కర్నాటక మండ్య ఎన్నిక: సుమలత సుడిగాలిలో జెడిఎస్ గిలగిల

(మండ్య నుంచి యనమల నాగిరెడ్డి & బి.వి.మూర్తి)

కర్ణాటకలో ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గాలలో  మండ్య లోకసభ ఎన్నిక మొదటిదని చెప్పవచ్చు.

ఈ స్థానం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ముద్దుల తనయుడు,  గౌడ కులస్తుల ఇలవేలుపుగా గౌరవం అందుకుంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ ప్రియమైన మనమడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. తాత, తండ్రుల మద్దతుతో  ఎన్నికల బరిలో దిగారు.నిఖిల్ ని లోక్ సభ కు పంపడం కుటుంబగౌరవంగా తాత,తండ్రి భావిస్తున్నారు.

 సినీ-రాజకీయ వేత్త,సినీ రంగంలో పెద్దన్నగా చాలా కాలం వెలిగిన అంబరీష్ సతీమణి, తెలుగు-కన్నడ సంస్కృతుల మేలుకలయికగా మారిన సినీతార సుమలత స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నిఖిల్ కు ప్రధాన ప్రత్యర్థి.  “కొండను ఢీ  కొంటున్నచిన్న పొట్టేలుగా” ఎన్నికల రణరంగంలో ఆమె కాలు మోపారు.తెలగామే అని ఆమె నాన్ లోకల్ గా చిత్రీకరించే ప్రయత్నమూ ఇక్కడ జరుుగుతూ ఉంది.

“మండ్య ద గండు” గా పేరుగాంచిన దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మండ్య స్థానం నుండి కాంగ్రెస్ తరఫునే పోటీచేయాలని సుమలత ఆశించారు.

అయితే రాజకీయ పొత్తులలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని జేడీఎస్ కు వదల వలసి వచ్చింది.  తమ పార్టీ తరపున పోటీ చేయాలని సుమలతను ఒప్పించడానికి ప్రయత్నించిన బీజేపీ ప్రయత్నించి, విఫలమైంది. అయితే అనేక నాటకీయ పరిణామాల తర్వాత సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.

అక్కడి నుండి ఆమెకు అధికార జేడీఎస్ నాయకులు నిజమైన (అధికార,కుళ్ళు, కుల)  రాజకీయాలు, కుటిల ఎత్తుగడలు ఎలాఉంటాయో చూపించడం ప్రారంభించారు.

సుమలత పోటీలో ఉంటె తమ గెలుపు అంత సులభం కాదని గ్రహించేందుకు రూలింగ్ పార్టీకి ఎక్కువ కాలం పట్టలేదు.

సుమలత 220 సినిమాలలో నటించారు. ఆమె ఆరుభాషలు మాట్లాడతారు. దక్షిణాది నాలుగు భాషలలో నటించి విజయవంతమయ్యారు. మండ్యలో సుమలత అంబరీష్ ‘రెబెల్’ లెగసీని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అన్నికులాలకు, అన్ని పార్టీలకు చెందిన అంబరీష్ అభిమానులు ఆమె అసెట్. అదే చిక్కు సమస్య అయి కూర్చుంటున్నది రూలింగ్ జెడిఎస్ నెంబర్ వన్ ఫామిలీకి.

ఎలాగైనా సరే సుమలత ప్రభావం తగ్గించేందుకు  జేడీఎస్ వ్యూహాలు మొదలుపెట్టింది. ఓటర్లను అయోమయంలో పడవేసి, సుమలత ఓట్లు చీల్చడానికి (ఆమెకు పడే ఓట్లు తగ్గించడానికి)  “సుమలత” పేర్లున్న మరో ముగ్గురు మహిళలతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయించారు జెడిఎస్ అగ్రనేతలు. గెలుపుకోసం ఎంత దిగజారుడే!

కొండలను ఢీ కొంటున్న ఒంటరి మహిళ!

2018 శాసన సభ ఎన్నికలలో  మండ్య పార్లమెంటు నియోజక వర్గంలో ఉన్న 8 శాసన సభ స్థానాలను జేడీఎస్ గెలుచుకుంది. ఇందులో ఇరువురు (పుట్ట రాజు మరియు తిమ్మప్ప) మంత్రులుగా ఉన్నారు.ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు రెండవ స్థానం లో నిలువగా, బిజెపి మూడవ స్థానానికి పడిపోయింది.

ముఖ్యమంత్రి కుమారస్వామి,  మంత్రులు పుట్టరాజు, తిమ్మప్పలతో పాటు 6 మంది ఎంఎల్ ఏ లు, ఈ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీ లు, పార్టీ దళపతులు, కార్యకర్తలు దేవగౌడ ముద్దుల మనవడు నిఖిల్ గౌడకు కొండంత అండగా ఎన్నికల రణరంగంలో నిలబడ్డారు.

దీనికి తోడు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధాని, తాత దేవెగౌడ రాజకీయ చతురత, ఎత్తుగడలు జేడీఎస్ అభ్యర్థిక నిఖిల్ కు పెట్టని కోటగా నిలుస్తున్నాయి.  ఇక అధికార పక్షానికి మడుగులొత్తే అధికార గణం ఉండనే ఉంది. ( ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గా నిఖిల్ గౌడ అసంపూర్తిగా దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్లర్  ముంజుశ్రీ ఆమోదించడం, ఆ తర్వాత ఎన్నికల అధికారులు జరిగిన తప్పును సరిచేయకుండా సన్నాయి  నొక్కులు నొక్కడం, కోర్టుకు వెళ్ళమని సుమలతకు సలహా ఇవ్వడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఆ అధికారిని ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం జరిగింది.) ఇకపోతే ముఖ్యమంత్రి తనయుడిగా నిఖిల్ కు ఆర్ధిక పరమైన భరోసా పుష్కలంగా ఉందనేది చెప్పవలసిన అవసరం లేదు. ఆమె పర్యటనలు ఇలా సాదాసాదీగా ఉంటాయి. ఏమీ పెద్దగా ఏర్పాట్లు లేని ఒక చిన్న ట్రక్కు మీద ఆమె ప్రచారం సాగుతూ ఉంది.

ఇక సుమలత విషయానికొస్తే ఆమె భర్తను కోల్పోయిన మహిళ.అయితే, భర్త అంబరీష్ కు ఉన్న మంచి పేరు, నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు, సినీ నటుడుగా, రాజకీయ నాయకుడుగా ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాల ఆమెకు ఆసరా. ఈ జనబలంతో ఆమె ఎన్నికల రణరంగంలో అలుపెరుగని పోరు సలుపుతున్నారు. అంబరీష్ ను జనం అభిమానంగా అంబయ్యన్న అని పిలుస్తారు.

సినీ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు  అంబరీష్ తో ఉన్న బంధం ప్రస్తుతం ఆమెను కవచంలా కాపాడుతూ ఉంది.

దీనికి తోడు పెద్ద సంఖ్యలో అభిమానులను పోగు చేసుకున్న సినీ నటులు యాష్ , దర్శన్ లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. అలాగే తమిళ సినిమా రారాజు, జన్మతః కన్నడిగుడైన సినీ నటుడు  రజనీకాంత్, తెలుగు మెగా స్టార్ చిరంజీవి ఆమెకు అండగా నిలుస్తామని( ఆమె తరపున ప్రచారం చేస్తామని) మాట ఇచ్చారని ఇక్కడ ప్రచారంలో ఉంది.

అయితే  అధికార అండదండలు, లెక్కలేనంత ఆర్థిక బలం,చెప్పుకోదగిన అంగబలం తోడుగా (ధర్మమైనా, అధర్మమైనా) ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న జేడీఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడతో అంగబలం, ఆర్థిక బలం అంతగా లేకుండా   కేవలం జనాఅభిమానం ఆసరాతో, బహిరంగంగా బయటకు  మద్దతు పలకలేని స్థానిక కాంగ్రెస్ వత్తాసు తో సుమలత ధర్మ యుద్ధం చేస్తున్నది. బిజెపికూడా ఆమె మద్దతుతెలిపింది.

ఈ పోరులో ధనబలం, అధికార బలం, నాయకుల అండ దండలున్న నిఖిల్ గెలుస్తాడా? జనాభిమానంతో (బలసిన) కొండలను ఢీ కొంటున్న చిన్న పొట్టేలు సుమలత గెలుస్తుందా? అన్న ప్రశ్నకు మండ్య ప్రజలే సమాధానం చెప్పాల్సి ఉంది.    

ఇది కూడా చదవండి     

సుమలత దెబ్బ:మండ్యలో ఉన్నతాధికారి పై బదిలీ వేటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *