చేసేది బంగారు పని, తినడానికి తిండి లేదు

(Kannekanti Venkateswarlu*)
యావత్ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఏంతో మందికి ఉపాధి పోగొట్టి వారి జీవితాలను అతలాకుతలం చేసింది.
కరోనా నిరోధంలో  భాగంగా దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న దేశ వ్యాప్త లాక్ డౌన్   లక్షలాది మంది కూలీలు, కార్మికులు, ప్రధానంగా కుల వృత్తులపై ఆధారపడే లక్షలాది మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో కూడా చెప్పలేని దురవస్థ మధ్య వీళ్లంతా సతమతమవుతున్నారు.
 తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో బంగారు ఆభరణాలు చేసే వృత్తి పై దాదాపు 40 వేల విశ్వ బ్రాహ్మణ కుటుంబాలు ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నారు.
ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించడంతో బంగారు పనులు స్తంభించిపోవడంతో ఈ కుటుంబాలవారు అత్యంత దుర్భర జీవనాన్ని గడుపుతున్నారు.
అసలే, బడా సంస్థలు బంగారు ఆభరణాల విక్రయ షోరూంలను తెరవడం, ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్టు విస్తృత ప్రచారాన్ని నిర్వహించడంతో దాదాపు 80 శాతం మంది ఆభరణాలను రెడీ మెడ్ షోరూంలలో కొనుగోలుచేస్తున్నారు.
ఈపరిస్థితుల్లో చిన్న చిన్న ఆభరణాలు, మరమ్మతులు చేస్తూ జీవనాన్ని వెళ్ళదీసుకునే విశ్వబ్రాహ్మణులు లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయారు.
అసలే పనులు అంతంత మాత్రం ఉండడం, షాపుల అద్దెలు, విద్యుత్ చార్జీలు చెల్లిచాల్సి ఉండడంతో ఏ మాత్రం ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి మే, జూన్ మాసాల్లో పెద్ద సంఖ్యలో వివాహాది శుభకార్యాలు జరగడంతో ఈ కాలంలోనే ఆభరణాల తయారీ అర్దర్లు పొంది కొద్దిగా ఆదాయాన్ని గడిస్తారు.
గత రెండు నెలల నుండి బంగారం దిగుమతులుపూర్తిగా నిలిచిపోవడం,హైదరాబాద్, సికిందరాబాద్, జనరల్ బజార్లు మూసివుండడం, గత నాలుగు నెలలక్రితం ఒక తులం బంగారం ధర 38 వేల నుండి అనూహ్యంగా 50 వేల రూపాయలకు చేరుకోవడంతో మధ్యతరగతి వర్గంవారు బంగారం ఆభరణాల తయారీకి పూర్తిగా దూరమయ్యారు.
అటు, సంపన్నులు భారీ పరిమాణంలో బంగారు ఆభరణాలను బడా కంపెనీల వద్దనే కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ ఆశాజనకంగా లేకపోవడం. షేర్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల మినిమమ్ గారంటీగా ఉన్న బంగారాన్ని కిలోల చొప్పున కొనుగోలు చేసి ధనవంతులు ఇంట్లో నిల్వ చేయడం కూడా బంగారం ధర విపరీతంగా పెరిగింది.
ఇలా పలు కారణాల వల్ల ఆభరణాల తయారీ పై ఆధారపడి జీవనాన్ని గడిపే వేలాది విశ్వబ్రాహ్మణ కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది.
లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ వర్గాల వారికి ఆయా ప్రభుత్వం శాఖల ద్వారా పలు సహాయ సహకారాలు అందుతుండగా విశ్వ బ్రాహ్మణులకై ఏర్పాటు చేసిన విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏమాత్రం స్పందన లేకపోవడంతో అసలు ఈ ఫెడరేషన్ అస్తిత్వం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా ఆర్థికలేమి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవాలి.రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తిని గమనించాలి.
 (Kannekanti Venkateswarlu, President, Viswakarma Swarnakarula Sangham, Vanasthalipuram, Hyderabad)