Home Features పరువా, పదవా : ప్రపంచంలో ఏది గొప్ప?

పరువా, పదవా : ప్రపంచంలో ఏది గొప్ప?

134
0
SHARE
(మార్తి సుబ్రహ్మణ్యం*)

తెలుగు భాష మీద ముగ్గురు మేధావుల కుప్పిగంతులు, ప్రపంచంలో పదవే గొప్పది

స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదు పొమ్మంటాడు కన్యాశుల్కంలో గిరీశం. గురజాడ వారి కన్యాశుల్కం ఆ కాలంలో ఎంతమందిని ప్రభావితం చేసిందో తెలియదు గానీ, ఈ కాలంలో మాత్రం మహాద్భుతంగా, పరమాద్భుతంగా ప్రభావితం చేస్తోంది.  అందులో గిరీశం పాత్ర ఒక గైడ్. ఫిలాసర్‌లా ఉంటుంది.
అసలు తనతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అని ఫీలయ్యే క్యారక్టరది. అవసరార్ధం అబద్ధం చెప్పడం తప్పేకాదని, ఒప్పున్నర ఒప్పని చెప్పే పాత్ర.  ఇచ్చిన మాటకు కట్టుబడాల్సిన అగత్యం అస్సలక్కర్లేదని చెప్పే గిరీశాన్ని చంపి పుట్టిన, ఆధునిక గిరీశాలను చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. ఛాతీ వెడల్పవుతుంది.  అసలు గిరీశం బతికి ఉంటే తన మాటలు జీవితంలోనే ఓ భాగమయిందేమిటని మురిసి ముక్కలయ్యేవాడు. నిజం.
ఇప్పుడు ఈ కలియుగంలో గజానికో గాంధిరి పుత్రుడున్నట్లు.. గంటకో గిరీశాలు ఉద్భవిస్తున్నారు. ఇది నిజంగా నిఝం!
మన తెలుగు తల్లి ముద్దబిడ్డలయిన యార్లగ డ్డ లక్ష్మీప్రసాద్, కొండుభట్ల రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్ చేసిన పాత, కొత్త స్టేట్‌మెంట్లను చూస్తే గిరీశం ఎక్కడో లేరు. మన మధ్యలో మనుషుల రూపంలో సంచరిస్తున్నారన్న సత్యం బోధపడుతుంది.
మీకు తె లిసేఉంటుంది. ఈ మధ్య ఏపీలో జగన్ సర్కారు జర్నలిస్టులకు సంబంధించి ఒక ఉత్తర్వు ఇచ్చింది. అది మీడియా దూకుడుకు ముకుతాడు వేసే ఆర్డరు. ఎవరైనా ఆధారాలు లేకుండా సర్కారుపై వార్తలు రాస్తే, అతగాడికి కోర్టు నోటీసులు వెళతాయన్న మాట. సరిగ్గా ఇలాంటి ఉత్తర్వునే అప్పట్లో మహానేత వైఎస్ కూడా ఇచ్చి, అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనక్కి తీసుకున్నారు. దానిపై ‘చేయి తిరిగిన’ ఇద్దరు లబ్ధప్రతిష్ఠులైన తాజా, మాజీ జర్నలిస్టులు ఆరోజుల్లో రాసిన రాతలు-మాటలు కొన్నేళ్ల తర్వాత మహామలుపు తిరిగి, ఇప్పుడు వాటికి  భిన్నంగా మారాయి. వారిద్దరి నాటి-నేటి ప్రకటనలు, రాతలు చూస్తే గిరీశం మనలోనే ఉన్నారని మెడపై తల ఉన్న వారిె రికయినా అనిపిస్తుంది.
వైఎస్ జమానాలో మీడియా గొంతుపై కత్తి వేళ్లాడదీస్తూ ఇచ్చిన ఉత్తర్వుపై ఆరోజుల్లో ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా ఉన్న కొండుభట్ల రామచంద్రమూర్తి అగ్గిరాముడయ్యారు. ప్రభుత్వాలకు ఇది తగదని హితవు పలికారు. ప్రశ్నించడం పత్రికల హక్కన్నారు. అలాంటి నల్ల జీఓతో సర్కారుకు పోగాలం దాపురించిందని శపించారు. అర్థరాత్రి ఉత్తర్వును ఉపసంహరించుకున్నందును సర్కారును అభినందించారు.
ఇప్పుడు అదే రామచంద్రమూర్తి పరాయి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడయ్యారు. రాష్ట్రం విడిపోయేందుకు జరిగిన ఉద్యమాలు, విడిపోవాలన్న తెలంగాణ ప్రజల మానసిక భావనకు ‘దశ-దిశా’నిర్దేశం చేశారు. దాని ఫలితంగా విడగొట్టబడిన పక్క రాష్ట్రానికి విధానాలు ఎలా ఉండాలో చెప్పే సలహాదారుడయ్యారు. సరే- సొంత రాష్ట్రం గౌరవించని పెద్దమనిషిని, పక్క రాష్ట్రం ఎలా సలహాదారుగా తీసుకుందన్నది వేరే అంశం.
ఇప్పుడు ఆయన కొలువిచ్చిన పాలకులు తెచ్చిన నల్ల జీఓను పదహారణాల ప్రజాస్వామ్యవాదయిన కొండుభట్ల వారు ఖచ్చిత ంగా ఖండించి, నాడు వైఎస్ దగ్గరికి వెళ్లినట్లే (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మాటల ప్రకారం) నేడు ఆయన కుమారుడి వద్దకు వెళ్లి, మంచిచెడూ చెబుతారేమోనని చాలామంది భావించారు, భ్రమించారు. కానీ, విచిత్రంగా ఆ ఉత్తర్వును సహృదయంతో, నిర్భయంగా స్వాగతించి బల్లగుద్ది మరీ బలపరచడం చాలామందిని నివ్వెరపరిచింది. చివరాఖరకు తాను ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు రాసిన సంపాదకీయ తనది కాదని, అయినప్పటికీ దానికి తనదే బాధ్యత అని నిండుమనసుతో అంగీకరించడమే గొప్ప. రామచంద్రుల వారేమన్నారో తెలుసా?
 ‘2007లో వైఎస్ ఇచ్చిన వివాదాస్పద జీఓ గురించి రాజశేఖరరెడ్డి నన్ను పిలిచి మాట్లాడారు. ఆ తర్వాతనే దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత దూషణలు, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వార్తలు రాస్తే ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయా? అని వైఎస్ ప్రశ్నిస్తే, ఎవరైనా వ్యక్తి ప్రతిష్ఠ గానీ, ప్రభుత్వ ప్రతిష్ఠను గానీ దెబ్బతీస్తే ఊరుకోరని నేను వైఎస్‌కు ఆరోజే చెప్పాను. మీ రిజాయిండర్లు నాదాకా రాలేదని చెబితే అవి మీ వద్దకు రావులేనని వైఎస్ నవ్వారు. నేను ఎప్పుడూ పేదల సంక్షేమం కోసమే పనిచేశా’నని మూర్తి గారు ఆంధ్రజ్యోతికి రాసిన లేఖలో చెప్పారు.
సరే.. మరి తన పత్రికను అణచివేయాలని చూసిన వైఎస్‌ను రామచంద్రమూర్తి కలిసిన విషయం తనకు చెప్పలేదని, ఆ రెండు పత్రికలంటూ విషం కక్కిన వైఎస్ మాటలను, అక్కడే ఉన్న రామచంద్రమూర్తి ఎందుకు ఖండించలేదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కాలంలో రాసుకున్నారు. సరే ఆ లొల్లి పంచాయితీని పక్కకుబెడితే.. అసలు ఇంతకాలం సంపాదకులనేవారు సంపాదకీయాలు రాస్తారనుకుని భ్రమించిన తెలుగు పాఠకలోకం కళ్లను… ఆ సంపాదకీయం తాను రాయలేదని కుండబద్ధలు కొట్టి తెరిపించిన  కొండుభట్ల వారిని అభినందించని వారు, సన్మానించని వారు  పాపాత్ముల కిందే లెక్క.
‘2007 ఫిబ్రవరి 23న ఆంధ్ర జ్యోతిలో ప్రచురించిన సంపాదకీయం ఇప్పుడు చదువుతుంటే అది నేను రాసింది కాదనే అభిప్రాయం కలుగుతోంది. అంత పరుషమైన వాక్యాలు రాయడం నా స్వభావం కాదు. చాలా సంవత్సరాల క్రితం జరిగింది కనుక  నా అభిప్రాయం తప్పు  కావచ్చ’ని నిర్భయంగా అంగీకరించారు. సహజంగా ఏ రచయితయినా తన శైలిని ఎన్నేళ్ల తర్వాతయినా ఇట్టే గుర్తు పడతారు. కానీ రామచంద్రుల వారు మాత్రం అది నాది కాదేమోనన్న అభిప్రాయం కలుగుతోందన్నారు.
సరే వదిలేద్దాం.  అంటే ఆ ప్రకారంగా.. దినపత్రికల్లో ఏ ఘోస్టు రైటర్లో, ఎడిటోరియల్ డెస్కులో ఏ సీనియర్ సబ్ ఎడిటర్ మస్తిష్కం నుంచో ఉద్భవించే సంపాదకీయాలకే, సోకాల్డ్ సంపాదకులు తమ పేరు తగిలించుకుంటున్నారన్న నగ్న సత్యాన్ని ఆవిష్కరించిన రామచంద్రమూర్తి గారి నిజాయితీ, నిబద్ధతను మెచ్చి తీరవలసిందే. ఈ రోజుల్లో ఉన్నమాట చెప్పడం ఎంతమందికి సాధ్యం చెప్పండి?
సరే..  పక్క రాష్ట్రం నుంచి ఏరికోరి సలహాదారుగా తెచ్చుకున్న మాజీ జర్నలిస్టు  నేత దేవులపల్లి అమర్ చేసిన పాత-కొత్త ప్రకటనల్లోకి తొంగిచూస్తే.. ఆయనా అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలు వైఎస్ జమానాలో అలాంటి ఉత్తర్వు రాలేదని ఖరాఖండిగా చెప్పారు. ఆయన కూడా సేమ్ టు సేమ్ నేను అలాంటి వ్యాసాలు రాశానా? నాకు గుర్తు లేదే? అనేశారు. మరి రామచంద్రమూర్తి గారు చెప్పింది నిజమా? అబద్ధమా? అమరన్నే తే ల్చాలి. ఒకవేళ అమర్ చెప్పిందే నిజమైతే రామచంద్రమూర్తి గారు చెప్పింది అబద్ధమయి ఉండాలి.
ఆయన వైఎస్ వద్దకు వెళ్లిన తర్వాతనే జీఓ రద్దయినదనీ అబద్ధమయి ఉండాలి. అలాకాకుండా, అమర్ చెప్పిందే నిజమైతే రామచంద్రుల వారు అసత్యం చెప్పినట్లు భావించాలి. ఇదే దేవులపల్లి అమర్, గత టిడిపి సర్కారు అనుసరించిన మీడియా వ్యతిరేక వైఖరిపై సాక్షిలో ఒంటికాలితో లేచారు. ‘నియంతల కాలం కాదు కదా!’.. ‘అక్షరాన్ని అపార్ధం చేసుకోవద్దు’.. ‘కలాల బలం ఇక కలేనా?’.. ‘హద్దు మీరిన ప్రభుభక్తి’  అన్న  శీర్షికలతో సాక్షిలో వ్యాసరాజాలు లిఖించారు.
అయితే.. అమర్ గారు ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు ‘అవునా? నేను అలాంటి వ్యాసాలు రాసినట్లు గుర్తు లేదే? మీ దగ్గర ఉంటే నాకు పంపించండి’ అని విలేకరులను అమాయకంగా కోరటం చూస్తే.. గిరీశం వారసులు మన మధ్యలో మానవావతారాలెత్తి సంచరిస్తున్నారనిపిస్తోంది.
ఆ.. వీరిద్దరే కదా? అనుకోకండి. మరో త్రిమూర్తి కూడా ఉన్నారు. ఆయనే హిందీ పండితులు యార్లగడ్డ లక్ష్మీప్రసాదు.
ఆయన హిందీ పండితుడిగా లబద్ధ ప్రతిష్ఠుడైన ‘సామాజి’క సృ్పహ ఉన్న వ్యక్తి. ఇంకా గుర్తుకు రాలేదా? అదేనండీ… ఎవరు ప్రధానులుగా ఉన్నా, రాష్ట్రపతులుగా ఉన్నా, కేంద్రమంత్రులుగా ఉన్నా వారి వద్దకు వెళ్లి పుస్తకాలు బహుకరిస్తుంటారే? గతంలో ఎన్టీరామారావు, దగ్గుబాటి, దివంగత నందమూరి హరికృష్ణ, ఇంకా జడ్జిలతో కలసి కనిపిస్తుంటారే? ఆయన! పేరుకు ఆయన హిందీ ఆచార్యుల వారయినా తెలుగు భాషా పిపాసి. తెలుగుకు కష్టం వస్తే తనకే కష్టం వచ్చినంతగా విలవిల్లాడే భాషాభిమాని.  ఆ మేరకు పాలకులు తెలుగుకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై పరశురాముడవుతుంటారు. పత్రికల్లో వ్యాసాలతోపాటు, మీడియా పేరంటం పెట్టి మరీ వాపోతుంటారు.
గతంలో చంద్రబాబు నాయుడు సర్కారు మున్సిపాలిటీ స్కూళ్ల స్థాయిలో ఇంగ్లీషు మీడియం  ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ఆగమాగం చేసిన ఆచార్యుడు. ఇంగ్లీషు మీడియంపై పునరాలోచించాలని, ఇలా తెలుగును చంపేసినందుకు సిగ్గులేదా అని  కన్నెర్ర చేసి, ఆంగ్ల పాఠశాలలుగా మార్చడం అమానుషమని ఘోషించి, సర్కారు నిర్ణయానికి మనసు చలించిన యార్లగడ్డ వారు ఏకంగా గాంధీ విగ్రహం వద్ద చొక్కా తీసి మరీ నిరసన వ్రతం చేసిన నిఖార్సయిన పదహారణాల తెలుగు భాషా పిపాసి.
‘ప్రాథమిక దశలో మాతృ భాష బలంగా ఉంటే మానసిక వికాసం బాగుంటుంది. మాతృభాషలో చదివిన వారే ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారని  ఎడ్వర్డ్ వర్శిటీ నిపుణులు తేల్చారు. తెలుగు భాష, సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఖండించాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని దిగజారుస్తున్న చంద్రబాబును ప్రజలు, భాషాభిమానులు నిలదీయాల’ని పిలుపునిచ్చిన ఈ ప్రసాదు… జగన్ సర్కారు కొలువులో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి ప్రసాదం స్వీకరించిన తర్వాత, ఆ ఇద్దరి మాదిరిగానే మాట మార్చేసి, గిరీశానికే గుగ్గురువుననిపించుకున్నారు.
జగన్ సర్కారు ఇచ్చిన ఇంగ్లీషు మీడియంలో బోధన ఉత్తర్వుపై ఆచార్యుల వారేమన్నారో తెలుసా? ‘పేద బడుగు, బలహీన వర్గాల అభీష్టం మేరకే జగన్ అన్ని స్కూళ్లలో ఆంగ్లం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పాదయాత్రలో ఆయన ఆ మేరకు ప్రజలకు హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల వారు ఇంగ్లీషు చదువుకోకూడదా? అర్ధం చేసుకోండి. జీఓ స్పష్టంగా ఉంది. అన్ని స్కూళ్లలోనూ తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుంది. తెలుగు భాషకు మేలు జరిగింది. నన్ను కొట్టినా, తిట్టినా ఫర్వాలేద’ని నిర్భయంగా సెలవిచ్చారు.
మరి గతంలో చంద్రబాబు ఇలాంటి ప్రయత్నమే చేస్తే, దానిని తానెందుకు వ్యతిరేకించారో కూడా ఆచార్యుల వారు, అదే నోటితో సెలవిస్తే బాగుండేది. అయితే సరైన వారినే జగన్‌బాబు సలహాదారులుగా పెట్టుకున్నారని, ఆయన ఎంపికలో తప్పులేదనిపించక మానదు. మొత్తానికి గిరీశానిగే గుగ్గురువులుగా మారిన ఈ త్రిమూర్తులు మన తెలుగునేలకు ఆదర్శ పురుషులే. పదవుల్లో ఇంత పరమార్ధం, పరమాన్నం ఉంటుందన్న మాట. దాని ముందు ఆదర్శాలు, ఆవకాయలూ బలాదూర్!
(మార్తి సుబ్రహ్మణ్యం,సీనియర్ జర్నలిస్టు. ఎడిటర్ సూర్య వెబ్ సైట్. ఈ వ్యాసం మొదట సూర్యలో అచ్చయింది.)

 

(ఇందులో వ్యక్తీకరించివన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)