శ్రీదేవి మృతదేహం రాక అలస్యమైంది, ఎందుకో తెలుసా?

దుబాయ్ అసుపత్రి నుంచి నటి శ్రీదేవి మృత దేహం బయటకు వచ్చి ముంబాయి పయనమయ్యేందుకు బాగా జాప్యం జరిగింది.దీనితో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో మృతదేహం అప్పగింత ఎందుకు ఆలస్యమయిందో చెప్పే ఒక అసక్తి కరమయిన కథనం

శ్రీదేవి దుబాయ్‌లో మరణించారు! ఆమె పార్థివ దేహం ఎప్పుడెప్పుడు వస్తుందా అని భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యులతోపాటు అభిమానులంతా ఎదురు చూస్తున్నారు! శ్రీదేవి పార్థివ దేహాన్ని సత్వరమే పంపించాలంటూ భారత్‌లోని అత్యున్నత స్థాయి వర్గాలు దుబాయ్‌ అధికార వర్గాలకు ఫోన్ల మీద ఫోన్లు చేశాయి! పలువురు పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు. కానీ, శనివారం రాత్రి మరణించిన శ్రీదేవి భౌతిక కాయం సోమవారం కానీ భారత్‌ వచ్చే అవకాశాల్లేవు! అత్యున్నత స్థాయి వర్గాలు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇందుకు కారణం.. దుబాయ్‌లోని చట్టాలే! అక్కడి చట్టాలు.. విదేశీ ఎంబసీలు, ప్రభుత్వాల ప్రభావంతో పని చేయవు. నిబంధనల ప్రకారమే పని చేస్తాయి. శ్రీదేవి విషయంలో ఇది మరోసారి రుజువైంది.

దుబాయ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు తరలించే వందలాది మృతదేహాలను అల్‌ ఖుసేస్‌లోని పోలీసు మార్చురీలోనే భద్రపరుస్తారు. సెలబ్రిటీ అయిన శ్రీదేవి భౌతిక కాయాన్ని కూడా అక్కడే భద్రపరిచారు. ఫోరెన్సిక్‌ పరీక్షలు పూర్తయిన తర్వాతే ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తామని అక్కడి పోలీసులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం, ఇతర వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికే కార్యాలయ పని వేళలు ముగిశాయి. దాంతో, పరీక్ష నివేదికలను పూర్తిగా అధ్యయనం చేయనిదే తుది నివేదికను జారీ చేయలేనని వాటిని నిర్వహించిన డాక్టర్‌ ఖాలీద్‌ అల్‌ అబురైఖీ స్పష్టం చేశారు. డాక్టర్ల నివేదిక రాకుండా మృతదేహాన్ని తాము అప్పగించలేమని పోలీసులు చెప్పారు. సోమవారం ఉదయం వైద్య నివేదికలు అందిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారని, ఆ తర్వాతే పోలీసు క్లియరెన్స్‌ లభిస్తుందని తెలుస్తోంది. అనంతరం దుబాయిలోని భారతీయ కాన్సులేటు శ్రీదేవి పాస్‌ పోర్టును రద్దు చేసి మరణ సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఆమె మృతదేహన్ని భారత్‌కు తీసుకెళ్లడానికి ఎన్‌వోసీ జారీ చేస్తుంది.

విధి విధానాలు ఇవీ!
మరణం ఎలా సంభవించినా (సహజం, ప్రమాదం, అనుమానాస్పదం) పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చనిపోతే అవే తెలుపుతాయి. బయట ఎక్కడ జరిగినా 999 నంబరుకు ఫోన్‌ చేసి తెలపాలి. పోలీసులు వచ్చి బలాఖ్‌ అల్‌ వఫాత్‌ (మరణ సమాచారాన్ని)ను నమోదు చేసి, మృతదేహాన్ని అల్‌ రాషేద్‌ ఆస్పత్రి లేదా అల్‌ ఖుసేస్‌ మార్చురీకి తరలిస్తారు. చికిత్స పొందుతూ మరణిస్తే ఆస్పత్రుల మార్చురీలో భద్రపరుస్తారు. ఫోరెనిక్స్‌ నిపుణులు మృతదేహాన్ని పరీక్షిస్తారు. అనేక సందర్భాల్లో పోస్టుమార్టం చేస్తారు. ఆ తర్వాత మరణానికి కారణాలను విశ్లేషిస్తూ నివేదిక జారీ చేస్తారు. మృతుల పాస్‌పోర్టు, వీసా పరిశీలించి పోలీసులు ధ్రువీకరిస్తారు. ధ్రువీకరణను పోలీసులకు అందిస్తే, వారు మృతదేహాలను అప్పగించాలని నాలుగు పత్రాలను ఆస్పత్రి, ఎయిర్‌లైన్స్‌, మృతదేహాన్ని రసాయనాలతో ప్యాకింగ్‌ (ఎంబాలింగ్‌) చేసే విభాగం, విమానాశ్రయం లేదా శ్మశాన వాటికకు జారీ చేస్తారు. వాటిని ఆస్పత్రిలో అందిస్తే, అది మరణ ధ్రువీకరణను అరబ్బీ భాషలో జారీ చేస్తుంది. దానిని వీసా వ్యవహారాల కార్యాలయంలో అందిస్తే వీసా రద్దు చేస్తారు. అరబ్బీ భాషలో ఉండే ఆ కాగితాలను ప్రధానంగా మరణ ధ్రువీకరణను ఆంగ్లంలోకి అనువాదించి భారతీయ కాన్సులేట్‌కు ఇస్తారు. పాస్‌పోర్టు సహా మొత్తం అన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే కాన్స్‌లేట్‌ ఎన్వీసీ జారీ చేస్తుంది. ఇందుకు మృతుల బంధువులు స్టాంప్‌ పేపర్‌పై నోటరీ అఫిడవిట్‌ పంపించాలి.

మృతులకు అంటువ్యాధులు ఉన్నట్లు తేలితే ఎన్వోసీ జారీకి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగని, దుబాయిలో అంత్యక్రియలు జరపడం కూడా అంత తేలిక కాదు. చివరకు, అన్ని పత్రాలనూ తీసుకెళ్లి అల్‌ మోహైసనా కేంద్రానికి వెళ్ళి అందజేసి, 1750 దిర్హాంలు (సుమారు రూ.31 వేలు) చెల్లిస్తే ఎంబాలింగ్‌ చేస్తారు. మార్చురీలో చట్టబద్ధ వీసా ఉన్నవాళ్లు సాక్షి సంతకం చేస్తే మృతదేహాన్ని అల్‌ మోహైసనాకు తరలిస్తారు.

ప్యాకింగ్‌ తర్వాత 210 దిర్హాం (రూ.3700)లు అద్దె తీసుకొని ప్రత్యేక వాహనంలో దుబాయి విమానాశ్రయం కార్గో విభాగానికి తీసుకెళ్లి, అక్కడ కొన్ని గంటలపాటు పెట్టిన తర్వాత విమానంలో ఎక్కిస్తారు. దుబాయిలో ఎవరైనా మరణిస్తే సహాయం కోసం భారతీయ వలంటీర్లు సీపీ మాథ్యూను 0097155 3090506, పాడే ఉమాలను 00971504675876 నంబర్లలో సంప్రదించవచ్చు

(ఆంధ్రజ్యోతి, గల్ఫ్ లేఖ  నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *