రైతుబంధులో రికార్డు కొట్టిన సిద్ధిపేట పోరడు

తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో సరికొత్త పదనిసలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలన్నీ ఓట్ల కోసమే ఈ రైతుబంధు పథకం అని విమర్శలు గుప్పస్తున్నాయి. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే దున్నేవాడికే రైతు బంధు ఇవ్వాలని అంటున్నాయి. కౌలు రైతులను గాలికొదిలేసి కేవలం కాగితాల మీద రైతులకే డబ్బులిస్తున్నారని మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల మాటలు నిజమే అనిపిస్తున్నా.. ఆ విషయం పక్కన పెట్టి ఇంకో కొత్త ముచ్చట చూద్దాం రండి.

తెలంగాణ రైతుబంధు పథకం పుణ్యమా అని 8 ఏళ్ల పోరగాడు రైతుగా మారిపోయిండు. అదేంటి బాలలు పనిచేయరు కదా? ఆ పోరడు రైతు అవుడేంది అనుకుంటున్నారా? మరి అంతే అంటున్నది తెలంగాణ సర్కారు. ఎవరి పేరు మీద భూమి రిజిస్టర్ అయి ఉంటే వాడే రైతు అంటున్నది. ఆ రైతుకే పట్టా పుస్తకం, చెక్కులు ఇస్తామంటున్నది.

తెలంగాణ రాష్ట్రం లో అతి చిన్న వయసు వున్న రైతు గా ఈ సిద్ధిపేట చిన్నారి నిలిచాడు. ఈ పిలగాని పేరు కె.నిర్మల్. సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అబ్బాయి. ఈ నిర్మల్ 8 ఏండ్లకే రైతుగా మారిపోయిండు. ఆయన పేరు మీద ఎకరం పావు భూమి ఉంది. (1.25 ఎకరాలు)

భూ యజమాని మాత్రమే వచ్చి చెక్కులు తీసుకోవాలని తెలంగాణ సర్కారు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే కదా? అందుకే ఈ చిన్నారి రైతుబంధు చెక్కుల పంపిణీ కేంద్రం వద్దకు వచ్చి తన పేరిట వచ్చిన పాసు పుస్తకం, చెక్కులను తీసుకున్నాడు.

అతి చిన్న వయసులోనే రైతుగా మారిన ఈ నిర్మల్ తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా నిలిచాడు. నిర్మల్ కంటే చిన్న రైతులు ఎక్కడైనా తారసపడతారేమో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *