వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేసిన చాయ్ వాలా కథ ఇదే…

చాలా మంది చడీ చప్పుడు చేయకుండా చాలా గొప్ప పనులు చేసుకుపోతుంటారు.ఎపుడో  ఎవరో ఒకరు అనుకోకుండా బయటపెట్టేదాకా వాటి గురించి ప్రపంచానికి తెలియదు.ఇలాంటిదే ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో ఒక టీ కొట్టు కథ.
కటక్ తెలుగు టీ వాలా నరసింహారావు చేసిన పనినే ఇపుడు ఉత్తర్ ప్రదేశ్ లో కాన్పూర్ లో మహబూబ్ మాలిక్  మొదలుపెట్టాడు. ఒక టీ అమ్మి బతికే పెదవాడు చిన్న సామాజిక విప్లవం తీసుకువస్తున్న విషయం కాన్పూర్ లోనే చాలా మందికి తెలియదు.
పట్టణంలోని ఒక ఇరుకిరుకు బజార్లో టీ  షాపు నడుపుతూ, వచ్చిన డబ్బునంతా పేదపిల్లల చదువుకోసం ఖర్చుచేస్తున్న మహమ్మద్ మహబూబ్ మాలిక్ కృషిని మన హైదరాబాద్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్మణ్ బయటపెట్టి సంచలనం సృష్టించారు.
ఇప్పటి దాకా ఈ ట్వీట్ కు మూడు వేల రీ ట్వీట్లు వచ్చాయి. 28.4వేల లైక్స్ వచ్చాయి. లక్ష్మన్ ట్వీట్ తో ఉత్తేజం పొంది, దేశంలోని వార్తాసంస్థలన్నీ మాలిక్ టీ కథ గురించి రాశాయి.

లక్మణ్ ఈ టీవాల్ గురించి ట్వీట్ చేయడం తో మాలిక్ రాత్రికి రాత్రి సెలెబ్రిటీ అయిపోయారు. లక్ష్మణ్ నవంబర్ 6న ఈ టీవాలా మీద ట్వీట్ చేశారు.
ఆయన కథ కటక్ ప్రకాశ్ రావు కథలాగే ఉంటుంది. ప్రకాశ్ రావు ఈ రోజు అంతర్జాతీయంగా పేరున్న సంఘ సేవకుడు. ఆయన కూడా కటక్ లో ఒక మురికివాడపక్కన టీ కొట్టపెట్టి ఆ ఏరియాలో ఉన్న పిల్లలకోసం తన ఇంటిని స్కూల్ మార్చాడు. వాళ్లకి ఉచితంగా స్కూల్ నడిపేందుకు టీ అమ్మగా వచ్చిన రాబడిలో 50 శాతం ఖర్చ చేశాడు. తొలినాళ్లలో కొద్ది మందితో ప్రారంభమయిన నరసింహారావు స్కూల్ కు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.
ఇపుడు మాలిక్ కూడా అదేదారిలో నడుస్తున్నాడు. కాకపోతే, ఇంట్లో కాకుండా అద్దెఇంట్లో మాలిక్ సొంతంగా స్కూల్ ఏర్పాటుచేశాడు. ఇలా 40 మంది చిన్నపిల్లల చదువు ఖర్చంతా భరిస్తూ స్కూల్ నడుపుతున్నాడు. వాళ్లంతా నాలుగో తరగతి లోపు విద్యార్థులు. కాన్పూర్ శారదా నగర్ లో టీ కొట్టునడుపున్నమాలిక్ కథ ని మలయాళ మనోరమ వెలుగులోకి తెచ్చింది.
మాలిక్ తండ్రికి అరుగురుసంతానం. అయితే, కుటుంబలో సంపాదించే చేయి మాలిక్ దే. తండ్రి సంపాదనత్ కుటుంబం నడవడమే కష్టంగా ఉండింది. అందుకే పిల్లలెవరూ చదువుకోలేదు. మాలిక్ చదవుకూడా టెన్త్ తో ఆగిపోయింది. దానితో ఆయన తండ్రి నడుపుతున్న టీ షాప్ లో నే పనిచేయడం మొదలుపెట్టాడు.
ఈ సమయంలో ఆ బస్తీలో కొంత మంది పిలల్లు బడికి వెళ్లకుండా అక్కడ ఇక్కడా తిరుగుతూ, బిక్షమెత్తుకుంటూ ఉండటం గమనించాడు. వీళ్లలో ఎక్కువ మంది పిల్లలకు తల్లి మాత్రమే వుంది. వాళ్లందరికి రోజుకు ఒక పూట భోజనం కూడా కష్టంగా ఉంటుంది.డ అందువల్ల తల్లులు పిల్లలను స్కూల్ పంపడం కన్నా,ఇతర ఏదో పనులకో లేదా బిక్ష మెత్తడానికి పంపించే వాళ్లు. ఈ పిల్లల్లో మాలిక్ తన జీవితాన్ని చూసుకున్నాడు. వీళ్లకి చదువు అందుబాటులోకి తీసుకురాకపోతే, వీళ్ల ఇలాగే పెరిగి ఎందుకు పనికిరాకుండా పోవచ్చు. లేదా తనలాగే ఏదో షాపులో జీవితాన్ని ముగించాల్సి రావచ్చు. అందువల్ల వీళ్లకి చదువు చెప్పించి వాళ్ల జీవిత గమనం మార్చాలనుకున్నాడు.
అంతే, ఆయన తనకు వచ్చే టీషాపు రాబడిలో కొంతభాగం వెచ్చించి వాళ్లని స్కూళ్లకు పింపించాలనుకున్నాడు.
మొదట మాలిక్ సొంతంగా కోచింగ్ సెంటర్ ను ప్రారంభించాడు. తనుండే కాలనీలో ఒకటి, గురుదేవ్ టాకీస్, కాన్సీరాం కాలనీలో మరొక రెండు సెంటర్లు ప్రారంభించి 350 మంది పిల్లలకు ఉచితంగా చదవు చెప్పించడం మొదలుపెట్టారు. ఇందులో పనిచేసే వలంటీర్లకు నెలకు రెండు వేల రుపాలయి పారితోషికం కూడా ఇచ్చాడు. అయితే ఈ సంటర్లు రోజుకు రెండుగంటలు మాత్రమే పనిచేసేయి. వీటినినడిపే క్రమంలో ఇలా రెండు గంటల స్కూళ్ల వల్ల ప్రయోజనం లేదని ఆయన గమనించాడు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ పిల్లల మనసు పూర్తిగా చదువు మీద కేంద్రీకృతమయ్యేలా చేసేందుకు ఈ రెండు గంటల పాఠ శాల చాలదని గ్రహించాడు.
ఒక మిత్రుడి సాయంతో, 2017లో మాలిక్ తుఝే సలాం పౌండేషన్ ప్రారంభించాడు. తనున్న ప్రాంతంలో పేదల పిల్లలకు ఉచితంగా చదువుచెప్పించడం ఈ ఫౌండేషన్ ఉద్దేశ్యం. తనకు సహకరించే మరొక ఐదురుగు వలంటీర్లను పోగుచేసుకున్నాడు. కాలనీలో నుంచి 40 మంది విద్యార్థులను ఎంపిక చేశాడు. వాళ్లకి యూనిఫారం, షూ, పుస్తకాలు, బ్యాగ్ అన్నీ తనే అందిస్తాడు. బస్తీలోనే ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. స్కూల్ మొదలయింది.
మాలిక్ పొద్దునే అయిదుగంటలకల్లా లేచి ఏడున్నర దాకా తన టీ షాపులో పనిచేస్తాడు. తర్వాత ఆయనస్కూలుకు పోతాడు. అప్పటి నుంచి టీషాపు బాధ్యతను తండ్రి తీసుకుంటాడు. మధ్యాహ్నం మూడుగంటలకు స్కూలు నుంచి తిరిగొచ్చి టీషాపు నిర్వహణను తీసుకుంటాడు. టీ కొట్టు రాత్రి పదకొండు దాకా నడుస్తుంది. రోజూ వచ్చే ఆదాయం లో రు. 500 స్కూల్ కోసం ఆదాచేస్తాడు.
కష్టపడి సంపాదించుకున్న నాలుగు రాళ్లను ఇలా వూర్లో వాళ్ల పిల్లల చదువుకోసం తగలేయమేమిటని మొదట్లో చాలా మంది సలహా ఇచ్చే వాళ్లు. నీకేమన్నా పిచ్చా అని అన్నవాళ్లూ ఉన్నారు. తర్వాత్తర్వాత చిన్ని మాలిక్ చేస్తున్న గొప్ప పని గురించి ప్రపంచం గుర్తించడం మొదలుపెట్టాక, వాళ్లే మాలిక్ ని ప్రశంసించడం మొదలుపెట్టారు.
మొన్న వివిఎస్ లక్ష్మన్ ట్వీట్ తో మాలిక్ చేస్తున్న సేవకార్యక్రమం వైరలయ్యింది. ఇపుడు మాలిక్ ను చూసేందుకు, ఆయన మాటకలిపి ఒక టీ తాగేందుకు ఎక్కడెక్కడినుంచో రావడం మొదలయింది. వచ్చిన వాళ్లు ఆయన స్కూల్ ను కూడా చూసి అభినందించి పోతున్నారు. మాలిక్ తన ఎన్జీవోని రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు.ఎవరైనా దాతలు సాయం చేస్తే దానికి ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు వచ్చేలా 80జి సర్టిఫికేషన్ కూడ తీసుకోవాలనుకుంటునకన్నాడు. తన టీ షాపు వ్యాపారం పెంచుకుని స్కూల్ ని మరింత మెరుగుపర్చాలన్నది ఇపుడాయన తక్షణ లక్ష్యం. స్కూల్ పదో తరగతి దాకా అప్ గ్రేడ్ చేసి 200 పిల్లలకు చేర్పించుకునేందుకు కృషి చేస్తున్నాడు.