తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో 6వేల మందితో కళాప్రదర్శనలు

జూన్ 2 న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్భందిగా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో రాష్ట్ర అవతరణ ఉత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమన్యయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, అర్వింద్ కుమార్, పార్ధసారధి,అడిషనల్ డిజిపి తేజ్ దీప్ కౌర్ మీనన్, జిహెచ్ఎంసి కమీషనర్ దానకిషోర్, కమీషనర్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్, అడిషనల్ డిజి. (L&O ) జితేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మానిక్ రాజ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, CIE కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదిన అవతరణ వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తునట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ కు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని, వేడుకలు ముగిసాక వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల అలైటింగ్, పిక్అప్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు.
సమాచార శాఖ ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు, ఎల్ ఈడి టివి, పిఏ సిస్టం, కామెంటేటర్లు, మీడియా కవరేజి తదితర పనులు చేపట్టాలని సియస్ ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలైన రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలలో విద్యుదీకరణ చేపట్టాలన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో పరిశుభ్రత, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా, అంబులెన్సులు, వైద్యనిపుణుల టీంలు, బారికేడింగ్, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు. పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వెయ్యి మంది విద్యార్ధులు పాల్గొంటారన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా జూన్ రెండవ తేదిన ట్యాంక్ బండ్ వద్ద డ్రోన్ లతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ బి స్టేడియంలో 3 వ తేదిన 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన, 4 వ తేదిన 5000 మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా పిపుల్స్ ప్లాజాలో మరియు రవీంద్రభారతిలో వివిధ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *