నిమ్మగడ్డను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదు -ఏజీ

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది. వాదప్రతివాదనల అనంతరం నిమ్మగడ్డ తొలగింపుపై తీర్పు రిజర్వు చేసింది హైకోర్టు.

ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ 243కె అధికరణలో పదవీకాలం రక్షణ ప్రస్తావన లేదని తెలిపారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్న ఆయన.. ఎటువంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు.

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదని, నిమ్మగడ్డ రమేష్ ను తొలగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన తన వాదనను కోర్టుకు వినిపించారు. ఆర్డినెన్స్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకు అర్హత అయినవి కాదని ఆయన వ్యక్తం చేశారు.