లిక్టెన్ స్టేన్ దేశ జనాభా 40 వేలు, అయితేనేం సంపన్నదేశం… (యూరోప్ యాత్ర 6)

(డా. కే.వి.ఆర్.రావు)
మా యూరప్ యాత్ర, ఆరో భాగం: వాడుజ్ (లిక్టెన్ స్టైన్), ఇన్స్ బ్రుక్ (ఆస్ట్రియా)
పదకొండవరోజు జ్యూరిక్ లో బయలుదేరి పచ్చని కొండల మధ్య ప్రయాణం చేసి గంటన్నర తరువాత ‘వాడుజ్’ (Vaduz) అనే అందమైన చిన్న పట్టణానికి చేరాము. అది ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటైన లిక్టెన్ స్టేన్ (Liechtenstein)  అనే దేశానికి రాజధాని. ఇది స్విట్జర్ ల్యాండ్ ఆస్ట్రియాల మధ్య ఆల్ప్స్ పర్వతాలలో ఉంది. ఆదేశం మొత్తం వైశాల్యం నూటఅరవై చదరపు కిలోమీటర్లు. జనాభా నలభైవేలు మాత్రమే.
ఒకవైపు పచ్చటి పర్వతాలు, మరోవైపు కొద్దిదూరం వరకు మైదానాలు, ఆ తరువాత కొండలు కనిపించాయి. క్యాజిల్ లాంటి ఆ దేశపు రాజుగారి భవనం కొండవాలున ఉంది.
ఊరి మొదట్లో బస్ స్టేషన్ లాంటి చోత బస్సు దిగాము. వెంటనే మమ్మల్ని ఒక బొమ్మ ట్రైన్ లాంటి చిన్న ట్రైన్లో ఎక్కించి చుట్టుపక్కలంతా చూపించారు. కొండప్రాంతం కాబట్టి ఎత్తులు పల్లాలుగా ఉంది. ఊరంతా మంచిరోడ్లు, భవనాలు ఉన్నా బహుళ అంతస్తుల భవనాలు లేవు. అక్కడక్కడా పాత పెంకులకప్పుల భవనాలు, ద్రాక్షతోటలు ఉన్నాయి.
ఊరంతా చక్కగా తీర్చిదిద్దినట్టుగా పలుచని ట్రాఫిక్ తో పెద్దగా సందడిలేకుండా ఉంది. ఆ చిన్న ఊర్లో అన్నివసతులూ ఉన్నాయి. మనుషులూ పెద్దగా కనపడలేదు. అంత చిన్న దేశం ప్రపంచలోని ధనికదేశాలలో ఒకటంటే ఆశ్చర్యమైంది.
ఇదివరకు ఆదేశంలోని బ్యాంకులుకూడా స్విస్ బ్యాంకుల్లాగా నల్లధనాన్ని తీసుకునేవట. ప్రపంచ ఆర్థికసంస్థలు వాటిని కొన్నాళ్లపాటు బ్లాక్ లిస్ట్ లో ఉంచాయట. తరువాత అవి అలాంటి పనులు చేయడం మానేశాయి అని చెప్పారు.
మేము బస్సు దిగిన చోటే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అందులో కొన్ని షాపుల్లో మన రూపాయలు కూడా తీసుకుంటున్నారు. అక్కడ ఎక్కువగా స్విస్ చాక్లెట్లు, ఙ్ఞాపికలు అమ్ముతున్నారు.
షాపింగ్ తరువాత ఒక ఇండియన్ రెస్టారెంట్ లో భోజనంచేసి బయలుదేరి మరో రెండున్నర గంటల తరువాత ఆస్ట్రియాలోని ‘ఇన్స్ బ్రూక్’ నగరానికి చేరాము.
ఆస్ట్రియా దేశానికి చెందిన ఇన్స్ బ్రూక్ నగరం దాదాపు ఆల్ప్స్ పర్వత చివరిప్రాంతంలో ఇన్ అనే నదివొడ్డున ఉంది. ఇన్స్ బ్రూక్ అంటే ‘ఇన్’ నదిపైన వంతెన అని అర్థమట. పూర్వం ప్రయాణీకులు నదిని దాటడానికి ఆప్రదేశంలో వంతెన కట్టడంవల్ల అక్కడ ఊరు ఏర్పడి ఆపేరు స్థిరపడిందట.
‘ఇన్స్ బ్రూక్’ అల్ప్స్ పర్వతాల్లో ఇటలీవైపునున్న చివరి నగరం. అక్కడినుంచి ముప్పైమైళ్లదూరంలో బ్రెన్నెర్ పాస్ తరువాత ఇటలీలోని మైదానప్రాంతం ప్రారంభమౌతుంది. ఆపైన సముద్ర తీరంలో రేవుపట్టణమైన వెనిస్ నగరం ఉంది.
పూర్వకాలంనుంచి వెనిస్ సముద్రతీరం, తూర్పు యూరప్ ప్రాంతాల మధ్య రవాణాకు ఈదారే ఉపయోగించడం వల్ల ఈనగరానికి చారిత్రక ప్రాముఖ్యం ఉంది. చుట్టూ ఎత్తైన పర్వతాల వరుసల ఉండడంవల్ల ఆ నగరం టూరిజానికి, శీతాకాలపు ఆటలకి ప్రసిద్ధి.
ఇప్పటికీ నగరంలో చాలాభాగం ప్రత్యేకమైన ఆకృతిగల పాతభవనాలతో ఉంటుంది. మేము ఊర్లోకి ప్రవేశించగానే బస్సు దిగి ఇన్ నదిని, దానిమీదున్న చారిత్రిక పాతవంతెనని చూసి, పాత వూర్లోని వీధులగుండా నడుస్తూ రెండు, మూడు శతాబ్ధాలనాటి భవనాలను చూశాము. అందులో ప్రఖ్యాత సంగీతకారుడు మొజార్ట్ ఉండిన హోటల్, రాజవంశీకులు బసచేసిన బంగారురంగు కప్పుగల భవనం, హాఫ్ బెర్క్ ప్యాలెస్ లు ముఖ్యమైనవి.
ఆవీధుల్లో షాపులుకూడా సాధారణంగా ఉన్నాయి. ఇతరనగరాల్లోలాగ పోష్ గా లేవు.
బంగారురంగు కప్పుగల భవనం ఎదురుగావున్న మారియా థెరెసియన్ వీధిలోకెళ్లి అక్కడ వీధిమధ్యలోవున్న సెయింట్ ఆన్స్ చారిత్రక స్తంభాన్ని చూశాము. ఆ స్థంభాన్ని స్పానిష్ యుద్ధసమయంలో సాధించిన విజయానికి గుర్తుగా 1703 లో నిలబెట్టారట.
ఆ వీధిమధ్యలోకి వ్యాపించిన రెస్టారెంట్లలో ఆ స్లీపీ నగరానికి తగ్గట్టే కస్టమర్లు తీరిగ్గా కూర్చుని నిదానంగా తింటూ, తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. మొత్తానికి ఆ పాతవూరు మన ఉత్తరభారత దేశంలోని కొన్ని చారిత్రక నగరాలను పోలివుంది. కాకపోతే ఇక్కడ జనం తక్కువగా, శుభ్రత ఎక్కువగా ఉన్నాయి.
అక్కడి ఇతర విశేషభవనాలను, నిలువెత్తు స్థంభాల రొమన్ శైలిలోవున్న ఒక నాటక థియేటర్ ను, పార్కును చూసి బస్సెక్కి అరగంట ప్రయాణం చేసి వాటన్ కి వెళ్లాము.
వాటన్ 1895 లో డేనియల్ స్వరోవ్ స్కి స్థాపించిన గాజు క్రిస్టల్స్ తయారీ సంస్థ ద్వారా ప్రసిద్ధి చెందిన చిన్న టౌను. స్వరొవ్ స్కి సంస్థ ప్రస్తుతం 170 దేశాల్లో 3,000 షాపులద్వారా క్రిస్టల్ వజ్రాల, ఆభరణాల వ్యాపారం చేస్తోంది. వాటన్ లోని ఆ విశాలమైన ఆవరణలో ఫ్యాక్టరి భవనాలు, మ్యూజియం, పార్కు, పచ్చికబయళ్లు ఉన్నాయి.
బస్సుదిగి తిన్నగా అదే ఆవరణలోవున్నస్వరొవ్ స్కి మ్యూజియంకెళ్లాము. ఆ మ్యూజియంలో వరసగా చీకటి గదుల్లో లైట్ షోలున్నాయి. ఒకగదిలోంచి మరోగదిలోకి వెళ్తూ చూడాలి. కాంతిపుంజాల సహాయంతో అనేక ఆకృతులుగల భారీ క్రిస్టల్ నిర్మాణాలను చూపిస్తూంటారు. నగలు, ఆభరణాలేకాక, మన తాజ్ మహల్ తోపాటు ప్రపంచంలో అనేక ప్రసిద్ధిపొందిన నిర్మాణాలను క్రిస్టల్స్ తో నిర్మించిన ఆకృతులుగా చీకట్లో మెరుస్తూ కనిపిస్తూంటాయి.
విశ్వానికి, మనిషి జీవితానికి వివిధ క్రిస్టల్స్ రూపాలయొక్క భౌతిక, తాత్విక సంబంధాలను కాంతుల సహాయంతో వివరించబడింది. అదంతా ఒక చీకటి వెలుగుల మాయాలోకంలో తిరుగుతున్నట్టుంటుంది.
మ్యుజియంనుంచి బయటకు వచ్చాక వాళ్ల విశాలమైన అవుట్ లెట్ షాపుల్లోకి వెళ్లాము. అక్కడ మా యాత్రికులందరం చిన్నవో పెద్దవో క్రిష్టల్ ఆభరణాలు కొన్నాం. యూరప్ దేశాల పౌరులు కానివారు అక్కడ వంద యూరోలకు పైగా కొంటే ట్యాక్స్ వాపసు ఇచ్చే సౌకర్యం ఇక్కడకూడా ఉంది. ఐతే ఆ డబ్బుని రోం ఎయిర్ పోర్ట్ లో మాత్రమే రసీదు చూపించి వసూలు చేసుకోవాలి.
ఆ తరువాత వాళ్లదే ఒక పార్కులో విశ్రాంతిగా గడిపాము. ఆ పార్కు కూడా థీమాటిక్ గా కొన్ని విశేష నిర్మాణాలతో ఆసక్తికరంగా ఉంది.
అందరూ తిరిగొచ్చాక బస్సెక్కి కొద్దిదూరంలో కొండపైనున్న సీఫెల్ గ్రామంలోని హోటేల్ లో ఆ రాత్రి బస చేసాం. సౌకర్యాలు తక్కువగా ఉన్నా, ఆ హోటల్ ఎత్తైన చెట్లమధ్య గ్రామీణ శైలిలో కట్టబడి ఒక మిస్టిక్ వాతావరణంతో ఉంది.
(తరువాయి ఏడవభాగంలో )
అయిదో భాగం ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/english/features/switzeland-mount-titlis-jungfraujochs-only-restaurant-is-indian-name-bollywood/