తెలుగు వాళ్లకి భాష తీపి చూపించిన బ్రౌన్ కు తెలుగు నేర్పింది కడప జిల్లా

(నేడు సిపి బ్రౌన్ జయంతి)
ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి డేవిడ్ బ్రౌన్ కాలే దంపతులకు 1798 నవంబర్ 10న కలకత్తాలో తెలుగు వాళ్లంతా పొద్దన లేస్తూనే చేతులెత్తి నమస్కరించ దగ్గ  సీపీ బ్రౌన్ జన్మించారు.
బ్రౌన్ లేక మనకు వెమన గురించి తెలిసేది కాదు, మనుచరిత్ర వసుచరిత్రలు దొరికేవే కాదు. తెలుగు డిక్షనరీ వచ్చేదే కాదు. బ్రౌన్ తెలుగు భాష కోసమేపుట్టాడేమో అనిపిస్తుంది ఆయన జీవిత చరిత్ర చూస్తే.
 తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రిస్టియన్ మిషనరీ అయినా ఆయనకొక విశ్వాసం ఉండేది. భారతదేశంలో తన పని నిర్విఘ్నంగా సాాగాలంటే అక్కడి భాషలను నేర్చుుకోవాలి. అక్కడి మతం గురించి తెలుసుకోవాలి అని, అందుకే సంస్కృతం నేర్చుకున్నాడు. ఇక్కడి  ప్రజల బాష నేర్చుకున్నారు.ఇతర బ్రిటిష్ అధికారుల దృక్పథానికి ఇది పూర్తిగా భిన్నమయింది.
డేవిడ్  కు భారతీయ భాషల మీద ఉన్న మక్కువే కుమారుడు బ్రౌన్ కు కూాడా సంక్రమించిందేమో. ఎందుకంటే తండ్రి కుమారుడిని  బహుభాషా కోవిదుడిగా మార్చాడు
. తండ్రినుంచి ఫిలిఫ్ హిబ్రూ , సిరియన్, అరబిక్, పార్శి, గ్రీక్, లాటిన్, హిందూస్తానీ భాషలు నేర్చుకున్నాడు. ఆయన వెలగపూడి కోదండ రామపంతులు దగ్గిర తెలుగు నేర్చుకున్నాడు. అయితే,  బ్రౌన్ చక్కటి  తెలుగు మాట్లాడం నేర్చుకున్నది కడప జిల్లాలోనే.
తండ్రి చనిపోాయాక ఆయన ఇంగ్లండు వెళ్లిపోయి, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉదోగిగా మళ్లీ 19 సంవత్సరాలపుడు ఇండియా వచ్చారు. 1820లో సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యాడు. మద్రాసు లో  తెలుగు ప్రొఫిషిన్సీ పరీక్ష పాసయ్యాడు.  కడప కలెక్టర్ హన్ బరీ దగ్గిర డిప్యూటీ గా చేరాడు. తెలుగు బాగా మాట్లాడే  కలెక్టర్ నుంచి,తర్వాత ప్రజల నుంచి ఆయన తెలుగు పూర్తి గా నేర్చుకున్నాడు.
నిజానికి ఆయన తెలుగు పండితుడు కావాలని అనుకోనేలేదు. మద్రాసు కాలేజీలో తాను తెలుగునేర్చుకుంటున్నపుడున వసతులు చూసి విసిగెత్తి దీనిని మార్చాలనుకున్నాడు. అపుడు తెలుగుకు సరైన గ్రామర్ లేదు. డిక్షనరీ లేదు. ఉండేవన్నీ తెలుగు భాష ఎక్సర్ సైజ్ పుస్తకాలే. ఇక తెలుగు చెప్పే ట్యూటర్లు ఇంగ్లీషే మాట్లాడతారు.కాకపోతే,   నాలుగు ముక్కలు తెలుగు తెలుసుకున్నారు. అందువల్ల ఆయన తెలుగు భాషకొక గ్రామర్, డిక్షనరీ , ఒక వర్క్ బుక్ తయారు చేయాలనుకున్నాడు. ఈ తపనే ఆయనను తెలుగు భాషకు అంకితం చేసింది.చివరిదాకా ఆయన్ని ఈ  తెలుగు ప్రేమ వదల్లేదు.
 నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరని తెలుగుతల్లి ని అడిగితే …… నా ప్రాణంతో సమానమైన నా బిడ్డ సీపీ బ్రౌన్ అని చెబుతుంది…
వెంటిలేటర్ మీద ఉన్న నాకు ఊపిరిలూది , నాకు పునర్జన్మ ప్రసాదించిన నా కొడుకు సీపీ బ్రౌనే నాకు ఇష్టం అని చెబుతుంది . ఆయన తెలుగు తల్లికి చేసిన సేవలు – ఏ తెలుగు వ్యక్తీ చేయలేదు మరి…ఆయన కృషి గురించి బ్రౌన్  మీద గొప్ప పరిశోధనలు చేసిన బండి గోపాలరెడ్డి ఒక్క ముక్కలో ఇలా చెప్పారు.
 “The contributions to Telugu by all the Telugu professors of the world, all the academies, and all the government-supported scholars put together do not come close to a tiny fraction of what Brown did.”

1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణభూతమైన మహానుభావుడు, ఆంగ్లేయుడు సీపీ బ్రౌన్…

తొలి తెలుగు శబ్దకోశాన్ని ఆయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి కూడా తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. మహామహులచే ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు బ్రౌన్…
.
దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి , తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్…
.
ఆయన లేకపోతే , వేమనెవరో … వేమన పద్యాలున్నవని కూడా తెలిసేది కాదు…
.
వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
1841లో నలచరిత్ర ను ప్రచురించాడు…
ఆంధ్రమహాభారతము, శ్రీమద్భాగవతము లను ప్రచురించాడు. ఇలా , గ్రంధస్తానికి నోచుకోని వేలాది కావ్యాలను గ్రంధస్తం చేసాడు…
అప్పటి మద్రాసు రాష్ట్రంలో, హైదరాబాదు సంస్థానాలలోని తెలుగు ప్రాంతాల్లో పనిచేసే బ్రిటిష్ అధికారులు తెలుగు నేర్చుకునేందుకు , వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు…
లండన్‌లోని ఇండియాహౌస్ లైబ్రరీలో పడి ఉన్న 2,106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు…
బ్రౌన్ వ్యయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంధాలు అసంఖ్యాకం . మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి…
ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ ఇంగ్లిష్ – తెలుగు, తెలుగు-ఇంగ్లిష్ డిక్షనరీని ఆయన 1852, 1853 లో సమకూర్చాడు…
.
అప్పుడు ఇండియాను పాలిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగి అయిన బ్రౌన్…రిటైర్ అయ్యాక , తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి … అక్కడ కూడా తెలుగుతల్లి కోసమే జీవితాన్ని అంకితం చేసాడు…
లండన్ లోని లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఒక బ్రిటీషు వ్యక్తి తెలుగు ప్రొఫెసర్ అంటే – ఎంతో గొప్ప విషయం…
తెలుగు గడ్డపై పుట్టి , తెలుగును హేళన చేస్తూ … చులకనగా భావిస్తోన్న వాళ్ళు , మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం అండీ – తెలుగు అస్సలు రాదు అని మురిసిపోయే వాళ్ళు బ్రౌన్ గొప్పతనం తెలుసుకోవాలి..(ఫీచర్ ఫోటో wikipedia నుంచి)
-విజయభాస్కర్ చౌదరి , అధ్యక్షుడు , గుత్తి కోట సంరక్షణ సమితి