బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ సేఫ్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు

(బివి మూర్తి)

శుక్రవారం నాడు న్యూజిలాండ్  క్రైస్ట్ చర్చ్ నగరంలో  లో మసీదుపై జరిగిన టెర్రరిస్టు దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృటిలో తప్పించుకుంది. మసీదులోకి చొరబడి ఒక తీవ్రవాది విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో దాదాపు నలభై మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి బయటపడ్డాక న్యూజిలాండ్ జట్ల మధ్య జరగవలసి ఉన్న మూడవ క్రికెట్ టెస్టు రద్దయింది. ఈ నెల 16న హేగ్లీ ఓవల్ లో మూడవ టెస్టు మ్యాచ్ జరగవలసి ఉంది.

క్రైస్ట్ చర్చ్ నగరంలోని అల్ నూర్ మాస్క్ లో ఓ గన్ మ్యాన్ జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించారు. బంగ్లాదేశ్ క్రికెటర్ లు ఎవరూ దాడికి ఆహుతవకుండా, గాయపడకుండా క్షేమంగా బయట పడటం గొప్ప అదృష్టమనే చెప్పాలి. ఇదే మాస్క్ లో శుక్రవారం ప్రార్థనలు జరపడానికై బంగ్లా క్రికెటర్లు ఓ బస్సులో వస్తున్నారు. గన్ మ్యాన్ కారులో రావడం ఇంకొన్ని నిముషాలు ఆలస్యమైనా పరిస్థితి మరోలా ఉండేదేమో. బస్సు అక్కడికి వచ్చీ రాగానే భద్రతా సిబ్బంది హడావుడిగా క్రికెటర్లను అక్కడి నుంచి వెనక్కి తీసికెళ్లి పోయారు.

మశీదుపై దాడి సంఘటనపై దిగ్భ్రాంతి చెందినట్టు ముష్ ఫిఖర్ రహీం, తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశారు. మశీదు నుంచి క్షేమంగా తిరిగి రాగలిగాం గానీ తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యామని పేర్కొన్నారు. న్యూజిలాండ్ పర్యటనలో తమ భద్రత కోసం ప్రార్థనలు చేయవలసిందిగా ఆభిమానులకు వారు విజ్ఞప్తి చేశారు.

హేగ్లీ ఓవల్ టెస్టును రద్దు చేయాలని న్యూజిలాండ్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్ణయించాయి. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వీలైనంత త్వరగా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్ జడ్ సి అధినేత డేవిడ్ వైట్ న్యూజిలాండ్ జాతీయ టివి ప్రతినిధికి చెప్పారు.

ఈ వారాంతంలో న్యూజిలాండ్ డెవలప్ మెంట్ టీమ్, ఆస్ట్రేలియా అండర్ 19 మహిళల జట్లు ఆడవలసి ఉన్న మరో రెండు క్రికెట్ మ్యాచ్ లను కూడా ఎన్ జడ్ సి రద్దు చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *