విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి మ‌ల‌య‌ప్ప‌స్వామి, ఇంతకీ స్వామి ఎవరు?

తిరుమ‌ల‌ శ్రీవేంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. పురాణం ఉంటుంది.

అయితే, తిరుమల చరిత్ర, పురాణం,తిరుమల సంప్రదాయాలు అసాధారణం. వీటి చుట్టుు అల్లుకున్న సాంస్కృతిక విజ్ఞానం అపారం.

తిరుమల సంప్రదాయాలను వివరిస్తూ పోతే మరొక మహాభారతమంత పుస్తకం తయారువుతుందేమో.అందుకే తిరుమల విశేషాలను సందర్భాన్ని బట్టి చెప్పుకోవలసిందే.

నిన్న, ఆగస్టు 16న తిరుమ‌లలో ఒక కార్యక్రమం జరిగింది. శ్రీ‌వారి ఆల‌యం నుండి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఉత్త‌ర మాడ వీధిలో ఉన్న శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వచ్చారు.

ఇది కూడా చదవండి:
డాక్టర్ అంబేడ్కర్ ఆర్టికల్ 370ని వ్యతిరేకించారు, ఎందుకో తెలుసా?

ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామిని మలయప్ప స్వామి అని వర్ణించారు. శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి జ‌యంతి ఆగ‌స్టు 15న జ‌రిగింది. ఆ మ‌రుస‌టి రోజు స్వామి, అమ్మ‌వార్లు శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేయ‌డం ఆన‌వాయితీ.

శ్రీ‌వారి ఆల‌యంలో నిత్యం కార్యక్రమాలు, సేవ‌లు, ఉత్స‌వాలు జ‌రుగుతుంటాయి. వీటిని ఎవరు నిర్ణయించారు. ఎవరు నిర్ధేశించారు అనే ప్రశ్న వస్తుంది.

శ్రీవారి నిత్య కైంకర్యాలకు ఆధారం వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రం. దీనిని రచించింది శ్రీ విఖ‌న‌స మ‌హ‌ర్షి. అందుకే శ్రీవారు సతీసమేతంగా మహర్షి జన్మదినం మరుసటి రోజు మహర్షిని సందర్శిస్తారు.

నిన్న సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేతంగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి శ్రీ విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి చేరుకున్నారు. అక్క‌డ ఆస్థానం నిర్వ‌హించి నివేద‌న చేప‌ట్టారు. ఇక్కడికి వస్తూ  శ్రీవారు మలయప్ప స్వామి రూపం చేపట్టారు.

శ్రీవారు మలయప్ప స్వామి ఎలా అయ్యారు?

తిరుమ‌ల గ‌ర్భాల‌యంలో స్వయంభువు మూల‌విరాట్టుని `ధృ వ బేర‌` అంటారు. ఆయన కొలువై ఉన్న ప్రదేశాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. ధృవబేర అంటే స్థిరంగా ఉన్న ప్ర‌తిమ అని అర్థం. అందువల్ల ఈవిగ్రహాన్ని కదల్చరాదు.

మ‌రి గ‌ర్భగుడి వెలుపల శ్రీనివాసునికి సేవ‌లందించేందుకు అంటే క‌ళ్యాణోత్స‌వం,వూరేగింపులు. ఆయన ప్రయాణాల వంటి వాటిని నిర్వ‌హించేందుకు ఒక విగ్రహం ఉండాలి కదా. గుర్భగుడి బయట తిరిగేందుకు అవసరమయిన విగ్రహమే  ఉత్సవ బేర.

ఈ పవిత్ర కార్యక్రమాలకు కోసం తిరుమల గర్భగుడిలో అయిదు ఉత్స విగ్రహాలున్నాయి. ఇందులో మలయప్ప స్వామి ఒకరు. మిగతా విగ్రహాలు :1. భోగ శ్రీనివాస మూర్తి : (వెండి విగ్రహం. దీనిని పల్లవరాణి సామవాయి(పెరుందేవి) 614 ఎడి లో బహూకరించారు. 2. కొలువు శ్రీనివాస మూర్తి 🙁 ఈ విగ్రహంలో శ్రీవారు బంగారు సింహాసనంలో కొలువై ఉంటారు. ఇది స్నాపన మండపంలో ఉంటుంది. పురోహితులు ఈయనకు పంచాంగ చదవి వినిపిస్తారు.) 3. ఉగ్రనరసింహమూర్తి: ( పూర్వం పండుగలపుడు వూరేగింపులలో పాల్లొన్న ఈయనే. అయితే, ఒక రోజు ఇలా వూరేగిస్తున్నపుడు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. 1330లో ఈ విగ్ర హం వూరేగింపును రద్దు చేశారు) 4. శ్రీకృష్ణ: ఇది రుక్మిణితో నృత్యం చేస్తున్న విగ్రహం. ఇందులోఒక చేతిలో వెన్న ఉంటుంది. అందుకే దీనిని నవనీత నృత్య విగ్రహం అంటారు. ఎడమ చేయి నృత్య భంగిమలో ఉంటుంది. ఇది కృష్ణాష్టమి రోజు వూరేగింపునకు వస్తుంది.

మూల‌విరాట్టుకి జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ ఈ ఉత్స‌వ‌బేర ప్ర‌తినిధి గా ఉంటుంది ఈ అయిదు ఉత్సవ విగ్రహాలను మూల‌విరాట్టుతో స‌మానంగా భక్తులు భావిస్తారు.

చ‌రిత్ర‌

పైన చెప్పినట్లు పూర్వం ఉత్స‌వాల కోసం ఉగ్ర‌శ్రీనివాసుని మూర్తిని వినియోగించేవార‌ు. ఇది 1330లో ఆగిపోయింది. కారణం, బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంలో, స్వామివారి ఊరేగింపు జ‌రిగే స‌మ‌యంలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ఎందుకిలా జ‌రిగిందా అని భ‌క్తులు, అర్చ‌కులు ఆందోళ‌న‌ప‌డుతుండ‌గా ఒక భ‌క్తునిలోకి స్వామివారు ప్రవేశించి త‌న సందేశాన్ని వినిపించాడ‌ని ఒక గాధ ప్రచారం లో ఉంది.

ఉగ్రరూపంలో ఉన్న శ్రీనివాసుని కాకుండా స్వామి వారి సౌమ్య‌ మూర్తిని ఉత్స‌వాల కోసం వినియోగించాలని చెప్పి వెళ్లిపోయారు.

అంతేకాదు, ఈ సౌమ్య మూర్తి ‘మలయప్ప కోన’ లో దొరుకుతుందని కూడా చెప్పారు. తర్వాత అర్చకులు మలయప్ప కోనలో వెదికితే స్వామి వారి విగ్రహం దొరికింది. రాయలసీమ కొండల్లో  కోనలు చాలా ఎక్కువ. కోన అంటే కొండల్లో ఒక జలపాతం, కొలను ఉండి అడవిలాగా దట్టమయిన చెట్లతో ప్రశాంతమయిన వాతావరణంతో ఉన్న ప్రదేశం. తమిళంలో మలై అంటే అడవి. అడవి కోనలో దొరికిన విగ్రహం . తమిళంలో అది ‘మలై కునియ నిన్ర పెరుమాళ్’(Malai kunia ninra perumal) అయింది. తెలుగులో మలై అప్ప స్వామి , మలయప్ప స్వామి అయ్యారు.

మలయప్ప స్వామి

మ‌ల‌య‌ప్ప స్వామి విగ్ర‌హం పంచ‌లోహాల‌తో ఉండి తామ‌ర‌పూవు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎత్తున ఠీవిగా ఉండే శ్రీనివాసుని రూపం అది. శంఖుచ‌క్రాల‌తోనూ, వ‌ర‌ద‌హ‌స్తంతోనూ దివ్య‌మంగ‌ళ రూపంలో కనిపించే స్వామి వారికి కుడివైపున శ్రీదేవి, ఎడ‌మ‌వైపు భూదేవి అమ్మ‌వార్లుంటారు.

భ‌క్తులు చేసే క‌ళ్యాణోత్స‌వాల‌లో, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌లోనూ కొన్ని అభిషేకాల‌లో మలయప్ప స్వామియే పాల్గొంటారు.

పుష్క‌రిణిలో జ‌రిగే తెప్పోత్స‌వం కూడా మ‌ల‌య‌ప్ప స్వామివారిదే. ఇక ప‌ద్మావ‌తి ప‌రిణ‌యం, బ్ర‌హ్మోత్స‌వాల వంటి ఉత్స‌వాల సంద‌ర్భంగా మ‌ల‌య‌ప్ప స్వామివారు గ‌జ‌, అశ్వ‌, గ‌రుడ‌, శేష త‌దిత‌ర వాహ‌నాల‌లో వైభవంగా ఊరేగుతూ భ‌క్తుల‌కు ఆశీస్సుల‌ను అందిస్తారు.

ఫోటో : టిటిడి సౌజన్యం