ఇక్కడా ఉన్నాడో చౌకీదార్, ఇతని పేరు సూర్య!

(బి వి మూర్తి)

బెంగుళూరు: దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంతకుమార్ సతీమణి తేజస్విని అనంతకుమార్ ను కాదని బెంగుళూరు దక్షిణ నియోజకవర్గానికి ఆర్ ఎస్ ఎస్ యువతరంగం తేజస్వి సూర్యను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు బిజెపిలోనే చాలా మంది ముక్కున వేలేసుకున్నారు.

తేజస్వినికి టికెట్ ఖాయమని కర్ణాటక పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప అంతక్రితం ఎన్నోసార్లు కరాఖండీగా చెప్పారు. అంతెందుకు, బెంగుళూరు దక్షిణ నుంచి తనను అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలియగానే సాక్షాత్తూ సూర్యే `ఓఎంజి’ అంటూ ట్వీట్ చేశాడు.

పార్టీకి నూతన జవసత్వాలు కలిగించేందుకై ఆర్ ఎస్ ఎస్ సిఫార్సు మేరకు కొత్తవారికి టికెట్లివ్వడం బిజెపికి కొత్తేమీ కాదు. 2014 ఎన్నికల్లో మైసూరు-కొడగు నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపి ప్రతాప్ సింహకు టికెట్ లభించింది ఆ కోటాలోనే. ఆర్ ఎస్ ఎస్, బిజెపిలు భుజాల మీద మోసే అఖండ భారత్ భావజాలం ప్రాతిపదికగా కొన్ని కన్నడ పత్రికల్లో విస్ఫోటక కాలమ్స్ రాస్తూ ఫైర్ బ్రాండ్ పాత్రికేయుడుగా ప్రఖ్యాతుడైన ప్రతాప్ సింహకు అప్పట్లో నిరంతరం గన్ మెన్ రక్షణగా ఉండేవారు.

నగరంలోని బసవనగుడి బిజెపి ఎమ్మెల్యే రవి సుబ్రమణ్యం మేనల్లుడైన తేజస్వి సూర్యకు లోక్ సభ టికెట్ లభించడంలో కూడా ఆర్ ఎస్ ఎస్ కీలక పాత్ర పోషించినట్టు సన్నిహిత వర్గాల భోగట్టా. కర్ణాటక పార్టీ అధినేత యడ్యూరప్పకు కూడా తెలియకుండా ఇంత గుంభనంగా ఈ వ్యవహారం నడపడం పార్టీలోని ఒక వర్గానికి నచ్చినట్టు లేదు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజున ఉదయం పేరు ప్రకటిస్తే మధ్యాహ్నానికల్లా సూర్య నామినేషన్ వేశారు.

ఆర్ ఎస్ ఎస్ పెంచి ప్రచారం చేస్తున్న జాతీయత, దేశభక్తి భావజాలాన్ని అణువణువునా జీర్ణించుకున్న ఈ 28 ఏళ్ల హైకోర్టు లాయర్ గొప్ప ట్వీటు వీరుడు. తాజాగా `చౌకీదార్ సూర్య’ పేరుతో కొనసాగుతున్న ట్విటర్ ఖాతా అనుయాయుల సంఖ్య గత రెండు మూడేళ్లలో 60,000 నుంచి 1,00,000 కు చేరుకుంది. 2014లో నరేంద్ర మోడీ తరఫున ర్యాలీలు, సభలు నిర్వహించడంలో తేజస్వి సూర్య తన శక్తి సామర్థ్యాలు చాటుకున్నాడు.

మంచి వాగ్ధాటి గల ఈ యువనేత దేశ వ్యాప్తంగా వందకు పైగా ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించాడు. కొన్నేళ్ల క్రితం యుకె హైకమిషన్ ఆధ్వర్యంలో కర్ణాటకలోని మరికొందరు వర్థమాన నాయకులతో కలసి యునైటెడ్ కింగ్ డం వెళ్లి సూర్య యంగ్ లీడర్ షిప్ కోర్సు చేసి వచ్చాడు. గత ఏడాది జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బిజెపి డిజిటల్ ప్రచార బృందానికి సారథ్యం వహించి డిజిటల్ రాజకీయ ప్రచారాన్ని(క్యాంపెయిన్ కాదు కమ్యూనికేషన్ అని వాళ్లు చెబుతారు) సరికొత్త స్థాయికి తీసికెళ్లడంతో పార్టీ జాతీయ నాయకుల దృష్టిలో పడ్డాడు.

దక్షిణ బెంగుళూరు నుంచి స్వయంగా నరేంద్ర మోదీ రంగంలోకి దిగుతున్నారనీ, అందుకే అభ్యర్థి తేజస్విని పేరు ప్రకటించకుండా చివరిదాకా పెండింగ్ లో పెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. సూర్య పేరును ఆఖరి క్షణంలో ప్రకటించేసరికి అనామకుడైన అభ్యర్థి, ఆ పార్టీలో అసమ్మతి, వెరసి మనకే లాభమని కాంగ్రెస్ చంకలు గుద్దుకున్నది. సూర్య అనామకుడూ కాడు, బిజెపి ఇంట్లో అసమ్మతీ లేదని తర్వాత్తర్వాత అర్థమయింది.

అనంత్ కుమార్ 1996 నుంచి వరసగా ఆరు సార్లు ఈ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నందన్ నీలేకనిపై అనంత్ కుమార్ 2.28 లక్షల వోట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో సూర్య తనకు రెట్టింపు వయసున్న కాంగ్రెస్ ప్రత్యర్థి బి కె హరిప్రసాద్ ను ఢీ కొంటున్నారు.

సూర్య ఎంపికలో రాజకీయ, కులసమీకరణల హోంవర్కు బాగానే చేసినట్టు స్పష్టమవుతున్నది. అనంత్ కుమార్ బ్రాహ్మణుడు కాగా సూర్య కూడా ఆ కులానికే చెందిన వాడు. బెంగుళూరు దక్షిణ సీటులోని మొత్తం 22.16 లక్షల వోటర్లలో 5.5 లక్షల మంది బ్రాహ్మణులు, 4.5 లక్షల మంది వక్కళిగులు ఉన్నారని సూర్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ముస్లింలు 3 లక్షల మంది, క్రిస్టియన్, ఓబిసి, ఎస్ సి, ఎస్ టి లంతా కలిసి లక్ష మంది దాకా ఉంటారని అతని అంచనా.

రాజ్యసభ సభ్యుడిగా గతంలో పని చేసిన బి కె హరిప్రసాద్ ఈడిగ (బిసి) కులానికి చెందిన వారు. బిజెపి బ్రాహ్మణ, వక్కళిగుల వోట్లపై భరోసాతో ఉంది. కాంగ్రెస్ షరా మామూలుగా అహింద వోట్లపై ఆధారపడింది. అయితే జెడిఎస్ తో పొత్తు వల్ల వక్కళిగుల వోట్లు భారీగా పడగలవని కాంగ్రెస్ ఆశపడుతున్నట్టున్నది. కానీ కర్ణాటకలో చాలా చోట్ల పొత్తు కంటే పరస్పర వెన్నుపోట్లే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నది. పైగా బెంగుళూరులోని వక్కళిగులు పల్లెల్లో వలె తమ నాయకుల వీరభక్తులు కాకపోవడం, బాగా చదువుకున్న `ఎలైట్’ కేటగిరీ కావడం విశేషం (వీళ్లు బూత్ దాకా రావడం చాలా కష్టం). మొత్తమ్మీద ఎన్నికల్లో గెలిస్తే, యావద్భారత దేశం నుంచి కాకపోయినా కనీసం కర్ణాటక నుంచి లోక్ సభలో కాలుమోపిన అతి పిన్న వయస్కుడైన ఎంపిగా సూర్య రికార్డు సృష్టిస్తాడు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *