చిన్నప్పటి మాట :నారాయణ బొరుగుల మసాలా నాటి మేటి స్నాక్

(బి వి మూర్తి)
అనంతపురంలో రఘువీర థియేటర్ రెండు గేట్లకు మధ్యన రోడ్డు పక్కన ఉండే బొరుగుల బండికి సర్వం సహా సార్వభౌముడు నారాయణ. మా విద్యార్థి మిత్రులందరం బొరుగుల నారాయణకు వీరభక్తులమే. అంతకు ముందు అక్కడ ఎన్నేళ్ల నుంచి ఉన్నాడో నాకు తెలీదు గానీ మా నాలుకలకు ఆయన బొరుగుల పరిచయ భాగ్యమబ్బే సరికి ఇప్పుడు విరాట్ కోహ్లీ లాగా ప్రచండమైన ఫార్మ్ లో ఉన్నాడతను. 
అప్పటికి, అంటే 1970 దశకం పూర్వార్ధంలో మేం డిగ్రీ చదివేనాటికి నారాయణకు ముఫ్పై ముఫ్పయిదేళ్లుంటాయేమో. రెండు భుజాలెగరేస్తూ ఒక్క క్షణం వ్యర్థం చేయకుండా నిమిషానికి నాలుగైదు బొరుగుల మసాలా పొట్లాలను అతి సులభంగా సృష్టించి లెక్క ప్రకారం చేతి కందించే ఆ బక్క పల్చని శాల్తీ చాకచక్యానికి ఆశ్చర్యపడని వారుండరు.
పది పదహైదు మంది కాచుకుని ఉన్నా ఎవరు ముందో ఎవరు తర్వాతో కచ్చితంగా లెక్క కట్టి పొట్లాలు పంచి పెట్టేవాడు. అప్పుడప్పుడు ఎవరైనా అసహనానికి గురై పక్షపాతమంటూ ఆరోపించినా ఎంత మాత్రం నొచ్చుకోకుండా ఎవరి తర్వాతెవరో కచ్చితంగా ఒప్పజెప్పి మరీ నచ్చేజెప్పేవాడు. బండిలో ముక్కాలు భాగం నిండి పోయిన గ్లాసు బొరుగులను (బొరుగుల్లో ఇదో రకం. ఇవి కొంచెం పెళుసుగా సులభంగా చిట్లిపోయేలా ఉంటాయి) ఒక కొలత కప్పుతో గబగబా గిన్నెలోకి వేసుకోడంతో మొదలవుతుందతని మసాలా బొరుగుల ఉత్పత్తి చక్రం. ముందుగానే తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డల ముక్కలను ఐదు వేళ్లతో ధారాళంగా విసిరేస్తాడు. కారం పొడి, ఉప్పూ, ధనియాల పొడి మూడు వేళ్లతో తీసుకుని కుంకుమార్చన చేసినట్టు మంత్రించి పడేస్తాడు. ఆ వెంటనే దాంట్లోకి సన్న కారాల మిక్చర్ ను కలిపేస్తాడు. 
చివర్లో నిమ్మకాయ ఒప్పు బుగ్గలు చిదిమి నాలుగైదు బొట్లు పడగానే మంత్రం పుల్లను అందుకుంటాడు. వొంటి నిండా కారం ఉప్పు పూసుకుని నిగనిగలాడుతుంటుందది, దాంతో గిన్నెలోని మిశ్రమాన్ని ఏడెనిమిది సార్లు టకటక లాడించేసరికి మసాలా బొరుగులు రెడీ. వీటిని మూడు నాలుగు త్రిభుజాకారం పొట్లాల్లోకి సమానంగా సర్దెయ్యడంతో ఒక చక్రం పూర్తవుతుంది. 
అప్పుడప్పుడు బొరుగుల కుప్పను చేతి కందేలా సరి చేస్తున్నా, నిమ్మకాయలను ఒప్పులుగా తరుగుతున్నా, అయిపోతున్న కారం, ఉప్పూ, ధనియాల పొడిని చిన్న గిన్నెల్లోకి నింపుతున్నా బొరుగుల నారాయణ రిదం ఎంతమాత్రం దెబ్బ తినదు. వేగం కొంచమైనా తగ్గదు. నిమిషానికి కనీసం రెండు చక్రాలు పూర్తయి తీరవలసిందే. చేతులు, భుజాల కదలికలకు అనుగుణంగా తలను చిత్రంగా కదిలిస్తూ గిన్నెను టకటకలాడిస్తున్నప్పుడే ఈ విడత పొట్లాలను ఎవరెవరికి పంచాలో నిర్ణయమై పోతుంది.
అంతా లెక్క ప్రకారం జరిగిపోతున్నా బండి దగ్గరకు కొత్తగా ఎవరెవరు వచ్చి చేరుతున్నారో గమనిస్తూనే ఉంటాడతను. 
సాయంత్రం వేళ ఆ పొట్లం చేతి కందితే ఇంద్ర పదవి అందినట్టే లెక్క. నాలుక తుప్పు వదిలి పోయేదంతే. కారం, ధనియాలు, ఎర్రగడ్డల ఘాటును తడిసీ తడియని బొరుగులు తటస్ఠం చేసేందుకు నానా యాతనా పడుతుంటే, నిమ్మ రసం చుక్క అక్కడక్కడా చురుక్కు మంటూ కథను మళ్లీ మొదటికి తెస్తుంటుంది. మధ్యలో ఆ కొత్తిమీరొకటి, చిగుళ్లకు అతుక్కుని చిరచిర లాడుతుంటుంది. పొట్లంలో సరుకు చేతి కందనంత అడుక్కు పడిపోయాక పొట్లం విప్పేసి అడుగూబొడుగూ అంతటినీ పేపర్ మధ్యకు తెచ్చేసి అరచేతిలోకి వొంపుకొని చివరాఖరికి ఆరగిస్తామే అదీ లాస్ట్ పఫ్ రుచంటే. అడుక్కు తేలిన మసాలా ఒక్కసారిగా నాలుక్కి తగిలి కిక్కెక్కిస్తుంది.
నారాయణ గిరాకీలన్నీ ప్రధానంగా స్టూడెంట్సేనేమో. స్టూడెంట్సంటే షరా మామూలుగా సాయంకాలాలు రోడ్డు మీద పడవలసిందే కదా. ఎస్వీయు పిజి సెంటరు, జెఎన్టీయు ఇంజినీరింగ్ కాలేజ్ బస్సులు సాయంత్రం ఆరు గంటల్లోగా కనీసం రెండు ట్రిప్పులు టౌన్ లోకి వచ్చేవి. పిజి సెంటరు టౌనుకు పదకొండు కిలోమీటర్లయితే ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టలు మూడు కిలోమీటర్లు. స్టూడెంట్సు కొందరు నారాయణ కోసమని సప్తగిరి సర్కిల్ దగ్గరే బస్సు దిగేవాళ్లు. ఇక ఆర్ట్స్ కాలేజ్ హాస్టళ్లు కాలేజీ వెనకాల, ఓవర్ బ్రిడ్జీ పక్కనే ఉండేవి. 
విద్యార్థుల గిరాకీయే ప్రధాన ఆధారంగా నడిచే చిరు తిండ్లు, ఇతర వ్యాపారాలు అనంతపురంలో దండిగానే ఉండేవి. పాతూరు నుంచి క్లాక్ టవర్ చేరే లోపున రోడ్డు పక్కన మిరపకాయ వడ బండ్లు/ అంగళ్లు ఏడెనిమిది వరకు ఉండేవి. నాకు తెలిసి పానీపూరీ వగైరా బొంబాయి ఛాట్ లు అప్పట్లో టౌన్ లో ఎక్కడా దొరికేవి కావు. ఇక గోభీ మంచూరీ పేరు కూడా మాకు తెలీదు. మిరపకాయ వడ, ఆలూ బోండా, మసాలా వడలు మాత్రం సర్వాంతర్యామిలా ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. 
మిరపకాయ వడలంటే ఎంత కారముంటే అంతగా మెచ్చుకునే వాళ్లం. ఇప్పటి మాదిరి చప్పిడి కూళ్లంటే అస్సలు ఇష్టముండేది కాదు మాకు. ఓవర్ బ్రిడ్జీ పక్కన ఫస్టు రోడ్డుకు మొదట్లో ఓ ఇంటి ముందర అంగడిలో వేసే వేడి వేడి మిరపకాయ వడలంటే మా మిత్రులందరికీ మహా ఇష్టం. బాండ్లీ నుంచి తీసిన మిరపకాయ వడల వేడీ, మిరప విత్తనాల అగ్గి కారం ఒక దాంతో ఒకటి పోటీ పడుతుండేవి. మునిపంటితో ఒక్కో ముక్కా కొరుకుతూ దవడల్లోకి లాగేసుకుని కసాకసా నములుతుంటే చెవుల్లోంచి పొగలు వచ్చినట్టుండేది. మధ్యలో నీళ్లు తాగకూడదని పంతం పట్టి హా హూ అని ఆపసోపాలు పడుతూనే ఒక్కొక్కరు ఐదారు వడలకు తక్కువ కాకుండా లాగించే వాళ్లం. అవన్నీ తల్చుకుంటేనే ఇప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంటుంది. అప్పుడంటే ఏదో నూనూగు మీసాల ఆర్ట్స్ కాలేజ్ కుర్రాళ్లం కాబట్టి అలాంటి సాహసాలు చేయగలిగాం కానీ ఇప్పుడు తినమంటే తినగలమా పాడా?