రాయలసీమ ప్రాజక్టుల పై పార్లమెంటులో చర్చ జరగాలి

(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
కృష్ణా జలవివాదాల పరిష్కార బ్రిజేష్ ట్రిబ్యునల్ – 11వ షెడ్యూల్ లో పేర్కొన్న రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాల ప్రాజక్టుల పై పార్లమెంటు లో చర్చించాలి.
ఆంధ్రప్రదేశ్ విభజన  చట్టం  పార్ట్- 9 , 85 వ సెక్షన్ గోదావరి, కృష్ణా యాజమాన్య బోర్డు ,జల నిర్వహణ మండలి విధుల గురించి తెలుపుతుంది.
ఇందులో 11 వ షెడ్యూల్ నియమాల ఆధారంగా, కేంద్రం అప్పగించిన విధులు కూడా నిర్వహించాలని ఉంది.
11 వ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలిగొండ,కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టు లను పూర్తి చేసి, వాటికి నీటి కేటాయింపులు కొనసాగించాలని ఉంది.
11వ షెడ్యూల్ అంశాలు అమలు కావాలంటే అవి విభజన చట్టం పార్ట్ 9,  89 వ సెక్షన్ లో ఉండాలి.  89 వ సెక్షన్ ప్రకారం కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ పదవీకాలాన్ని పెంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విచారణ చేయాలని చెబుతుంది.
ఇందులో ప్రాజెక్టుల వారిగా నీటిని కేటాయించకపోతే కేటాయించడం, తక్కువ నీటి ప్రవాహం ఉన్న సందర్భాలలో ప్రాజక్టుల వారిగా నీటిని విడుదల చేయడానికి ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయించాలని చెబుతుంది.
అంటే ప్రస్తుత బ్రిజేష్ ట్రిబ్యునల్ కేవలం 89 వ సెక్షన్ లోని రెండు అంశాలను మాత్రమే విచారణ చేయబోతోంది.
ఈ 85 వ సెక్షన్ లోని 11 వ షెడ్యూల్ ప్రాజెక్టులు తమ పరిధిలోకి రావని ట్రిబ్యునల్ చెబుతోంది. తక్షణం కేంద్రప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అమోదించిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం స్ఫూర్తిని గౌరవించి, 11 వ షెడ్యూల్ లొని వెనుకబడిన ప్రాంతాల ప్రాజక్టులను కూడా 89 వ సెక్షన్ కింద పరిగణలోకి తీసుకొని విచారించమని ఆదేశించాలి.
కృష్ణా నది నుంచి  ఇప్పటికే నీటిని పొందుతున్న ప్రాజక్టులను మరియు వెనుకబడిన ప్రాంతాలలోని ఈ ఆరు ప్రాజక్టులను మొత్తంగా విచారణ చేసి బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పాలి.
తెలిసో, తెలియకో విభజన చట్టం నిర్మాణం సమయంలో జరిగిన ఈ పొరపాటును సవరించి, విభజన చట్టం స్ఫూర్తిని కాపాడి ఎనిమిది వెనుకబడిన రాయలసీమ తదితర జిల్లాల ప్రాజక్టులకు ట్రిబ్యునల్ ద్వారా నీళ్ళు అందే అవకాశం కల్పించాలి. –
(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి. పోన్. నెం 99639 17187)