హోదా రాజకీయంలో చంద్రబాబు జగన్ ని మించిపోతున్నాడా?

హోదా కోసం ఎవరితో నైనా కలుస్తా,ఏమయినా చేస్తానని చంద్రబాబు కాంగ్రెస్ దగ్గరవుతాడా?

ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న నేపధ్యంలో ఒక్క సారిగా చంద్రబాబు కేంద్రంతో సహవాసం వదులుకొని తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారు. చాలా మంది దృష్టిలో ఇది అనూహ్యం అనిపిస్తున్నా రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారికి మాత్రం ఇది 2019 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బాబు వేసిన పక్కా స్కెచ్ గా అనిపిస్తుంది.

2014 నాటి పరిస్థితులను పునరావృతం చేయడమే బాబు ప్లాన్

2014 కి ఏడాదికి ముందు ఏపీలో రాజకీయ పరిస్థితి వైసిపి కి అనుకూలంగా బాబు నాయకత్వంలోని టిడిపి కి వ్యతిరేకంగా ఉంది. ఒక దశలో టీడిపి కి డిపాజిట్లు రాని పరిస్థితి. కానీ 2014 కు ఆరు నెలలకు ముందు కేంద్రం ఏపీ ని విడదీయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ దశలో కూడా బాబుకు రాజకీయాలు ప్రతికూలంగానే ఉన్నాయి. కారణం రెండు కళ్ళ సిద్దాతం. అదే వైసిపి మాత్రం విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర నినాదాన్ని ఎంచుకుంది. ఇంకేముంది బాబు పని అయిపోయింది జగన్ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. తెలంగాణ ఉద్యమం అక్కడి ప్రజలలో పట్టుదలను నేర్పింది. సమైక్యాంధ్ర ఉద్యమం పోరాట పటిమను కాకుండా పిరికితనాన్ని నేర్పింది. దీనికి కారణం ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెలంగాణను వ్యతిరేకించే కౌంటర్ ఉద్యమంగా నడిపడమే. విడిపోయేనాటికి ఏపి ప్రజలలో రెండు భావనలు వచ్చినాయి. 1. విడిపోయినాము కనుక బ్రతకలేము. 2. తెలంగాణ మీద కోపం కనుక హైదరాబాదును తలదన్నే రాజధానిని నిర్మించాలి. ఈ రెండు భావనలు ప్రాతి పదికనే బాబు పక్కా ప్లాన్ రచించినారు. అనుభవం ఉన్న నాయకుడి అవసరం. బ్రతకలేం కనుక కేంద్రం సహకరించాలి. ఈ ప్రచారంతో పాటు ఎలాగూ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మోది గారు కనుక వారితో స్నేహం చేసినారు. విడిపోవడానికి కాంగ్రెస్ తో సహ
బిజెపి కూడా కారణం కాని అందుకు బిన్నంగా ప్రజలు బిజెపి కి కూడా సీట్లు ఇచ్చినారు. అందులోను విజయమ్మ లాంటి వారిని ఓడించి మరీ గెలిపించినారు. ఈ సందర్బంగా తేలింది ఏమిటి? ప్రాతిపదికలేని సెంటిమెంట రాజకీయాలు నడిస్తే ఫలితాలు ఎలాంటి దిశనైనా తీసుకుంటాయని అర్థం అవుతుంది. ఈ విజయం నుంచి అనుభవం నేర్చుకున్న బాబు 2019 ఎన్నికలలో కూడా 2014 నాటి స్థితిని తీసుకు రావడం రాజకీయంగా ఉపయోగం అన్న నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతుంది. 2019 ఎన్నికలలో కేంద్రం రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఏమి చేయాలి, ఏమి చేసింది అన్న అంశంతో బాటు విభజన చట్టం అమలు చేయించడం కోసం బాబు నిర్వహించిన పాత్ర ఏమిటి, రాష్ట్రంలో తనకు సంక్రమించిన అధికారాన్ని ప్రజల ప్రయోజనాల కోసం ఎలా వినియోగించినారు. అన్న అంశాల ప్రాతిపదికన ప్రజల ముందు చర్చ జరగాలి. ఈ చర్చ జరిగితే కేంద్రం పై మంచి అబిప్రాయం రాక పోవచ్చును గాని బాబు గారి మీద కూడా వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంది. అందుకే బాబు 2019 ఎన్నికలలో తన పాత్రకు సంబందించిన అంశాలు చర్చకు రాకూడదని కేవలం కేంద్రం పాత్రే చర్చలో ఉండే విదంగా రాజకీయం నడపడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు బాబుకి రాష్ట్రంలోని ప్రతిపక్షాల వైఖరి కూడా బాగా కలిసి వస్తున్నది. నిజానికి హేతుబద్ధమైన చర్చ నడిస్తే వాస్తవాలు ప్రజలకు అర్థం అవుతాయి. ఒక్క ఉదా… విడిపోయాక హైదరాబాదు ఆదాయం కోల్పోవడం వలన ఏటా 10 వేల కోట్లు నష్టం జరిగింది వాస్తవమే. కానీ 2014 లో అధికారంలోకి వచ్చిన మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర రాష్ట్ర పన్నుల నిష్పత్తి 32 శాతం నుంచి 42 శాతంకు పెంచడం వలన ఒక్క ఆంద్రప్రదేశ్ కు ఏడాదికి వస్తున్న అదనపు ఆదాయం 22 వేల కోట్లు అయింది. ఇది అన్ని రాష్ట్రాలకు వస్తుంది కదా అంటే నిజమే కానీ హైదరాబాదును కోల్పోవడం వలన జరిగిన ప్రత్యేక నష్టం తీరినట్లే కదా. కానీ సెంటిమెంట్ రాజకీయాలు నడిచే చోట వాస్తవాలను వినడానికి సమాజం సిద్దం కాదు. ఒక వేల సిద్ధమైనా రాజకీయ నాయకులు పక్కదారి పట్టిస్తారు. కీలకమైన పోలవరం, రాజధాని విషయాలలో కేంద్రంతో బాటూ రాష్ట్రం కూడా తీవ్రమైన తప్పులు చేస్తూనే ఉన్నది. కానీ హోదా హోరులో అవి చర్చకు కూడా రావడం లేదు. అంతకు మించి 6 లక్షల కోట్ల విలువైన విభజన చట్టం అమలు కోసం కృషి చేయకపోవడం రాష్ట్రానికి ముఖ్యంగా రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు బాబు లోపాలను గట్టిగా మాట్లాడి జనం ముందు దోషిగా నిలబెట్టిన ప్రతిపక్షాలు అంతకు మించి హోదా ఉద్యమాన్ని నడుపుతున్నాయి. అది ఒక్కటే సంజీవని అన్న భ్రమను ప్రజలలో కల్పించడంలో బాబు కన్నా జగన్ పాత్ర ఎక్కువ. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు అదే సంజీవని బాబు కావాలని అడగడానికి కేంద్రంతో రాజకీయ అనుబంధాన్ని వదులుకుని ముందుకు వచ్చినారు. ప్రతిపక్షాలు కూడా బాబు కేంద్రం నుంచి బయటకు రావాలి నాయకత్వం వహించాలి అన్న డిమాండును కూడా చేస్తూనే వచ్చినాయి. కొంత ఆలశ్యం అయినా బాబు నేడు ప్రతిపక్షాలు డిమాండుకు అనుకూలంగానే హోదా ఉద్యమాన్ని నడపడానికి ముందుకు వచ్చినారు.

బాబుకు కలిసి వస్తున్న ప్రతిపక్షాల వైఖరి

నిన్నటి వరకు ప్రతిపక్షాలు చేసిన ప్రతి పోరాటం బాబుకు రాజకీయంగా చికాకు కలిగిస్తే అదే ప్రతిపక్షాలు నాలుగు సంవత్సరాలుగా హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచడం ద్వారా నేడు బాబు 2019 ప్లాన్ కు ఉపయోగపడుతున్నది. రాష్ట్రానికి ఏమి రాకపోయినా హోదా వస్తే చాలు బ్రతికి పోతాం అన్నట్లుగా ప్రతిపక్షాలు రాజకీయం నడిపినాయి. బాబు కేంద్రం నుంచి బయటికి రావాలి అన్న డిమాండును ప్రధానంగా చేసిన ప్రతి పక్షాలు నేడు బాబును ప్రశ్నిస్తున్నది ఇన్ని రోజులు ఏమి చేసినారు అని. కొంత కాలం ఈ మాటకు విలువ ఉన్నా ఇవ్వాల్సింది కేంద్రం కాబట్టి కాలం గడిచే కొద్ది బాబు మెతక వైఖరిని పెద్దగా ప్రజలు పట్టించుకోకపోవచ్చు.

మోది వ్యతిరేక ప్రచారంలో బాబుది బహుముఖ వ్యూహం

హోదా ఉద్యమం కారణంగా ఒక దశ దాటిన తర్వాత ప్రజలలో వచ్చే అభిప్రాయం ఇప్పటి వరకు ఏమి జరిగిందో జరిగింది. ఇక జరగాల్సింది… హోదా ఎలా వస్తుంది అనే అబిప్రాయానికి వస్తారు. ఇక్కడే బాబు ప్రతిపక్షాల కన్నా ముందు ఉన్నారు. హోదాను ఇవ్వాల్సింది కచ్చితంగా కేంద్రం మాత్రమే. దేశంలో ఉన్నది రెండు పార్టీలు. అందులో ఒకటి బిజెపి అది హోదా ఇవ్వమని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక మిగిలింది కాంగ్రెస్ ఇపుడు వారు ఇస్తామని కచ్చితంగా చెపుతారు. అవకాశం ఉంటే మూడవ ఫ్రంట్ అది కూడా కాంగ్రెస్ పరోక్ష మద్ధతు తోనే రావాలి. అంతిమంగా కాంగ్రెస్ పాత్రం కీలకం. దేశంలో అనేక కారణాల వలన బిజెపి ఓడిపోతుంది అన్న ప్రచారం ముందుకు వస్తుంది. దానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి. ఆ పార్టీ గెలిచిన 280 సీట్లలో 202 సీట్లు కేవలం 6 రాష్ట్రాలలో ( యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహర్, ఢిల్లీ) వచ్చిన ఏక పక్ష పలితాల పలితమే. 2014 తర్వాత అన్ని ఎన్నికలలో బీహర్, మధ్యప్రదేశ్, రాజస్థాన లలో బిజిపి ఓడిపోయింది. గుజరాత్, ఢిల్లీలో కూడా తగ్గు ముఖం పట్టింది. కీలకమైన యూ పి లోకూడా మాయా, అఖిలేష్ ఒకటి అయితే అక్కడ కూడా బిజిపి కి ప్రతి కూలమే. ఆ లెక్కన మోది గ్రాప్ తగ్గింది, కొంత మేరకు కాంగ్రస్ గ్రాఫ్ పెరిగింది. ప్రాంతీయ పార్టీలయిన డిఎంకె, తృణమూల్, ఆర్ జెడి, సమాజ్ వాది పార్టీ, బిఎస్ పి అవకాశం వస్తే మూడవ ప్రంట్ గానో లేదా కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు కర్నాటకలో గాని బిజెపి ఓడిపోతే ఈ వాతావరణం మరింత పెరుగుతుంది. అసలు విషయానికి వస్తే ఏపి ప్రజల సంజీవని హోదా వచ్చే అవకాశం కాంగ్రస్ చేతిలో ఉందేమో అన్న దింపుడు కళ్లం ఆశ చిగిరిస్తుంది. దీన్నే చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల కన్నా ఒక అడుగు ముందుకువేసి ఎవరైతే నాకేంటి నాకు రాష్ట్రం ముఖ్యం బీ జే పీ ఇవ్వమన్నది కాంగ్రస్ ఇస్తమంటున్నది ఎవరు ఇస్తే వారితోనే నేను అని కాంగ్రస్ కు దగ్గరయ్యే రాజకీయం చేస్తున్నారు. జగన్ కూడా ఇలాంటి ప్రకటన చేస్తున్నా కాంగ్రెస్ విషయంలో అంత ముందుకు వెళ్లడం లేదు. పై పెచ్చు బాబు కాంగ్రెస్ కు దగ్గర వుతున్నారని వైసిపి నే సర్టిపికేట్ ఇస్తున్నది. తెలుగు ప్రజలకు మోసం చేసిన బిజెపి ని కర్నాటకలో ఓడించండి కాంగ్రెస్ ను గెలిపించండి అనే రాజకీయ నిర్ణయం బాబు తీసుకోవడం 2019 నాటికి బాబుకు కలిసివస్తుంది. బాబును రాజకీయంగా వ్యతిరేకించే వారు కూడా 2014 లో అనుభవం, కేంద్రంలో అధికారంలోకి వచ్చేవారితో స్నేహం చేసినారు అన్న కారణంతో గెలింపించినారు. రేపు 2019 లో కూడా బిజెపి ఇస్తామని మోసం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేక పోతే ప్రాంతీయ పార్టీల కూటమి కూడా కాంగ్రెస్ మద్దతుతో వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పాత్ర కీలకం అని కాంగ్రెస్ తో బాబు అనధికారికంగా ముందుకు వెలతారు. ఎలాగో జగన్ బాబు కాంగ్రెస్ కు దగ్గరైనారు అని వద్దన్నా సర్టిపికేట్ ఇస్తారు. అలా తాను కాంగ్రెస్ కు దూరం అని కూడా పరోక్షంగా జగన్ ప్రజలకు సంకేతం ఇస్తారు. ఈ పరిణామాల నడుమ బాబు పాలన వైఫల్యాలు పక్కకు పోయి 2019 తర్వాత కేంద్రంతో స్నేహంగా ఉండి, హోదా తీసుకు వచ్చే ఒకే ఒక అవకాశం బాబుతోకే ఉంది అన్న బావన కల్పించి మళ్లీ గెలవాలన్నదే బాబు మాస్టర్ ప్లాన్. అలా నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన చక్కటి హోదా ప్లాట్ ఫాం మీదకు జెండా పట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అందరిని పక్కకు నెట్టి 2019 అధికార రైలు ఎక్కడానికి సిద్దపడుతున్నారనిపిస్తుంది.

-యం. పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
9490493436.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *