Home English ఆంధ్ర గవర్నమెంటులో అంతర్యుద్ధం…సర్వత్రా టెన్షన్

ఆంధ్ర గవర్నమెంటులో అంతర్యుద్ధం…సర్వత్రా టెన్షన్

317
0

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం లో పెత్తనం కోసం అంతర్యుద్దం నడుస్తూ ఉంది రాజకీయ ప్రాబల్యం ఉన్న అధికారులొకవైపు, అధికారం లో ఉన్న రాజకీయనాయకులొక వైపు నిలబడి ప్రభుత్వం మాదంటే మాదని సవాళ్లు విసురుకుంటున్నారు. ప్రతీకారంతో కుతకుత ఉడికిపోతున్నారు. ప్రభుత్వం మీద పట్టు కోసం కత్తులు నూరుతున్నారు. అన్ని డిపార్ట్ మెంట్లలో  టెన్షన్.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయిన వారు, రిటైరయిన తర్వాత తమని పట్టించుకొనకపోవడంతో అహం దెబ్బ తిన్న అధికారులు కూడా ఈ యుద్దాన్ని ఎగదోసి చంద్రబాబు మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారని తెలుగుదేశం వారు ఆరోపిస్తున్నారు.

మొత్తానికి గతలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలో ఆంధ్రలో పాలనా సంక్షోభం ఏర్పడింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ  ‘పను’లను సమీక్షించాలనుకుంటున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం అదికుదరదు, ఆయన అధికారాల్లేని చీఫ్ మినిస్టర్ అంటున్నారు.

‘నేనే ముఖ్యమంత్రిని’ అని చంద్రబాబు అంటే,  ఎన్నికల కోడ్ అమలు ఉంది, ‘నేనే నెంబర్ వన్’ అని ఎల్ వి అంటున్నారు.

ప్రభుత్వంలో ఉన్నంతవరకు పరిపాలనను సమీక్షిస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు, అవి సమీక్షలా పాడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని వత్తిడి తెచ్చేందుకు సమావేశాలని రైవల్ ఫ్యాక్షన్ విమర్శిస్తున్నది.

చీఫ్ మినిస్టర్ కు మంత్రుల మద్దతు, చీఫ్ సెక్రెటరీకి  రిటైరైన యాక్టివిస్టు  అధికారుల సపోర్టు. మంత్రులు, ముఖ్యమంత్రుల రివ్యూలు కుదరవని వాళ్లకూడా చెబుతున్నారు. చీఫ్ సెక్రెటరీకి  మద్దతు తెలుపుతూ, ఇపుడు నడిచేది చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం , పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లేదుపొమ్మంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శిని అవమాన పర్చారని, ఆయన నియమాకాన్ని తప్పుపట్టారని, ఆయనను  ’జగన్ కేసు’లలో సహనిందితుడు అని వ్యాఖ్యానించారని ఇది చట్టవ్యతిరేకమని రిటైరయిన ఐఎఎస్ లు  గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ క్రియాశీల పాత్ర కుదరదని వాదిస్తున్న ఎల్ వి కి మొత్తం అధికారులనుంచి మద్దతు తెప్పించి ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయించే ప్రయత్నం చేశారు వీరంతా. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ మధ్య వచ్చిన పాలన తకరారను  ఆంధ్రలో అంతర్యుద్ధం స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

తొలి ప్రయత్నం ఫలించలే. తిరుగుబాటు ఫెయిలంది. ఐఎఎస్ అధికారులందరితో ఒక సమావేశం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల సమావేశాలకు తాము రామని ఒక తీర్మానం చేయించి చంద్రబాబుకు  ఈ నెలరోజులు వూపిరాడకుండా చేయాలనుకున్నారు.

అయితే, సమావేశానికి పట్టమని పది మంది కూడా రాలేదు. అటువైపు, చంద్రబాబు వైపు ఉన్నఅధికారంలో ఉన్ ఐఎఎస్ లు రంగ ప్రవేశం చేసి అధికారులందరికి ఫోన్ చేసి నయానభయాన సమావేశానికి హాజరుకాకుండా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇందులో విజయవంతమయింది.

ఎల్ విసుబ్రహ్మణ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానపర్చాడని, ఆయన విధులు హుందాగా నిర్వర్తించకుండాచూస్తున్నారనేది చంద్రబాబు మీద ఆరోపణ.

ఎల్ వి సుబ్రహ్మణ్యం వైసిపి ఏజంటని, జగన్ కేసులలో సహముద్దాయి అని, తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాడని టిడిపి వాళ్ల అనుమానం.

దీనితో ఆంధ్రా క్యాడర్  ఐఎఎస్ వాళ్లు ప్రాంతాల వారిగా, కులాల వారిగా, వైసిపి అభిమానులుగా, టిడిపి మద్దతుదారులుగా,వ్యతిరేకులుగా చీలిపోయారు. దీనితో ఏమిచేయాలో తెలియక తటస్థులు సతమతమవుతున్నారు.

వైసిపి వస్తున్నదని  ఒక ఐఎఎస్ వర్గం బలంగా ప్రచారం  చేస్తుంటే, అవతలి పక్షం చంద్రబాబే మళ్లీ సిఎం అని ఢంకా బజాయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమావేశాలలకు వెళ్ళితే అది తక్షణం వైసిపి నేత విజయసాయి రెడ్డికి క్షణాల్లో తెలిసిపోతున్నదని, వైసిపి అధికారంలోకి వస్తే తమమీద చర్యలుంటాయని ఒక వర్గం ఆందోళన చెందుతూ ఉంది.  చంద్రబాబు రివ్యూలకు వెళ్లిన వారికి జగన్ శిక్ష వేస్తాడని కొంతమంది సీనియర్లు బెదిరిస్తున్నారు.

సిఎస్  మాట,  రిటైర్డ్ ఐఎఎస్ ల మాట వింటే చంద్రబాబుకు కోపమొస్తుందని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయితే, తాట వొలుస్తాడని ‘ఎగస్పార్టీ’ వాళ్లు ఇల్లిళ్లూ తిరిగి చెబుతున్నారు.

ఇక ఎల్ వి సుబ్రహ్మణ్యానికి ఏప్రిల్ 2020 దాకా సర్వీసు ఉంది. జగన్ వస్తే కొనసాగుతాడు. తర్వాత ఎక్స్ టెన్షన్ రావచ్చు. ఆపైన రిటైరయ్యక అడ్వయిజర్ పోస్టు కూడా రావచ్చు. బాబు వస్తే రిజైన్ చేస్తాడు. ఈ దైర్యంతో ఆయన ముఖ్యమంత్రి మీద తిరుగుబాటుజండా ఎగరవేశాడని టిడిపి వాళ్ల ఆరోపణ. ఈ ఉచ్చులో పడవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంపెయిన్ మొదలుపెట్టిందని కొంతమంది తటస్థులు చెబుతున్నారు.

చంద్రబాబు తన వెల్ ఫేర్ స్కీమ్ లకు డబ్బులు మళ్లించి, అందరి  బిల్స్ పెండింగు పెట్టాడు. ఇపుడు తాను వోడిపోతున్నానని తెలిసి, అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించండని వత్తిడి తెస్తున్నారని,  దాదాపు అయిదు వేల కోట్ల బిల్లులు చెల్లించాలని వత్తిడి తెస్తున్నారని మరొక వర్గం ఆరోపిస్తున్నాది.

‘చంద్రబాబు రివ్యూ సమావేశాలన్ని ఇలాంటివే.అందుకే ఆయన రివ్యూలకు వెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారు,’ ఒక అధికారి చెప్పారు.

తాను ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేందుకు ప్రభుత్వపాలనను, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షిస్తానని, అధికారులంతా వచ్చి తీరాలని చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు దబాయిస్తున్నారు.

మొత్తానికి ఇరుపక్షాలు గీత  గీసుకుని తలపడేందుకు సిద్ధమయ్యారు.

ఇదెంతవరకు పోతుందో చూడాలి. మే 23 దాకా ఇలా అంతర్యుద్ధం మేఘాలు అలుముకునే ఉంటాయి. పర్యవసానాలు ఆపైన తీవ్రంగా ఉంటాయని భావిస్తూ చాలా మంది అధికారులు కేంద్రానికి వలస పోవాలని చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here