సున్నా మార్కులున్నా ఉద్యోగాలా …ఎవరి కొంప ముంచుతాయో?

(యనమల నాగిరెడ్డి)

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమ పధకాలు, అధికార వికేంద్రీకరణ, అవినీతి రహిత పాలన అందించడానికి  అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నది .

ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలలో అధికార వికేంద్రీకరణ లో భాగంగా గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు అద్భుతమైన నిర్ణయం గా చెప్పవచ్చు.

అయితే  సామాజిక న్యాయం పేరుతొ సున్నా మార్కులు వచ్చినా కొన్ని వర్గాల వారిని గ్రామ సచివాలయాలలో నియమించాలని నిర్ణయించి” ఈ పధకం లక్ష్యానికి ఆదిలోనే గండి కొట్టడం శోచనీయమనే విమర్శవినబడుతూఉంది.

 చదువు రాక సున్నా మార్కులు తెచ్చుకున్న వారు పాలనలో ఎలా పని చేస్తారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక వివాదాలకు మూలం కానున్న ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. 

ఇది దశాబ్దాల నాటి గాంధీజీ కల  

స్వాతంత్రానికి పూర్వమే దేశ సర్వతోముఖాభివృద్ధికి అధికార వికేంద్రీకరణ చేసి గ్రామాలకు  స్వరాజ్యం ప్రసాధించాలని జాతిపిత మహాత్మాగాంధీ అభిలషించారు. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, పాలకులెవరైనా  ఈ ఆలోచన మాత్రం ఆచరణకు నోచుకోలేదు. ఆయన కన్న కలలు కల్లలుగానే మిగిలాయి. 

గాంధీజీ ప్రియ శిష్యుడు జవహర్ లాల్ నెహ్రు సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా రాజ్యమేలారు.  ఆ తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, అతుల్ బిహారీ వాజపేయి, పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్, నరేంద్రమోదీ లాంటి ఎందరో మహానుభావులు ప్రధానులుగా పనిచేశారు.  

రాజీవ్ గాంధీ మినహా మిగిలిన కాంగ్రెస్ ప్రధానమంత్రులు కానీ, ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన ప్రధానులు కానీ అధికార వికేంద్రీకరణకు ప్రయత్నించలేదు. పైగా అధికార కేంద్రీకరణకే ప్రయత్నించి, సమాజాన్ని పలు రకాలుగా  (కుల, మత, తెగ, భాష, ఆచారాల పేరిట) విభజించడానికే (తమ అధికార పరిరక్షణ కోసం) ప్రయత్నించి విజయం సాధించారు. 

అలాగే దేశ  వ్యాప్తంగా ఉన్నరాష్ట్రాలను పరిపాలించిన ముఖ్యమంత్రులు కానీ,  ఆంద్ర రాష్ట్రాన్ని ఏలిన ఘనాపాఠీలు టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి, విశేష  ప్రజాధరణ పొందిన రామారావు, రాజశేఖర్ రెడ్డి కానీ, 14 సంవత్సరాలుఅధికారం చెలాయించిన చంద్రబాబు కానీ  అధికార వికేంద్రీకరణ గురించి ఆలోచించలేదు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాభివృద్ది, పేదల అభ్యున్నతి పేరుతొ అనేక  పధకాలకు రూపకల్పన చేసినా, అవి ఆయా పార్టీల ప్రచారానికి పనికి వచ్చాయి తప్ప ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదు. 

చిన్న ప్రయత్నం

టీడీపీ అధినేత ఎన్టీఆర్ తాలూకా వ్యవస్థ స్థానంలో మండల వ్యవస్తను ప్రవేశపెట్టి అధికార వ్యవస్తను  ప్రజలకు కొంత దగ్గర చేయగలిగారు కానీ, వ్యవస్థ బలోపేతం కావడానికి అవసరమైన ఆర్ధిక వనరులు ఏర్పరచడంలోనూ, ఇతర చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. మండల వ్యవస్థకు పోటీగా జడ్పీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో  ఇవి రాజకీయ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మాత్రమే ఉపయోగపడిందని చెప్పవచ్చు.  

ఇకపోతే రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ చేసి గ్రామీణ పాలనా వ్యవస్థకు బలం చేకూర్చాలని ప్రయత్నించినా ఆచరణలో అమలు కాలేదు. 

చదువు రాని వాడవని దిగులు చెందకు… ఎదో మార్గంలో  మిమ్ములను సంతృప్తి పరుస్తాం !!

ఈ నేపథ్యంలో  తనదైన మార్కుతో  పాలనను ప్రజల వద్దకే చేర్చాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి  లక్షల మందికి గ్రామస్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పించారు. బిసి, ఎస్.సి, ఎస్టీ కులాల అభ్యర్థులతో పాటు మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించారు. ఇంత వరకు చాలా, చాలా బాగా ఉంది. 

చివరలో “చదువు రాని వాడవని దిగులు చెందకు… సున్నామార్కులున్నా మీ కులం ఆధారంగా ఎస్.సి, ఎస్టీలకు ఉద్యోగాలు ఇస్తామన్న” ప్రకటనతో అధికారులు ఈ మొత్తం పధకానికి అగ్గి రగిలించారు. ఈ పధకం అమలు తీరు తెన్నులపై మొదట్లోనే అనేక అనుమానాలు రేకెత్తించారు. 

రిజర్వేషన్ల పేరుతొ తక్కువ మార్కులు వచ్చిన ఎస్.సి ఎస్టీ కులాల అభ్యర్థులకు చదువులోనూ, ఉద్యోగాలలోను  అవకాశాలు కల్పిస్తున్నారని, బాగా చదువుకొని మంచి మార్కులు పొందినా అవకాశాలు దక్కని అగ్రవర్ణ పేదలు రిజర్వేషన్లపై మండి పడుతున్నారు.

ఇది రోజు రోజుకు సమాజంలో చాప క్రింద నీరులా ప్రాకుతూ కులాల కుంపటి రాజేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కుల వ్యవస్థ యధావిధిగా ఉన్న గ్రామసీమలలో చదువురాని వారిని సచివాలయాలలో నియమిస్తే ఫలితం దారుణంగా ఉంటుందని చెప్పక తప్పదు. 

కులాల ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న ఇలాంటి రాజకీయ ప్రయత్నాల వల్ల పై స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న కుల విభేదాలు పెరిగి  గ్రామస్థాయికి చేరుకోవడం తో పాటు “చదువు రాని రిజర్వేషన్ అభ్యర్థులు” సక్రమంగా పనిచేయలేకపోతే గ్రామస్తులు ఉద్యోగులపై మాటలు తూలడం, చేతులు కలిపే  పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. తద్వారా గ్రామస్తులపై ఎస్.సి, ఎస్టీ చట్టం మేరకు ఉద్యోగులు కేసులు పెట్టె అవకాశాలు పెరిగి రైతులు ఇబ్బందులెదుర్కొనే అవకాశాలు పెరుగుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఇలాగే  సాగిస్తే ముందు, ముందు పోలీసులకు, రాజకీయ నాయకులకు చేతినిండా పంచాయతీలు చేసే పని ఉంటుంది. గ్రామస్తులకు వీరి చుట్టూ తిరగడానికే సరి పోతుంది. 

దీంతో గ్రామ స్వరాజ్య వ్యవస్థ గ్రామ ఆరాచక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, జగన్ ఆశించిన ఫలితం రావడానికి బదులు వ్యతిరేక ఫలితం వస్తుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ఎస్.సి, ఎస్టీ కులాలలో చదువుకున్న వారినే ఈఉద్యోగాలకు ఎంపిక చేయాలని, గ్రామాలను ప్రశాంతంగా ఉంచాలని గ్రామస్తులు, వైసీపీ శ్రేణులు ముఖ్యమంత్రిని  కోరుతున్నారు