విశ్లేషణ: వైసీపీ ప్రభంజనం ఇలా సాధ్యమయింది!

(శ్రవణ్ బాబు దాసరి*)

మొదటినుంచి హాట్ ఫేవరేట్ గా ఉన్న వైసీపీయే చివరికి విజయం సాధించటం చాలామంది ఊహించినదే. లగడపాటి రాజగోపాల్ టీం, టీవీ5 వంటి పచ్చబాకా సంస్థలు తెలుగుదేశానికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి బొక్క బోర్లా పడ్డాయిగానీ అసలు ఏపీ ఎన్నికలు చాలా సింపుల్ అర్థమేటిక్ లెక్క. 2014లో బాబు విజయంలో కీలకపాత్ర పోషించిన జనసేన, బీజేపీ ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా నిలిచాయి. దానికితోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండనే ఉంది. మరోవైపు దాదాపు పదేళ్ళుగా నిత్యం నిలకడగా జనంలో ఉండటంతో వైఎస్ వారసుడికి ‘ఒక అవకాశం ఇద్దాం’ అన్న భావన బలంగా వ్యాపించటాన్ని జగన్ విజయానికి ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. దీనితో వైసీపీ విజయం ఎన్నికలకు ముందే ఖరారు అయిపోయింది. కాకపోతే ఇంతటి ప్రభంజనం ఉంటుందనిమాత్రం ఎవరూ ఊహించలేదు. దానికి కారణం మాత్రం ఒక్క వ్యక్తిని చెప్పుకోవాలి. ఆయనే పవన్ కళ్యాణ్. అదెలాగో చూద్దాం… దానితోపాటు బాబు చేసిన తప్పిదాలనుకూడా ఒకసారి పరిశీలిద్దాం.

చంద్రబాబు తప్పిదాలు

ఈనాటి చంద్రబాబు నాయుడుకు, 1995-2004 కాలంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ను పాలించిన చంద్రబాబు నాయుడుకు హస్తిమశకాంతరం(బోలెడు తేడా) ఉంది. నాటి బాబు ఫోకస్డ్ గా, ఎనర్జిటిక్ గా ఉండగా, నేటి బాబు శక్తులు ఉడిగిపోయి అయోమయంలో ఉన్నట్లు సుస్పష్టంగా తెలుస్తోంది. 2004 – 2014 మధ్యకాలంలో రాజకీయంగా ఎదుర్కొన్న బలమైన ఎదురుదెబ్బలవల్లో ఏమో ఆయన తన ఫోకస్ కోల్పోయారు. పలు సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా, ఆయన మానసిక ఆరోగ్యంపై సందేహాలు పుట్టేలా ఉన్నాయి. అందుకే 2014లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినాకూడా ఆయన తనకు లభించిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. తప్పుడు నిర్ణయాల కారణంగా పాలన పక్కదారి పట్టింది. నాడు ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన అంశాలు మూడు. ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం. ఈ మూడు అంశాలలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో బాబు యూ టర్నులే జగన్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. తరచూ మాట మారుస్తుండటంతో ప్రజలలో పలచబడిపోయారు. ఇక రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు ఏపీ ప్రజలకు చేసిన నమ్మకద్రోహం అంతా ఇంతా కాదు. మరెన్నో మెరుగైన ప్రాంతాలు ఉన్నప్పటికీ, తన వర్గంవారి ఒత్తిడి కారణంగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయటమే కాకుండా తనవారందరికీ ఆ ప్రాంతాన్ని తెలియబరచి వారు అక్కడ స్థలాలు కొన్న తర్వాత దానిని బహిరంగంగా ప్రకటించారు(ఇన్ సైడర్ ట్రేడింగ్). పోలవరం పూర్తి చేయకుండా 2019 ఎన్నికల్లో ఓట్లు అడగనన్న బాబు దానిని ఎంతవరకు పూర్తి చేశారోకూడా అందరికీ తెలిసిందే.

ఇక టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి గురించి చెప్పాలంటే పెద్ద గ్రంధం అవుతుంది. కనీసం రు.100 కోట్లు సంపాదించని టీడీపీ ఎమ్మెల్యే దాదాపుగా లేడంటే అతిశయోక్తి కాదు. మరోవైపు జన్మభూమి కమిటీలు, టీడీపీ కాంట్రాక్టర్ల అరాచకం చెప్పనలవికాదు. ప్రభుత్వంమీద, పార్టీమీద సీఎమ్ పట్టు కోల్పోవటంతో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల అవినీతి విపరీతంగా పెచ్చుపెరిగిపోయింది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తికూడా అదేస్థాయిలో పెరిగింది. ఇది గమనించారో, ఏమో చంద్రబాబు ఆఖరి సంవత్సరంలో మేలుకుని సంక్షేమాస్త్రం తీశారు. ప్రజలపై పథకాలతో వరాల జల్లు కురిపించారు. అయినాగానీ ఫలితం లేకుండాపోయింది. ఆ డబ్బులు తీసుకునికూడా లబ్దిదారులు వైసీపీకే ఓట్లు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రభావం

వైసీపీ ప్రభంజనానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తోందని జనసేనకు తటస్థులలో మంచి పేరే వచ్చింది. ఉద్దానం కిడ్నీ సమస్య, పశ్చిమ గోదావరిజిల్లాలో కాలుష్యం సమస్య వంటి కొన్ని అంశాలపై పోరాటం చేసి సత్ఫలితాలు సాధించటంతో చాలామంది పవన్ ను మెచ్చుకున్నారు. అయితే టీడీపీతో, బీజేపీతో ఆయన కొన్నాళ్ళు నెయ్యం, కొన్నాళ్ళు కయ్యం(ఆన్ అండ్ ఆఫ్ లవ్) అన్నట్లుగా వ్యవహరించటంతో ఆయన వైఖరిపై జనంలో అయోమయం ఏర్పడింది. పవన్ బీజేపీ అనుచరుడని కొన్నాళ్ళు, చంద్రబాబు అనుచరుడని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. దానికితోడు టీడీపీ తొత్తులైన మీడియా సంస్థలతో వైరం తెచ్చుకోవటంతో అవి ఆయన అనుకూలవార్తలను నిలిపివేసి ప్రతికూల వార్తలనే చూపించాయి. పవన్ కూడా టీడీపీ, బీజేపీలతో తమ పార్టీ అనుబంధంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై ఒక స్పష్టత ఎప్పుడూ ఇవ్వలేదు. దీనికి ఒక కారణం ఉంది. అసలు తన పార్టీపై ఇలా ఊహాగానాలు సాగుతున్నాయనిగానీ, ప్రజలలో అయోమయం ఏర్పడిందనిగానీ ఆయనకు తెలియదు. ఎందుకంటే అసలు ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో అవ్వరట(ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదు)! ఇక పార్టీ నిర్మాణంకూడా సరిగ్గా జరగలేదు. ద్వితీయశ్రేణి నాయకత్వమే జనసేనలో లేదు. ప్రజారాజ్యం సమయంలో జరిగిన చేదు అనుభవాలదృష్ట్యా ద్వితీయశ్రేణి నాయకత్వం వద్దని పవన్ అనుకున్నారట! ఇక పవన్ చుట్టూ ఉన్న సన్నిహితవర్గంలో ఎక్కువశాతం ఊక  మాత్రమే.  ఈ పరిణామాలన్నింటినీ మించి జనసేనకు పెద్ద దెబ్బ ఎన్నికల సమయంలో తగిలింది. అది తగిలినట్లుకూడా పవన్ కు తెలియకపోవచ్చు.

ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే సమయంలో పవన్ వేసిన తప్పటడుగు వైసీపీకి ప్లస్ అయింది. ఒక సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ ఎన్నికల సమయానికి తుస్సుమని తేలిపోవటం వైసీపీకి అనూహ్యరీతిలో కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిననాటినుంచి తన సభలలో కేవలం వైసీపీపైనే విమర్శలు గుప్పించటం, టీడీపీని పెద్దగా పట్టించుకోకపోవటమే పవన్ వేసిన రాంగ్ స్టెప్. ఏపీలో హంగ్ ఏర్పడుతుందని, తన పార్టీకి కర్ణాటకలోలాగా ఒక గౌరవప్రదమైన స్థానాలు లభిస్తే టీడీపీకి మద్దతు ఇచ్చి తాను ముఖ్యమంత్రి కాగలనని పవన్ కలలు కన్నారు. అందుకే భవిష్యత్తులో టీడీపీతో పొత్తు కలవాలి కాబట్టి ఆ పార్టీపై బలంగా విమర్శలు గుప్పించకుండా ఉదాశీనంగా ఉన్నారు. ఇదే ఆయన చేసిన పెద్ద పొరపాటు. తనపై విమర్శలకుగానూ ప్రత్యర్థులకు పవనే చక్కటి ఆయుధం ఇచ్చినట్లయింది. చంద్రబాబు దగ్గర పదివేలకోట్లు తీసుకున్నట్లు ప్రత్యర్థులు చేసిన ప్రచారం ప్రజలలోకి బాగా వెళ్ళిపోయింది. దానితో పవన్ ను ఒక సీరియస్ కంటెండర్ గా జనం పరిగణించలేదు. ఏపీలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ఆయన సొంత సామాజికవర్గంవారే చాలామంది పవన్ పై పెదవి విరిచారు. దానికితోడు, తమకు ఇష్టమైన అభ్యర్థి అయినాకూడా గెలవడని అనిపిస్తే జనం ఆ అభ్యర్థికి కాకుండా ఇతరులలో తమకు ఇష్టమైనవారికి వేయటం సహజమైన టెండెన్సీ. జనసేనకు అదే పెద్ద ముప్పుగా మారింది. కాపు సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నప్పటికీ, ఎన్నికలనాటికి జనసేనకున్న పేరు పలచనబడిపోవటం, పైగా టీడీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాడని సాగుతున్న ప్రచారం బలంగా వినబడటంతో ఆ వర్గంలోని చాలామంది ప్రధాన ప్రత్యర్థులపై దృష్టి సారించారు. రెండు ప్రధాన పార్టీలలో తెలుగుదేశాన్ని కాపులు మొదటినుంచి ప్రత్యర్థులుగానే పరిగణిస్తారు. దీనితో అన్యాపదేశంగా వైసీపీవైపే కాపులలో అత్యధికులు మొగ్గుచూపారు. దీనితో వైసీపీకి పడే సంప్రదాయ ఓటుబ్యాంకుకు కాపులుకూడా తోడవటంతో విజయం కాస్తా ప్రభంజనంగా మారిపోయింది.

(*శ్రవణ్ బాబు దాసరి,సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్ 99482 93346)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *