Home English ఇజ్రేల్ లో ఈ రోజు ఏంజరిగిందంటే… ఇండియాలో ఇలాంటివి జరిగేనా?

ఇజ్రేల్ లో ఈ రోజు ఏంజరిగిందంటే… ఇండియాలో ఇలాంటివి జరిగేనా?

SHARE

ఇలాంటి కేసులు ఇండియాలో ఇప్పట్లో వినలేం. ఆ రోజులెపుడొస్తాయో చెప్పలేం.

అందుకే ఎక్కడయినా అధికారంలో ఉన్న వాళ్ల మీద అవీనితి కేసులు నమోదయిన వార్తలు, వాటి విచారణ చేసి నిజమని తేల్చిన వార్తలు,పవర్ లో  ఉన్నవాళ్లకి శిక్ష పడటాలు విదేశాలలో జరిగితే చదివి అనందించడమే ఇపుడు చేయగలిగిందంతా.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇజ్రేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సరా నెతన్యాహు(పై ఫోటో)కు కోర్టు శిక్షపడింది. అవును ప్రధాని భార్యను అక్కడ ప్రాసిక్యూట్ చేశారు. ఆమె విలాసాలకోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనేది ఆరోపణ. దాని మీదవిచారణ జరిగింది. అది నిజమనీ తేలింది. ఆమె కూడా నేరాన్ని ఒప్పుకుంది. కాకపోతే, శిక్ష తగ్గించుకునేందుకు కోర్టుతో ఒక అగ్రిమెంటు కొచ్చింది. అందువల్ల ఆమె మీద వచ్చిన ఒరిజినల్ ఆరోపణలకు పడాల్సిన శిక్ష మోతాదు తగ్గింది.

ఆదివారం నాడు ఆమే బేరాన్ని జెరూసలేం కోర్టు అంగీకరించింది. దీనితో ఆమెకు పడే జరిమాన కేవలం 15 వేల అమెరికన్ డాలర్లకు తగ్గింది. ఆమె ఈ మొత్తం చెల్లిస్తారు.

ప్రధాని భార్యకు ఇదేమంత పెద్ద మొత్తం కాదు. అయితే, విశేషమేమిటంటే, ప్రధాని భార్యమీద కేసు నమోదు చేయడం. ఇది  మాటలా? ఇండియాలో ఇదిసాధ్యమా? అసలు అధికారంలో ఉన్నవాళ్ల మీద ఆరోపణలు చేస్తేనే కష్టాలొస్తాయి. ఒక్కొక్క సారి శాల్తీయే లేచిపోతుంది. ఇలాంటిది, చిన్న దేశం ఇజ్రేల్ లో ఏకంగా ప్రధాని భార్య మీద కేసు పెట్టడం, దాన్ని రుజువు చేయడం,కోర్టు శిక్ష విధించడం అన్ని జరిగిపోయాయి.కాకపోతే, దీనికి నాలుగేళ్లు పట్టింది. అయితే, భర్త అధికారంలో ఉన్నా అక్కడ సాక్షులు, రికార్డు తారు మారు కాలేదు.  ఇండియాలో నయితే మొత్తం రికార్డులే మాయమయ్యేవి. సాక్ష్యాలు దొరికేవే కాదు.

ప్రధాని భార్య చేసిన నేరమేమిటి?

ప్రధాని నెతన్యాహు మీద కూడా బోలెడు అవినీతి ఆరోపణలున్నాయి. వాటి మీద కూడా తొందర్లోనే కోర్టు తీర్పు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ లోపు కోర్టు ఆయన భార్య ను శిక్షించింది. ఇద్దరికీ ఇద్దరే. పోటీ పడి అవినీతికి పాల్పడ్డారు.

ప్రధాని భార్యకు విలాసాలకేం కొదువ ఉంటుంది. ఉంటే తప్పు కాదు, వాటిని సర్కారు డబ్బుతో తీర్చుకోవాలనుకోవడమే తప్పు. ప్రధాని నివాసంలో విలాసవంతమయిన భోజనాలకోసం ఆమె విచ్చలవిడిగా ప్రభుత్వం నిధులను వెచ్చించారు. 2010-2013 మధ్య లగ్జీరీ హోటళ్ల నుంచి ఆమె ఖరీదయిన భోజనాలను ప్రధాని నివాసానికి తెప్పించుకుని దాని మీద దాదాపు లక్ష డాలర్లు ఖర్చు చేసింది.

ప్రధాని నివాసానికి అద్భుతమయిన వంటవాళ్లున్నా జిహ్వచాపలన్యం చంపుకోలేకపోయింది. లగ్జరీ హోటళ్ల రుచి మరిగింది. ఇలా స్టార్ హోటళ్ల నుంచి రోజూ ఫుడ్ తెప్పించుకునేందుకు మరొక ప్రభుత్వ ఉద్యోగిని కూడా వాడుకుంది. ఆమెకు కూడా కోర్టు మూడు వేల డాలర్ల జరిమాన విధించింది. ప్రధాని నివాసరమయినా ఫుడ్  మీద లక్షడాలర్లు ఖర్చుచేయడానికి వీల్లేదు. అందునా ప్రభుత్వం నియమించిన వంటవాళ్లున్నపుడు స్టార్ హోటళ్లనుంచి ఫుడ్ ఆర్డర్ చేయడానికే వీళ్లేదు. అయితే, ఒకప్రభుత్వోద్యోగిని వాడుకుని సరా జల్సా చేసింది.

ప్రధాని భార్య తరఫున న్యాయవాది యాసీ కోహెన్ కోర్టు ఏమని విజ్ఞప్తిచేశారో తెలుసా. చచ్చిన పామును ఇంకా చంపొద్దండి అని. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మరీ పబ్లీకున జరగడంతో జనమందరికి ఆమె చేసిన నేరం తెలిసిపోయి అవమానానికి గురయింది. ‘నాలుగేళ్ల పాటు సాగిన విచారణలో రకరకకాల లీకుల వల్ల,చివాట్ల వల్ల ఆమె చితికిపోయారు. ఇంతకంటే అమానుషమయిన శిక్ష ఏముంటుంది? ’ ఆయన ప్రశ్నించారు. ‘ఇంత అవమానాన్నిమరొకరయితే  తట్టుకుని నిలబడే వారు కాదు. ఆమె ఉక్కు మనిషి,’ అయన కితాబిచ్చారు.

ఆమెకు నియమాల గురించి ఎవరూ చెప్పలేదని, అందుకే ఇంటికొచ్చేఅతిధుల కోసం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసే వారని ఆమె తరఫున లాయర్లు వాదిస్తున్నారు.

వాళ్లెంతగా ఆమెనువెనకేసుకొచ్చినా, లక్ష డాలర్లను ఫుడ్ మీద ఖర్చు చేసే అధికారం ప్రధానికి లేదని కోర్టు చెప్పింది.

దీనితో ఆమెకు అయిదేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉండింది. అయితే, ఆమె కోర్టుతో ఒక అగ్రిమెంటుకు వచ్చి, మరొకరు చేసిన తప్పును సొమ్ముచేసుకునేందుకు ప్రయత్నించిన మాట నిజమే నని మాత్రం అంగీకరించేందుకు ముందుకు వచ్చింది. ఆమె అభ్యర్థనను  ఈ రోజు కోర్టు ఆమోదించింది.

దీనితో ఆమెకు విచారణలో తేలినట్లు లక్ష డాలర్ల దుర్వినియోగం కాకుండా కేవలం 50 వేల డాలర్లను మాత్రమే దుబారా చేసినట్లు నేరతీవ్రత తగ్గింది. ఫలితంగా శిక్ష తగ్గింది.ఫైన్ కూడా బాగా తగ్గింది.

అయితే, రాజకీయాల్లో ఎపుడూ భర్తను వెన్నంటి ఉండే సరా మీద లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. ఆమె ఉద్యోగులంతా తెగ తిడతారు.
ఇంట్లో ఉన్న ఉద్యోగులను కూడ ఆమె బెదిరిస్తుండేవారు. 2017లో ఇలాంటి ఆరోపణలతో ఇద్దరు వంటింటి మాజీ ఉద్యోగులు ఆమె మీద కేసు వేశారు. దీన్నుంచి బయటపడేందుకు ప్రధాని నెతన్యాహు వేలాది డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది.

తొందర్లో నెతన్యాహు మీద అవినీతి కేసులు కూడా తేలబోతున్నాయ్. ఏమవుతుందో. ఏమయితే అది కానీయండి, ప్రధానిని, ప్రధాని భార్యను కోర్టు కీడ్చినఘనతను ప్రశంసించకుండా ఉండలేం. పాలస్తీనా వ్యవహారం తీస్తే ఇజ్రేల్ ను చాలా విషయం అందరికంటే ముందుంది.