కర్నాటకలో మధ్యంతర ఎన్నికలు?

కర్నాటకలో మధ్యంతర ఎన్నికలు తప్పవని మాజీ ప్రధాని, జెడి (ఎస్ ) పెద్దాయన హెచ్ డి దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఒక సమావేశంలో మాట్లాడుతూ కర్నాటకలో ఏర్పడిన జెడి ఎస్ – కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

‘జెడిఎస్ -కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేను. గత రెన్నెళ్ల అనుభవం బట్టి చూస్తే మధ్యంతర ఎన్నికలు తప్పవేమో అనిపిస్తున్నది. ప్రజలు దీన్ని అర్థం చేసుకోగలరు. పరిస్థితులు ఎలా సాగుతాయో చూద్దాం,’ అని ఆయన అన్నారు.

నిన్ననే  ఆయన సంకీర్ణ ప్రభుత్వం మీద తన అభిప్రాయం చెప్పి కలకలం సృష్టించారు.

కాంగ్రెస్ వత్తిడి వల్లే జెడిఎస్ -కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, తనకయితే అది ఇష్టం లేదని ఆయన గురువారం నాడు వెల్లడించారు.

జెడి ఎస్ తో తెగతెంపులు చేసుకుందామని సంకీర్ణ ప్రభుత్వం కోఆర్డినేషన్ కమిటీ చెయిర్మన్ సిద్దరామయ్య కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో దేవేగౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. జెడి ఎస్ పొత్తు వల్ల కాంగ్రెస్ కు నష్టం జరగుతూ ఉందని సిద్ధరామయ్య పార్టీకి చెప్పారని కూడా చెబుతున్నారు.

అంతా కాంగ్రెస్ చేతిలోనే ఉంది. సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్తు ఆ పార్టీ చేతిలోనే ఉంది.కాంగ్రెస్ లీడర్లు అనుకునే దాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగేది అధారపడి ఉంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలనిపట్టుబట్టిందివారే.. అని ఆయన అన్నారు.