తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో జర్నలిస్టులపై నిషేధం

తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ లో జర్నలిస్టుల ప్రవేశంపై ఆంక్షలు విదించారు.

 ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని, పాత సచివాలయం తరహాలోనే జర్నలిస్టులు స్వేచ్ఛగా వార్తలు సేకరించేందుకు అనుమతించాలని శుక్రవారం సచివాలయ బీట్ జర్నలిస్టులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని కలిసి విజ్ఞప్తి చేసారు.

జర్నలిస్టులను అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, తాను ఈ విషయంలో ఏ నిమిత్త మాతృడేనని సీఎస్ జోషీ తేల్చిచెప్పడం జరిగింది.

సీఎం సీపీఆర్వో నుంచి వార్తలను సేకరించాలని సీఎస్ సలహా ఇవ్వగా, సీఎం సీపీఆర్వో కేవలం సీఎం కార్యాలయ ప్రకటనలకే పరిమితమని, సచివాలయ వార్తలతో వారికి సంభందం ఉండదని జర్నలిస్టులు సీఎస్ జోషి కి తెలియజేశారు.

అయితే, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ను సంప్రదించాలని, తానేమీ చేయలేనని సీఎస్ బదులిచ్చారు. పారదర్శకత పాటించడంలో తనకేమీ ఇబ్బంది లేదని, ప్రభుత్వ నిర్ణయం మేరకే అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టం చేశారు.

జర్నలిస్టుల ప్రవేశాన్ని నిరాకరించడం పాత్రికేయ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని, సీమాంధ్ర పాలకులు కూడా ఇలా చేయలేదని జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన వారిలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉన్నారని, అదే తెలంగాణలో జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించడం సరికాదన్నారు.

తెలంగాణ కోసం మీరంతా పోరాడిన విషయం తనకు తెలుసని, ప్రభుత్వ నిర్ణయం లో మార్పు వస్తే కానీ తానేమీ చేయలేమన్నారు.

నిర్ణయం మీ పైన ఉన్న వారు తీసుకున్నారా ? లేక కింది స్థాయి అధికారులు తీసుకున్నారా అని అడగగా, ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ సూటిగా సమాధానం ఇవ్వకుండా దాట వేశారు.

ఇకపై మీ వార్తలు బహిష్కరిస్తామని జర్నలిస్టులు తెలపగా, ‘మీరు నా వార్తలు రాస్తే ఆనందం, రాయకపోయినా నాకేమి ఇబ్బంది లేదు’ అని ఖరాఖండిగా చెప్పారు. ‘నాకేమైన ఓట్లు కావాలా ? నేనెందుకు మీడియా ను అడ్డుకుంటా’ అని సీఎస్ తన అసహాయతను వ్యక్తం చేశారు.

ఇక ఏమి చేయలేక జర్నలిస్టుల బృందం సీఎస్ కు రాత పూర్వక వినతిపత్రం అందజేసింది. అనంతరం బిఆర్కేఆర్ గేటు ఎదుట మౌన ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది.