అమరావతి వివాదాన్ని ముఖ్యమంత్రి ఇక మానేయాలి : లక్ష్మినారాయణ

(టి. లక్ష్మీనారాయణ)
అమరావతి రాజధానిపై లేని వివాదాన్ని రేకెత్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయ విజ్ఞత ప్రదర్శించి, రాష్ట్ర రాజధాని అమరావతే అని మంత్రివర్గ నిర్ణయంగా విస్పష్టంగా ప్రకటించి వివాదానికి తెరదించితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మంచిది.
ఆమరావతి రాజధాని నిర్మాణాన్ని కొనసాగించడానికి డబ్బుల్లేవట, అయితే, ప్రస్తుతం పని చేస్తున్న కార్యాలయాల నుండే పాలన సాగిస్తే సరిపోతుంది కదా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్: వ్యవస్థీకరణ చట్టం మేరకు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిథులను సమకూర్చాలి. ఆ నిథులను రాబట్టుకొని, ఆ మేరకే నిర్మాణ పనులను కొనసాగించండి. అది కూడా చేత కాదా!
గత ప్రభుత్వం “అమరావతి రాజధాని” అభివృద్ధి నమూనా అంచనా వ్యయం లక్ష కోట్లకు పై మాటే! నిజమే! మీ అభివృద్ధి నమూనా ఏమిటో చెప్పండి, అంతే గానీ మార్చాలనే దుర్భుద్ధి ఎందుకు?
అమరావతి రాజధాని నిర్మాణానికే లక్ష కోట్లుపైగా ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఎలా అని సన్నాయి నొక్కులు నొక్కుతూ పాలకులే అపోహలు సృష్టిస్తూ, భిన్నాభిప్రాయాలను, ప్రాంతీయ విభేదాలను పనిగట్టుకొని రెచ్చగొడుతున్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి రాజధానిని నిర్మించమని ఎవరు కోరుతున్నారు?
2. రాజధాని నిర్మాణం కోసం రు.49,924 కోట్లు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే రు.2,500 కోట్లు ఇచ్చిందని, మిగిలిన రు.47,424 కోట్లు మంజూరు చేయమని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది కదా!
3. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన మేరకు రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించాలి కదా! హక్కుగా అడగండి, నిథులు రాబట్టుకోండి, నిర్మించండి.
4. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి పథకం అమలుకు రు.22,500 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది కదా! ఆ పథకాన్ని హక్కుగా సాధించి, యుద్ధ ప్రాతిపదికపై అమలు చేయండి.
5) 2019-2020 రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో కేటాయించిన రు.500 కోట్లు విడుదల చేసి, 70%, 80% నిర్మాణం పూర్తైన బహుళంతస్తుల భవనాలను పూర్తి చేస్తే మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు వసతి కల్పించవచ్చు. తద్వారా ప్రయివేటు యాజమాన్యాలకు అద్దెల రూపంలో చెల్లిస్తున్న ప్రజాధనం పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది కదా! ఆ పని చేయండి.

(టి. లక్ష్మీనారాయణ, సామాజిక,రాజకీయ విశ్లేషకుడు)