బంగారు స్మగ్లింగ్ ఇంకా పెరుగుతుంది, మార్కెట్లో ఆందోళన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం మీద కస్టమ్స్ సుంకం పెంచడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూఉంది. బడ్జెట్ ప్రతిపాదనలలో బంగారు మీద కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి  పెంచారు. బంగారు వజ్రాల మార్కెట్  ఇలాంటి చర్యను వూహించనేలేదు. ఎందుకంటే, ఈ రంగం దిగమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని కోరుతూ వచ్చింది. ఇపుడు బంగారు విపరీతంగా భారతదేశంలోకి దొంగమార్గాలలో రావడానికి  ఈ సుంకం ఎక్కువగా ఉండటమే కారణమని మార్కెట్ భావిస్తూ వచ్చింది. తగ్గించడానికి బదులు ఏకంగా 2.5 శాతం పెంచడాన్ని మార్కెట్ జీర్నించుకోలేకపోతున్నది.

దీని వల్ల బంగారు స్మగ్లింగ్ బాగాపెరుగుతుందని  మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున విదేశాలనుంచి బంగారం దేశంలోకి చోరబడుతూ ఉంది. విమానాశ్రయాలలో పట్టుబడుతున్న కేజీల కొద్ది బంగారాన్ని చూస్తే ఇది అర్థమవుతుంది. ఇలాంటపుడు కస్టమ్స్ సుంకం ఇంకా పెంచితే  స్మగ్గింగ్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ చర్య తో బంగారు ధరలు ఒక్క దెబ్బకు పెరిగిపోయాయి. దీనితో కొనుగోలు డిమాండ్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇపుడు బంగారు, వజ్రాల, నికెల్ , వెండి, ప్లాటినమ్ అభరాణాల మార్కెట్ విలువ రు. 50 వేల కోట్లు.‘ఆఫిషియల్ ప్రొక్యూర్ మెంట్ రేటు బాగా పెరుగుతుంది కాబట్టి స్మగ్లింగ్ పెరుగుతుంది. అక్రమ మార్గాల ద్వార బంగారు సేకరణ పెరిగితే మార్కెట్ దెబ్బతింటుంది. మార్కెట్ లో అవాంఛనీయ పోటీ పెరుగుతుందని ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ డైరెక్టర్ హరీష్ ఆచార్య చెప్పారు.

నిన్న సీతారామన్ కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించగానే  బంగారానికి రెక్కలొచ్చాయి. ముంబాయిలో పది గ్రాముల ధర రు.35,155 పలికింది.