Home Breaking రోడ్డున పడ్డ టొమాటో రైతు

రోడ్డున పడ్డ టొమాటో రైతు

333
0

టొమోటో…ఈ పేరు చెబితే చాలు ఎర్రని నిండైన రూపం మదిలో మెదులుతుంది.నోట్లో నీళ్ళూరిస్తూ పసందైన రుచులను జ్ఞప్తికి తెస్తుంది.చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఈ టొమోటో ని ఇష్టపడని వారు ఉండరు.పిల్లలైతే పచ్చి టొమోటో లే ఇష్టంగా తినేస్తారు.ఆరోగ్యరీత్యా కూడా టొమోటో చాలా మేలంటారు పెద్దలు,వైద్యులు.దాదాపు ప్రతి వంటలోను కలయికగా ఈ టొమోటో చేరుతుంది. శాఖాహారమే కాదు, మాంసాహార ప్రియులు సైతం టొమోటో కలయికతో వంటలను లొట్టలేస్తూ ఆస్వాదిస్తారు. టొమోటో లేకుండా వంటలతో ఒక్క శుభకార్యాన్నైనా మనం ఊహించగలమా? ఒక్క వంటలనేమిటి?నూడిల్స్,మంచూరియా,పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ లో టొమోటో సాస్ గాను,బింగో,కుర్ కురే వంటి పలు కంపెనీల చిరుతిండ్లు లో, చిప్స్ లోను ఈ టొమోటో ఫ్లేవర్ రూపంలో అలరిస్తుంది.ఇలా ఒకటి కాదు రెండు కాదు,ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఐనా అక్కడి వాతావరణాన్ని బట్టి రకరకాల కూరగాయలు పండిస్తున్నా,అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగి,ఎక్కువ శాతం ఉపయోగించే కూరగాయ ఒక్క టొమోటో నే అంటే అతిశయోక్తి కాదేమో! అందుకేనేమో టొమోటో కూరగాయల్లో రాజు లాంటిది అని చెప్తారు.ఈ టొమోటో హైబ్రీడ్ టొమోటో, బెంగుళూరు టొమోటో,నాటు టొమోటో వంటి పలు పేర్లతో కొద్దిగా రూపం మార్చుకున్నా,నాటు టొమోటో అంటే దాని ప్రత్యేకతే వేరు.కొద్దిపాటి పులుపుతో ఎటువంటి వంటలో ఐనా ఇట్టే ఇమిడిపోతుంది.నాటు టొమోటో ఉత్పత్తి చేసే ప్రాంతాలలో కృష్ణాజిల్లా కూడా ముందు వరుసలో ఉంటుంది.మైలవరం నియోజకవర్గం ముఖ్య భూమిక పోషిస్తుంది.ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ టొమోటో పంట ఇప్పుడు నియోజకవర్గం లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. టొమోటో సాగు చేసే రైతన్న రోడ్డు ప్రక్కన చతికిలపడ్డాడు.ఈ పంటనే నమ్ముకుని ఆరుగాలం శ్రమించి ఎన్నో ఆశలతో మార్కెట్లోకి వస్తే తన ఆశలు చితికి పోయాయని బిక్క చచ్చి పోయాడు.కన్న కలలు కుళ్ళిపోయాయని కళ్ళు తేలేశాడు.పెట్టుబడి రాక కూలి ఖర్చులకి కూడా చేతిలో డబ్బు లేక అప్పో సొప్పో చేసి కూలి చెల్లించి రవాణా ఖర్చులు భరించి కళ్ళెదుట నిండిన పంటను కమ్మగా అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాక,రైతు బజార్లో సైతం ఆదుకునే నాధుడు లేక గిజగిజలాడుతున్నాడు.రైతు బజార్లో అమ్మకాలు జరిపేది రైతులా?,దళారులా? అర్థం కాని అయోమయంలో బజారు పాలయ్యాడు.చివరికి దిక్కుతోచని పరిస్థితిలో రోడ్డు ప్రక్కన తన టొమోటో దీన స్థితిని చూపిస్తూ జాలితో నైనా కొనమని అర్థిస్తున్నాడు.కిలో పదిరూపాయలకు కూడా కొనే నాథుడు కనపడక వచ్చినదే చాలని చెమ్మగిల్లిన కళ్ళతో బీద చూపులు చూస్తున్నాడు.
కృష్ణాజిల్లా లో టొమోటో ని నమ్ముకున్న రైతు పరిస్థితి ప్రస్తుతం ఇదే…!

వివరాలలోకి వెళితే…
కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం లో సుమారు 400నుండి500 ఎకరాలలో టమోటా సాగు జరుగుతోంది.
ఎకరా టొమోటో సాగుకు 50000/- పై చిలుకు ఖర్చౌతుంది.పంట చేతికి వచ్చే సమయానికి రైతు కూలీలతో టొమోటో కోయించి రవాణా ఖర్చులు భరించి పంట అమ్ముకునే సమయానికి మొత్తం ఎకరాకు సుమారు 70000/- వరకు ఖర్చు అవుతుందని అంచనా‌.ఇటువంటి పరిస్థితిలో తన పంటను అమ్ముకుందామంటే కనీసం కిలో 2రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.ఈ క్రమంలో మైలవరం మండలం అనంతవరానికి చెందిన ఒక రైతు తాను పండించిన టొమోటో ఎవరూ కొనకపోవడంతో ఒంటరి పోరొటానికి దిగాడు.రైతు బజార్లో తనను మోసం చేశారంటూ,రైతు బజార్లో తనను అమ్ముకోనివ్వలేదని మైలవరం లో అదే రైతు బజార్ ముందే రోడ్డు ప్రక్కన తన తోటలోని టొమోటో లోడు దించి గత రెండు రోజులుగా అమ్మకం మొదలుపెట్టాడు.రైతు బజార్ లో బోర్డ్ పెట్టి కేజీ టొమోటో 10/-రూపాయలు అమ్ముతుండగా సుమారు రెండు కేజీల టొమోటో కవర్లలో నింపి 10/-రూపాయలకు అమ్మసాగాడు.పట్టించుకునే నాథుడు లేడని వాపోయాడు.ప్రభుత్వం తనను ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాడు.ఈ విషయాన్ని మీడియా హార్టికల్చరల్ ఆఫీసర్ మరియు రైతుబజార్ ఇఓ ల దృష్టికి తీసుకెళ్ళగా రైతుబజార్ ఇఓ పుష్పవల్లి వెంటనే స్పందించారు.రైతును పిలిపించి రైతుబజార్ లో కార్డ్ ఇస్తామని ఇక్కడే విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు.రైతు బజార్లో వ్యాపారుల మద్య తాను అమ్ముకోలేనని అసలు రైతుబజార్ లో రైతు ఎక్కడున్నాడో చూపమని అనంతవరానికి చెందిన రైతు వాగ్వాదానికి దిగడం గమనార్హం.హెచ్ఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆదునిక పద్దతులు అవలంబించి జల్లెడ పద్దతిలో సాగు చేస్తే పంట దిగుబడి సమయం పెరుగుతుందని,తద్వారా రైతు లబ్ది పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.అలాగే టొమోటో నిన్న సీజన్ లోనే కాక కొరత ఉండే సమయాల్లో కూడా నెట్ సిస్టం ద్వారా పండిస్తే వేసవిలో కూడా దిగుబడి ఉంటుందని అథిక ధర వచ్చే అవకాశాలుంటాయని అన్నారు.ఆధునిక పద్దతులను అనుసరిస్తూ ప్రబుత్వ సబ్సిడీ కూడా పొందవచ్చని తెలిపారు.ఏది ఏమైనా టొమోటో రైతును ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,రైతు తన పంటను ఎగుమతి చేసుకునేలా మార్గం చూపాలనీ పలువురు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here