ప్రపంచమంతా మారుమ్రోగుతున్న ఒకటే మాట ‘I Can’t Breathe’

(విజయసారధి రాజు )
అమెరికా రాజధాని ‘Washington’ కి సమీపంలో ఉన్న ‘Minneapolis’ అనే మహా నగరంలోని ‘Powderhorn’ అనే పార్కులో మే 25వ తేదీన జరిగిన ఓక సంఘటన యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది.
ఆ ఓక్క సంఘటన ఒక వ్యక్తి కుటుంబానికి తీరని అన్యాయం చేసింది, ఒక జాతి యావత్తు,మానవాళి మీద నమ్మకం కొల్పేయేల చేసింది. అభివృద్ధిలో ఆకాశాన్ని తాకిన ఒక దేశంలో అసమానతలు ఎలా ఉన్నాయో కళ్ళకు కట్టినట్లు చూపించింది, మొత్తంగా మనమంతా వ్యక్తులుగా ఎదిగినా సమాజంగా విఫలమయ్యామని తెలియచేసింది.
“I can’t breathe…”అనే ఈ మూడు పదాలు జార్జ్ పెరి ఫ్లాయడ్ (George Perry Floyd) అనే 46 ఏళ్ల వయసు గల నల్లజాతీయుడైన అమెరికన్ ప్రాణం పోతున్నపుడు కొనవూపిరితో  పలికిన చివరి మాటలు.
డెరెక్ చౌవిన్ (Derek Chauvin) అనే శ్వేత జాతీయుడైన ఒక అమెరికన్ పోలీసు, నిరాయుధుడైన ‘George Floyd’ ని నకిలీ ధనాన్ని మారుస్తున్నాడు అనే అభియోగం మీద నిర్బంధించే క్రమంలో బేడీలు వేసి బోర్లా పరుండబెట్టి మెడ మీద మొకలితో తీవ్రమైన ఒత్తిడితో తొక్కిపెట్టినప్పుడు, ఫ్లాయడ్ ప్రతిఘటించలేదు,
కేవలం తనకి తాగడానికి కొంచెం మంచినీరు ఇవ్వమని, తనకి ఊపిరి ఆడటం లేదు అని, తన తల్లిని పిలవమని మరియు తనని అకారణంగా చంపవద్దని వేడుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆ నల్ల జాతీయుడి వేడుకోలు పాషణ హృదయుడైన పోలీసు అధికారిని కరిగించలేకపోయింది. చివరికి అతడి మెదడులో ఉన్న జాత్యహంకారాన్ని మొత్తం మోకాళ్ళలోకి దించుకుని ఎనిమిది నిముషాల పాటు హింసించి ఫ్లాయడ్ ని ఆ కర్కశ పోలీసు అధికారి చంపేశాడు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమలలో వైరల్ అవుతున్న 8 నిమిషాల 46 సెకండ్ల వీడియోలో శ్వేత జాతీయుడైన పోలీసు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నల్ల జాతీయుల పట్ల తనలో గుడుకట్టుకున్న జాతి విద్వేషంతో ఉన్మాదిగా మారి ఓక నిండు ప్రాణాన్ని ఎలా బలిగొన్నాడో చూసి యావత్ ప్రపంచమే నివ్వెరపోతుంది.
అమెరికా జనాభాలో నల్లజాతీయులు 13 శాతం.
వందల ఏళ్ల క్రితం మొదలైన నల్లజాతీయుల పట్ల వివక్ష, చిన్నచూపు, ద్వేషం ఇప్పటికి కూడా కొంతమంది శ్వేత జాతీయులలో కొనసాగుతోంది. వందల ఏళ్ల తరబడి అణుఅణువునా ఇంకిపోయిన జాతి విద్వేషం ప్రస్తుత ప్రజాస్వామ్య వాతావరణంలో కూడా అప్పుడప్పుడు బుసలు కొడుతోంది.
నల్ల జాతి ప్రజలకు వ్యతిరేకంగా అమెరికన్ సమాజంలో ఉన్న విద్వేష, జాత్యహంకారపూరిత భావనలకు ఫ్లాయడ్ హత్య ఓక చిన్న ఉదాహరణ మాత్రమే.
రెండవ ప్రపంచయుద్ధం తదనంతర పరిణామాలతో మహా శక్తివంతంగా మారి, ఓక పెద్దన్న పాత్ర పోషిస్తూ, ప్రపంచం నలుమూలల జరుగుతున్న తీవ్రవాదం, మానవహక్కుల ఉల్లంఘనలు, మతస్వేచ్ఛకి విఘాతం కలిగినప్పుడు ఇతర దేశాల అంతర్గత విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ ఆంక్షలు విధిస్తూ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్న అమెరికా ఈ మారణకాండ గురించిగానీ, వివక్ష గురించిగానీ నోరు విప్పడం లేదు.
“Injustice anywhere is a threat to justice everywhere”
(ప్రపంచంలో అన్యాయం ఏ మూల జరిగినా అది న్యాయానికి ముప్పే).
జాతివివక్షని రూపుమాపేందుకు జీవితాంతం కృషి చేసి ప్రపంచ శాంతికి పాటుపడినందుకు గాను నోబెల్ బహుమతి అందుకున్న మహా నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King) అన్న మాటలు ఇవి. 1963వ సంవత్సరంలో పొరహక్కుల కోసం పోరాడుతున్న లక్షలాదిమంది ప్రజలనుద్దేశించి “I have a dream…” అంటూ ఆ మహనీయుడు చేసిన చారిత్రిక ఉపన్యాసంలో జాతి భేధాలతో నిమిత్తం లేకుండా మనుషులందరు సమానమే అని అమెరికన్ సమాజం త్వరలో తెలుసుకుంటుంది అని ఆకాంక్షించాడు. దశాబ్దాలు గడిచిపోయాయి కానీ మనుషులలో మార్పు రావటంలేదు.
మానవుడు నాగరికత వైపు పయనించేకొద్ది అతని ఆలోచనల పరిధి పెరగాలి.
కానీ, దురదృష్టవశాత్తు ఆలోచనల పరిధి పెరగకపోగా వికృతంగా మరియు అనాగరికంగా తయారవుతున్నాయి.
మన దేశంలో కూడా కుల, మత, జాతి, ప్రాంత విభేధాలతో విద్వేషాలను రాజేసి లబ్దిపొందాలని కోరుకునే కుహనావాదులకు కొదువేలేదు.
అటువంటి సమాజ స్థితే అభివృద్ధిని ఒడిసిపట్టిన అమెరికన్ సమాజంలో ఉంది అంటే నమ్మలేకపోతున్నాము.
మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మరితో బాధపడుతూ చావుబ్రతుకుల మధ్య పోరాడుతున్న రోగులను బ్రతికించడానికి వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు వారి ప్రాణాలని సైతం పణంగా పెట్టి కృషిచేస్తూ మానవత్వం పరిఢవిల్లుతున్న ఇటువంటి సమయంలో జాతి వివక్ష కారణంగా ఓక నల్ల జాతీయుడు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం.
జాతి వైరాన్ని సైతం మరిచి తోటి ప్రాణులకు సాయం చేసే జంతువులను చూస్తున్నాము. కానీ మనుషులు మాత్రం వివక్ష గా ప్రవర్తించడం మానటం లేదు.
జాతి / కుల వివక్ష కరోనా మహమ్మారి కంటే ప్రమాదం.
కరోనా మహమ్మరిని చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుని తరిమికొట్టవచ్చు,
కానీ కుల, మత, జాతి విద్వేషాలను మనుషుల మనసుల నుండి తొలగించాలి అంటే మాత్రం అది హృదయాన్ని జ్ఞానంతో కడగడం ద్వారా మాత్రమే
సాధ్యమౌతుంది.
అంతమాత్రాన శ్వేత జాతీయులు అందరూ జాతి వివక్ష ఉన్మాదంతో ఊగిపోతున్నారా అంటే కానే కాదు.
ఫ్లాయడ్ మరణానంతరం అమెరికాలో జరుగుతున్న జన నిరసనలలో అనేకమంది శ్వేత జాతీయులు కూడా పాల్గొంటున్నారు. నల్ల జాతీయుడి హత్యకి కారణమైన పోలీసు ఆఫీసరు చౌవిన్  భార్య,
తన భర్త చేసిన దురాగతాన్ని భరించలేకపోయింది, అందుకే జాత్యహంకారాన్ని నరనరాన ఎక్కించుకున్న భర్తతో జీవితాన్ని కొనసాగించలేను అని విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
అలాగే మిచిగాన్ నగరంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలో క్రిస్టోఫర్ అనే శ్వేత జాతీయుడైన పోలీసు అధికారి నిరసనకారులతో కలిసి తను కూడా సమానత్వం కోసం జరుగుతున్న ధర్మపోరాటంలో భాగస్వామ్యుడు అయ్యాడు.
అంతేగాక అమెరికా దేశవ్యాపితంగా పోలీసులు మోకాళ్ళ మీద నించొని జరిగిన దురాగతానికి క్షమాపణలు కోరుతున్నారు. ఇవన్నీ శుభ పరిణామాలు. భవిష్యత్తు మీద ఆశలు పెంచుతున్న సంఘటనలు.
ఓక మనిషి జీవితంలోని అత్యంత ముఖ్య ఘట్టాలైన పుట్టుక మరియు చావు అతని చేతిలో ఉండవు. ఓక వ్యక్తిని అతని గుణగణాలని బట్టి గౌరవించాలి. అంతేగాని రంగును బట్టో, కులాన్ని బట్టో నీచంగా చూడటం అమానుషం మాత్రమే గాక నేరం కూడా.!. మనిషి రంగు తెలుపు, నలుపు, ఎరుపు ఏ రంగులో ఉన్నా అతడు మనలాగే సాటి మనిషి అని, అతడి ప్రాణం కూడా మన ప్రాణంలాగే ఆముల్యమైనదని, జీవించే హక్కు మనకి ఎంత ఉందో అతడికి అంతే ఉందని, సమానత్వం అంటే ఒకరు పెట్టె భిక్ష కాదు అది ప్రతి మానవుడి కనీస ప్రాధమిక హక్కు అని ఈ వివక్షను మెదళ్ళ నిండా నింపుకున్న ఉన్మాదులకు ఆర్ధ్యమయ్యే విధంగా చెప్పగలగాలి. మనిషి శరీరం రంగు ఏదైనా ప్రతి ఒక్కరి హృదయం జాలి, దయ, కరుణ, ప్రేమతో మాత్రమే నిండి ఉండాలని మనం ఆచరించి ఇతరులకు చూపాలి. నల్ల జాతీయుడైన ‘George Floyd’ మరణం ఒక్కటే ఇ జాత్యహంకార మూర్ఖులను మార్చలేకపోవచ్చు. కానీ ప్రయత్నం అయితే మొదలవ్వాలిగా, అప్పుడేగా మార్పుని సాదించగలము.
“YES, I WANT TO BREATHE…”.