటన ఎదుర్కొనక తప్పదు.
కాళేశ్వరం కొత్తది కాదు
ఇదిలా వుండగా గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కానే కాదని లొకేషన్ డిజైన్ మారినంత మాత్రాన కొత్తది కాదని తమ వాటా నీళ్ల మేరకే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని కాళేశ్వరం డిపిఆర్ అడగ వద్దని ఖరాఖండిగా తెలంగాణ చెప్పింది. మరో సెంట్ మెంట్ ఆయుధం కూడా ప్రయోగించింది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటా సరిగా లేదనే కారణంతో తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఆ దృష్ట్యా కూడా కాళేశ్వరం డిపిఆర్ అడగ వద్దని గట్టిగా కోరింది. మరో విశేషమేమంటే గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంత అనే అంశం ఈ సమావేశంలో మళ్లీ మొదటికొచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ వాదనతో ఏకీభవించని తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని ఉదాహరణగా తీసుకొచ్చింది. . ఇందుకు ఎపి అంగీకరించ లేదు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అయితే దాని ప్రారంభోత్సవానికి ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలా వచ్చారనే ప్రశ్నకు సౌభ్రాతృత్వంతో వచ్చారని ఎపి అధికారులు సమాధానం చెప్పుకున్నారు .
Jagan attended the inauguration of Kaleshwaram project, Telangana (credits Telangana Today)
పైగా పట్టి సీమ నుండి 80 టియంసిలు కృష్ణ బేసిన్ కు తరలించుతున్నందున అందులో వాటా తెలంగాణ డిమాండ్ చేసింది. ఎపి అధికారులు ఈ దఫా మాత్రం చురుకుగా వ్యవహరించారు. కాళేశ్వరం తుపాకుల గూడెం దేవాదుల మూడవ దశ సీతారామ ఎత్తిపోతల పథకం తదితరాలన్నింటిపై అభ్యంతరాలు లేవ నెత్తారు. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ డిపిఆర్ ఇస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు ప్రకటించడం గమనార్హం. ఇరు రాష్ట్రాలు డిపిఆర్ సమర్పించితే ఏ రాష్ట్రం ఏమేరకు గోదావరి జలాలు వాడుకొనేది తేలుతుందని బోర్డు చైర్మన్ తెలిపారు.
ఇరుకున పడిన ముఖ్యమంత్రులు
ఇదంతా పరిశీలించితే కొండ నాలుకకు మందు వేస్తే వున్న నాలుక ఊడిన చందమైనట్లుంది – రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి. బోర్డుల నిర్ణయాలను
తుదకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రెండు రాష్ట్రాలు ఎంత వరకు అమలు చేస్తాయో పక్కన పెడితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రతి పథకమూ పాతదేననే వాదనతో ముందుకు పోతాయేమో. ఈ వెర్రి ఎంత వరకు వెళ్లినదంటే ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మాణం చేపట్టిన ముచ్చు మర్రి కూడా కొత్త పథకమేనని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది.

అభిప్రాయం

పాలమూరు రంగారెడ్డి పథకం అంశంలో ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం ప్రస్తావన తెలంగాణ తీసుకు వచ్చినట్లే బోర్డుల సమావేశాల్లో ఎజెండాగా ఉపయోగ పడకపోయినా 2019 ఆగస్టు నెలలో కాంచీపురంలోని అత్తి వరదరాజ స్వామి ఆలయం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ నగరిలో ఎమ్మెల్యే ఆర్ కె రోజా ఇంట ఆతిథ్యం తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలు ప్రధానంగా రాయలసీమ ప్రజలు ఇంకా మరచి పోలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో యువ నాయకత్వం వుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి సాధిస్తున్నదని గోదావరి జలాలను తరలించడం ద్వారా రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని కెసిఆర్ చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయి?
2019 ఎన్నికల తర్వాత ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరికొకరు కౌగలింతల్లో వుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషించిన మాట వాస్తవం. ప్రధానంగా సీమ ప్రజలు తమ ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగి పోతాయని భావించారు. దురదృష్టం ఏమంటే పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి ప్రకటించి వివాదానికి ఇంధనం చేకూర్చడంతో సీమ ప్రజల చిరకాల వాంఛితమైన గుండ్రేవుల రిజర్వాయర్ సిద్దేశ్వరం అలుగు నిర్మాణం హుష్ కాకి అయి సీమ ప్రజలు నీరు గారి పోతున్నారు..
గోదావరే శరణ్యమన్న ప్రసంగాలేమైనవి?
కృష్ణ నదిలో “నీళ్లు లేవని” తెలంగాణతో కలసి నదుల అనుసంధానం చేయక తప్పదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రసంగం రికార్డుల్లో భద్రంగా వుంది.
అంతేకాదు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ఇద్దరి మధ్య సమస్యలే లేనపుడు అపెక్స్ కౌన్సిల్ ఎందుకని సీమను రతనాల సీమ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రసంగాలు చెరిగి పోలేదు.
తుదకు ఏమైందో ఏమో ఇద్దరూ ఎడముఖం పెడ ముఖంగా తయారైనారు. చాప కింద నీరు లాగా వుండిన విభేదాలు పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం ఎపి ప్రభుత్వం ప్రకటించ గానే ఇరువురు ముఖ్యమంత్రులు మధ్య వున్న వైషమ్యాలు ఒక్క సారిగా బద్దలైనవి. ఇక్కడ మరో ట్విస్ట్ వుంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కర్నూలులోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో ముచ్చు మర్రి విస్తరణ పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకంగా వుంది. గాని సంగమేశ్వరంనుండి ఎత్తిపోతల పథకంగా లేదు. మరి ఏ ఉద్దేశంతో ఇలా మార్పు జరిగిందో గాని తుదకు ఈ మార్పు ఎత్తిపోతల పథకం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రగలేసింది. సీమ ప్రజలు ఆశలపై నిప్పులు వర్షం కురిపించింది. ఈ సందర్భంలో చెలరేగిన నిప్పు రవ్వలు ఏ మాత్రం వివాదంలేని ముచ్చు మర్రిని తెర మీదకు లాగింది. కృష్ణ నీటితో సంబంధం లేని గోదావరి పెన్నా అనుసంధానం తొలి దశను వివాదాంశం చేసింది. పోలవరం పూర్తయితే పంపులు ఎత్తేసే పట్టిసీమను చింతలపూడిని తెలంగాణ తెర మీదకు తెచ్చి వివాదాస్పదం చేసింది. తత్ఫలితంగా కృష్ణ నదిపై విభజన చట్టం 11 షెడ్యూల్లో వుండి కూడా తను విస్తరణ చేస్తున్న మూడు పథకాలకు కొత్తగా చేపట్టిన అయిదు పథకాలకు డిపిఆర్ సమర్పించ వలసిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం కొని తెచ్చుకొన్నది .
అయితే తొలి నుండి తెలంగాణ ఇంజనీర్లు ఖచ్చితంగా వున్నా ఎపి ఇంజనీర్లు మాత్రం పలు సందర్భాల్లో పగ్గాలు వదిలేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తూరు జిల్లా నగరిలో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించిన రెండు రోజులకే పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుండీ కేవలం రెండు టిఎంసిల నీళ్లు ఎపి అధికంగా తీసుకొని లెక్క చెప్పలేదని తెలంగాణ ఇంజనీర్లు యాజమాన్యం బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఎక్కడైనా బావ అనుగాని వంగ తోట కాడ వద్దనే సామెత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తొలి నుండి అమలు చేస్తున్నారు.
కాని మరో వేపు ఎపి రాష్ట్ర ప్రభుత్వం మన అధికారుల కాళ్లు చేతులు ఇటీవల వరకు కట్టేసింది. పలు మార్లు జరిగిన కృష్ణ గోదావరి బోర్డు సమావేశాల్లో ఎపి అధికారులు మౌనం పాటించారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే అప్పటి ప్రభుత్వం గోదావరి నుండి 240 టియంసిల జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించుతోందని ఫిర్యాదు చేసి వుంది. పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం పెట్టే వరకు ఈ పాత దస్త్రాలను ఎపి ఇంజనీర్లు పట్టించుకోలేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హజరౌతుంటే గోదావరి బోర్డు సమావేశంలో అది అక్రమ ప్రాజెక్టు అని అధికారులు పాత దస్త్రాలను ముందుకు ఏలా తేగలరు? తాజాగా ఎపి ప్రభుత్వం అనుమతులు లేకుండా గోదావరిపై 450 టియంసిల సామర్థ్యంతో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించుతోందని బోర్డు సమావేశంలో ఫిర్యాదు చేసింది.
అదే విధంగా తెలంగాణ ఆరోపించినట్లు పట్టిసీమ పురుషోత్తమ పట్నం ఎత్తిపోతలకు గోదావరి పెన్నా అనుసంధానం తొలి దశకు డిపిఆర్ లు సమర్పించ లేదు.ఇప్పుడు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం కొత్తగా ఎత్తిపోతల పథకం సరేసరి. రెండు రాష్ట్రాలు కూడా ఏ సందర్భంలోను నిబంధనలు పాటించ లేదు. ఇరువురు గొంగటిలో అన్నం తింటూ వెంట్రుకలు లెక్కపెట్టడానికి సిద్ధం కావడం ఎవరికీ మంచిది కాదు. ఇదే కొనసాగిస్తే . కేంద్రం చేతికి జుట్టు ఇచ్చిన వారౌతారు. . ఈ ఆవాంఛనీయ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి శ్రేయస్సు కాదు.
సామరస్యమే శ్రేయస్కరం
ఈ పరిస్థితుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యానికి లాకులు ఎత్తడం ఉత్తమం. .ఎవరూ పంతాలకు పోకూడదు. రాష్ట్ర విభజన చట్టం మేరకు చట్ట బద్దంగా ఏర్పడిన కృష్ణ గోదావరి నదుల యాజమాన్యబోర్డులు వున్నాయి. గోదావరికి చెంది నీటి వాటా తాజాగా వివాదం ఏర్పడినా కేంద్ర జల సంఘానికి చెందిన వ్యాస్కోప్ అంచనా మేరకు గోదావరిలో 2500 టియంసిల నీళ్లు వున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించినది 1436 టియంసిల మాత్రమే. కృష్ణ నదికి చెంది బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వస్తే ఎవరి వాటా ఎంతో తేలి పోతుంది.ఈ పాటికే కృష్ణ నదికి చెంది బచావత్ కమిషన్ కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి వున్నాయి. చిన్న నీటి వనరుల వినియోగం గోదావరి నుండి మళ్లించే నీటిలో వాటా తేలేంత వరకు 34 – 66 శాతం చొప్పున ఎపికి 512 టియంసిలు తెలంగాణకు 299 టియంసిలు కృష్ణలో వాడుకొనేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించి వున్నాయి.నీటి లభ్యత తగ్గిన సంవత్సరాల్లో ఆ మేరకు కోత విధించేందుకు బోర్డు వుండనే వుంది.
ఈ సమయంలో ఇరువురు ముఖ్యమంత్రులు సామరస్యంతో వ్యవహరించి మిగిలి వున్న సమస్యలను పరిగణలోనికి తీసుకోవాలి. కృష్ణలో క్రమేణా నీటి లభ్యత తగ్గిపోతోంది. బోర్డు ఆదేశాల మేరకే నీటి వినియోగం వుంటుంది. ఎవరి ఇష్ట మొచ్చినట్లు వారు నీటి వినియోగం వుండదు. రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి అయితే ప్రత్యామ్నాయంగా నీటి కోసం రెండు రాష్ట్రాలు వెతుకులాట తప్పదు. అదే సమయంలో గోదావరిలో కావలసినంత నీరు వుంది. గోదావరి కృష్ణ నదుల అనుసంధానంతో కృష్ణ బేసిన్ అవసరాలు తీర్చాలని ఇరువురు ముఖ్యమంత్రులు గతంలో అంగీకరించిన అంశం గమనంలోనికి తీసుకుంటే అటు దక్షిణ తెలంగాణకు
ఇటు రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసిన వారౌతారు .
రాజకీయాలేమైనా వున్నాయా?
కృష్ణలో సగటున శ్రీ శైలం వద్ద 400 టియంసిలు లభ్యమౌతాయని గోదావరి నుండి 900 టియంసిల తీసుకు వస్తే తప్ప కృష్ణ బేసిన్ లో రెండు రాష్ట్రాల అవసరాలు తీరవని ఒకప్పుడు భావించిన ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు.? రెండు రాష్ట్రాలు కలసి నదుల అనుసంధానం చేయలేక పోవచ్చు. ఎవరికి వారైనా సామరస్యంగా .గోదావరి జలాలను ఎవరి వాటా వారు కృష్ణ బేసిన్ కు తెస్తేనే సమస్య పరిష్కారమౌతుంది. లేకుంటే దక్షిణ తెలంగాణ ఇటు రాయలసీమ అవసరాలు తీర్చలేరు. మరో ప్రత్యామ్నాయం కూడా లేదు.
ఇప్పటికే ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బోర్డు కేటాయించే నీటినే వాడుకొనేందు సంగమేశ్వరంనుండి ఎత్తిపోతలు ప్రతి పాదించినట్లు చెబుతున్నారు. శ్రీ శైలంలో కనీస నీటి మట్టం 834 అడుగులకు వుంటే 54 టియంసిల నీరు వుంటుంది. ఈ దశలో కూడా ఆంధ్ర ప్రదేశ్ 830 అడుగులకు హంద్రీనీవా నుండి 790 అడుగుల వరకు ముచ్చు మర్రి నుండి నీళ్లు తీసుకోవచ్చు. ఎపి అంతర్ రాష్ట్ర వివాదంతో కాలం గడపకుండా ప్రస్తుతం వున్న పథకాలతో పట్టిసీమ నీటి వినియోగంతో డెల్టాలో మిగిలిన నీటిని ఈ పథకాల ద్వారా రాయలసీమకు అందించ వచ్చు. అదే విధంగా వరద వచ్చినా లేకున్నా బోర్డు కేటాయింపుల మేరకు తెలంగాణ కూడా కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి శ్రీ శైలం ఎడమ కాలువ ద్వారా నీరు తీసుకోవచ్చు. ఏలాగూ బోర్డు ఆదేశాలకు మించి అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్ర ప్రదేశ్ గాని ఎక్కువగా నీళ్లు తీసుకొనే అవకాశం లేనపుడు కొత్త కొత్త పథకాలు ప్రకటించి సమస్యలను కొని తెచ్చుకోవడం సాగునీటి కోసమా! లేక రాజకీయాల కోసమా?
.
మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాలకు మరో ప్రమాదం పొంచి వుంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2013 లో ఇచ్చిన తుది తీర్పునే ఖరారు చేస్తే కృష్ణలో రెండు వందల టియంసిలకు పైగా మిగులు జలాలను కర్నాటక మహారాష్ట్ర వినియోగించుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే తగ్గిపోతున్న నీరు మరి కొంత వట్టి పోవడం ఖాయం. ట్రిబ్యునల్ తుది తీర్పుపై సుప్రీంకోర్టులో వున్న కేసులో రెండు రాష్ట్రాలు కలసి పోరాడ వలసి వుంది.
ఇప్పటికిప్పుడు బచావత్ కమిషన్ అవార్డు ప్రకారం శ్రీ శైలం వద్ద 440 టియంసిల లభ్యం కావాలి. కాగా 811 టియంసిల నికర జలాలకు గాను మిగిలిన నీరు రెండు తెలుగు రాష్ట్రాల నుండి లభ్యం కావాలి. గత పది సంవత్సరాల నీటి లభ్యత తీసుకుంటే రెండు విధాలుగా నీటి లభ్యత తగ్గిపోతోంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో కూడా తుంగభద్ర నీళ్లు చేరుతున్నాయి. తుంగభద్ర నీళ్లు తమవని సీమ వాసులు మథన పడుతున్నారు. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో వచ్చే ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వాలు తట్టుకోలేకున్నాయి. జూలై ఆఖరు లేదా ఆగష్టులో గాని శ్రీ శైలానికి వరద చేరడం లేదు. అదే సమయంలో జూన్ ఆఖరు కల్లా గోదావరికి వరద వస్తోంది. ఒక్కో సమయంలో జూలైలో కూడా సముద్రంలో వరద నీరు కలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇదొక విచిత్ర పరిస్థితి.
జగన్మోహన్ రెడ్డితో చెలిమి చేసిన రోజుల్లో ట్రిబ్యునల్స్ బోర్డులు అపెక్స్ కౌన్సిల్ వద్దన్న కెసిఆర్ రెండు రాష్ట్రాల క్షేమం దృష్ట్యా ప్రస్తుతం కాలు దువ్వడానికి ఫుల్ స్టాప్ పెట్టాలి.
ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర విమర్శలు వచ్చినా తెలంగాణతో కలసి నదుల అనుసంధానం చేయక పోతే కృష్ణలో నీళ్లు ఎక్కడివని పైగా గోదావరిలో శబరి నది కింద నీళ్లు తప్ప మిగిలి ఏమీ వుండవని శాసన సభ సాక్షిగా ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి వెనుదిరిగి చూడాలి? కృష్ణకు వరద వచ్చే వరకు గోదావరికి వచ్చే నీటిని రెండు రాష్ట్రాలు అవసరాల కోసం వినియోగించుకొనే మార్గాలను ఇరువురు ముఖ్యమంత్రులు అన్వేషించాలి. ఇరువురు ముఖ్యమంత్రులు పంతాలు పట్టింపులు వీడక పోతే లేని నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు పోట్లాడుతుంటే ఎవరినో ఒకరిని కేంద్రం చంకనెత్తుకొని గోదావరి జలాలను తమిళనాడుకు తరలించుకు పోవడం తథ్యం.
(వి. శంకరయ్య విశ్రాంతపాత్రికేయులు 9848394013)
(విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యంతో)