3 రాజధానులు మేలే…ఒక శ్వేతపత్రం విడుదల చేయండి: డా. ఇఎఎస్ శర్మ సూచన

(ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులని ప్రకటించాక చాలా మంది మేధావులు హర్షం వ్యక్తం చేశారు. వారిలో మాజీ IAS అధికారి, చట్ట ప్రకార పాలన (Rule of Law) కోసం ఎపుడూ పోరాడుతున్న మేధావి డాక్టర్ ఇ ఎ శర్మ ఒకరు.మంచి నిర్ణయాలు తీసుకుంటున్నపుడు కూడా ఎపుడు ప్రజాస్వామికంగానే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రికి సలహా ఇస్తూ ఈ రోజు లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని పరిస్థితి మీద ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని కూడా ఆయన సూచించారు. ఈ తెలుగు లేఖను యదాతథంగా ఇక్కడ అందిస్తున్నాం.)
ఒకే ఒక్క రాజధాని బదులు, మన రాష్ట్రంలో మూడు రాజధానులను మూడు ప్రాంతాలలో నిర్మించాలి అని మీరు తీసుకొన్న నిర్ణయం వలన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.  అందులో ఎటువంటి సందేహం లేదు.
కాని, రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొనే ముందు, ఏకపాక్షికంగా కాకుండా, ప్రజలతో విస్తృతంగా సంప్రతిందించి, ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ముందున్న ప్రభుత్వం ఎలాగ నిరంకుశత్వంగా ప్రవర్తించేదో అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా అటువంటి విషయాలలో తొందర నిర్ణయాలను తీసుకుంటే, విమర్శలకు గురి అయ్యే అవకాశం ఉంది.
రాజధానుల విషయంలో ఈ క్రింద సూచించిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నాను.

1.అమరావతిలో భారీ ఖర్చు పెట్టి, రాజధాని ముసుగులో పెద్ద ఎత్తున భవనాలను కట్టే ప్రణాళిక వలన, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఎలాగ ధ్వంసమయ్యాయో ప్రజలకు తెలుసు. ఐదేళ్లలో ముందున్న ప్రభుత్వం, శంకుస్థాపనలు మినహా, అమరావతిలో సాధించిందేమీ లేదు. అటువంటి ప్రక్రియ వలన, నష్టపడినవారు అక్కడి చిన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ముఖ్యంగా దళితులు. లాభాలు పొందిన వారు మోతుబరి రైతులు, ముఖ్యంగా నగరాలలో అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ గా కూచుని భోగాలు అనుభవించే వారు. 

2. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా విశాఖలో సెక్రెటేరియేట్ కట్టడం చేపడితే, అమరావతిలో జరిగిన భారీ నష్టాలు విశాఖ ప్రజలకు కలుగకూడదు. పూర్తిస్థాయిలో సెక్రెటేరియేట్ కట్టడం చిన్నపని కాదు. మంత్రులకు, సెక్రెటేరియేట్ అధికార యంత్రాన్గానికి, వివిధ శాఖల అధికారులకు కావలిసిన ఆఫీసు, రెసిడెన్షియల్ భవనాలు నిర్మించడం కోసం పెద్ద ఎత్తున ప్రజాధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. అందువలన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభాలు కలుగుతాయి. భవనాలను నిర్మించడానికి  సమయం పడుతుంది. రాష్ట్రం మరింత అప్పులు చేయవలసి ఉంటుంది.
3. ఒక్క చదరపు మైలు భూమి, సెక్రెటేరియేట్ కట్టడం కోసం కావాలంటే, వందలాది మందిని నిర్వాసితులుగా చేయాలి. వారి ఉపాధులు దెబ్బతింటాయి.
4. విశాఖలో ఇప్పటికే భయంకరమైన నీటి కొరత ఉంది. పోలవరం నీళ్లు వచ్చినా, నీటి సమస్య తగ్గదు.
5. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీ ప్రభుత్వం విశాఖలో పూర్తి స్థాయి సెక్రెటేరియేట్ కట్టడం అనే పథకాన్ని వదులుకుంటే మంచిది.
6. పూర్తి స్థాయి సెక్రెటేరియేట్ బదులు, సెక్రెటేరియేట్ వ్యవస్థను కొంతవరకూ వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది. సెక్రెటేరియేట్ లో కొన్ని శాఖలను మాత్రమే విశాఖలో పెట్టి, మిగిలిన భాగాలను కర్నూల్, అమరావతిలలో పెట్టాలి. వివిధ ప్రాంతాలలో వివిధ శాఖలు ఉన్నా, వీడియో కాన్ఫరెన్సు, ఇంటర్నెట్ ద్వారా సాంకేతికంగా వాటిని కలిపి ప్రజకు అందుబాటులో పనిచేయించ వచ్చు.
7. అలాగే, హైకోర్టు విషయంలో కూడా వికేంద్రీకరణ చేయడం ప్రజలకు సౌకర్యం కలిగించినట్లు అవుతుంది. సుప్రీమ్ కోర్టు వారి అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ప్రణాలికను అమలు చేస్తే న్యాయసేవలను ప్రజలదగ్గరకు తీసుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. కొన్ని రాష్ట్రాలలో రెండు నగరాలలో హైకోర్టు బెంచ్ లు పనిచేస్తున్నాయి.
8. శాసన సభల దృష్ట్యా కూడా, మూడు ప్రాంతాలకు ప్రాముఖ్యత ఇవ్వడం ఎంతో అవసరం. మహారాష్ట్రలో ఉన్న విధంగా సభల మీటింగులు మూడు ప్రాంతాలలో రొటేషన్ పద్ధతిలో జరుపవచ్చు.
6. ప్రభుత్వ విధానాలలో వికేంద్రీకరణ లేకపోవడం వలన, ప్రభుత్వాధికారాలు “రాజధాని” అనే వ్యవస్థలో కేంద్రీకరించ బడుతున్నాయి.  సెక్రెటేరియేట్, వివిధ శాఖల అధికారాలను సాధ్యమయినంత వరకు, క్రింద స్థాయి, అంటే జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయిలకు వికేంద్రీకరిస్తే, ప్రభుత్వ కార్యక్రమాలలో జవాబుదారీ తనం వస్తుంది. గ్రామ సభలు, పంచాయత్ లు, మునిసిపాలిటీలు, ఏరియా సభలు, వార్డ్ కమిటీలు రాజ్యాంగంద్వారా సృష్టించబడిన వ్యవస్థలు. ఆ వ్యవస్థలను బలపరిస్తే, ప్రజలకు రాష్త్ర ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం బలపడుతుంది.
పైన సూచించిన విధంగా, మీ ప్రభుత్వం ఒక ప్రణాలికను శ్వేతపత్రం ద్వారా తయారు చేసి ప్రజలముందు పెడితే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో అటువంటి చర్చ జరగడం వలన ప్రజా స్వామ్య వ్యవస్థ బలపడడమే కాకుండా, రాజకీయ పార్టీలకు కూడా మంచి కలుగుతుంది
మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకున్నా, తక్కువ ఖర్చుతో ప్రజల మీద అధిక భారం లేకుండా ఉన్నట్లు చూడాలి. ప్రభుత్వంలో ఫైవ్ స్టార్ సంస్కృతి ఉండకూడదు. ఎయిర్ కండిషన్డ్ వాతావరణం లేకపోతే ప్రభుత్వం పనిచేయలేదు అనే భావనను వదులుకోవాలి. దుబారా ఖర్చులను ఆపాలి. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బదులు, అధికారులే ప్రజల గడపలదగ్గరకు వెళ్లే విధానాలను ప్రవేశ పెట్టాలి.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగు అవ్వాలంటే, వ్యవసాయదారుల, మత్స్యకారుల, పాలు ఉత్పత్తి చేస్తున్న ప్రజల ఉపాధులను, జీవితాలను అభివృద్ధి చేయాలి. వారిని నిర్వాసితులుగా కాకుండా, భాగస్వాములుగా పరిగణించాలి. ఆలోచనా రహితంగా అనుమతిస్తున్న నగర విస్తరణ పథకాల కారణంగా, ఆక్వా ఫార్మింగ్ కారణంగా, వ్యవసాయ భూముల విస్తీర్ణాన్ని ప్రభుత్వాలు త్రగ్గిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా అది మంచిది కాదు   
 
ఈ విషయాలను మీరు పరిశీలించి, ప్రజలతో విస్తృతంగా సంప్రదించి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారని ఆశిస్తున్నాను.