నీటి పంపకాలపై జాగ్రత్త అవసరం – జగన్ కు మైసూరా సూచన  !

(యనమల నాగిరెడ్డి)
గోదావరి జలాలను క్రిష్ట్నా బేసిన్ కు తరలించే విషయంలోనూ, నీటి వాటాల పంపిణీలోనూ పొరుగు రాష్ట్రంతో ఆచి, తూచి అతి జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ మంత్రి డాక్టర్ ఎం.వి మైసూరా రెడ్డి గ్రేటర్ రాయలసీమ శ్రేయోభిలాషుల తరపున పంపిన లేఖలో సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను, గోదావరి నీటిని క్రిష్ట్న కు తరలించడానికి అంగీకరించి చర్చలు జరపడాన్ని వారు స్వాగతించారు.
అయితే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు  ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన సమయంలోను, అంతకు ముందు చోటు  చేసుకున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరపాలని ఆయన కోరారు. ఈ అంశాలపై జరిగే ముఖ్యమంత్రుల సమావేశాలు, అందులో జరిగే ఒప్పందాలు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే ఉండాలని ఆయన సూచించారు.
ఈ నీటి తరలింపు విషయంలో ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పోలవరం తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఎత్తిపోతల పధకాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఆయా పథకాల ద్వారా వస్తున్న నీటిని నాగార్జున సాగర్ లోకి తరలించి సాగర్ కుడి ఎడమ కాల్వల ఆయకట్టును స్థిరీకరించ వచ్చునని ఆయన వివరించారు. ఆంద్ర ప్రాంతం నుండి గోదావరి నీటిని తరలించడమే మేలని వారు అభిప్రాయపడ్డారు.  ఎపి ఆంద్ర ప్రాంతం నుండి నీటి తరలిస్తే తెలంగాణా ప్రభుత్వం “దుమ్ముగూడెం- సాగర్ టైల్ పాండ్” పధకం ద్వారా గోదావరి నీటిని తరలించాలని, సాగర్ కుడి, ఎడమ కాల్వల ఆయకట్టును స్థిరీకరించాలని ఆయన కోరారు.
కరువు ప్రాంతాలకు నీటి కేటాయింపు 
ఈ విధంగా ఆదా అవుతున్న నీటిని శ్రీశైలం ద్వారానే కరువు ప్రాంతాలకు కేటాయించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని  11 వ షెడ్యూల్ 1లోని 0 వ పేరా ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న “హంద్రీ-నీవా, గాలేరు-నగిరి,తెలుగు గంగ,వెలిగొండ, నెట్టంపాడు,కల్వకుర్తి” ప్రాజెక్ట్ లను పూర్తీ చేసి, నీటి కేటాయింపులు జరపాలని స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అందువల్ల జరగబోయే ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్ట్ లకు చట్టబద్ధతతో కూడిన నీటి కేటాయింపుల విషయానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే శ్రీశైలం నీటిమట్టం 885 అడుగులకు చేరినప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలని, ఆ మేరకు రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాయలసీమకు ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి కంటే అదనంగా 150 నుండి 200 టిఎంసిల నీటి అవసరం ఉందని, గోదావరి జలాల మల్లింపు ద్వారా క్రిష్ట్న బేసిన్ లో ఆదా అయ్యే నీటిని ఈ ప్రాంతాలకు కేటాయించాలని ఆయన కోరారు .
నీటి కేటాయింపులపై కేసులు 
రెండు   రాష్టాల మధ్య నీటి కేటాయింపులు, గోదావరి నదీజలాల విషయం పై  తెలంగాణా ప్రభుత్వం వివిధ న్యాయస్థానాలు, ట్రిబ్యునల్ లో వేసిన కేసుల ఉపసంహరణ, ఇతర చట్టబద్దమైన అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, భవిష్యత్తు లో వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు. పోలవరం ద్వారా ప్రస్తుతం క్రిష్ట్నా నదికి తరలిస్తున్న 80 టిఎంసిలలో మనకు మిగులుతున్న 45 టిఎంసిల నీటిలో తెలంగాణాకు వాటా ఇవ్వవలసిన అవసరం లేదని మైసూరా అభిప్రాయపడ్డారు. “క్రిష్ట్నా డెల్టా ఆధునీకరణ ద్వారా ఆదా అయిన 20 టిఎంసిల నీటిని భీమా పధకానికి కేటాయించారని” ఆయన గుర్తు చేశారు.
నీటి వివాదాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి అంగీకారానికి వస్తే, ఆ ఒప్పందాలను ట్రిబ్యునల్ ఆమోదించడం ఆంవాయతీగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ అంశాలను అధికారులు, ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని , రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్చలు జరపాలని, కుదిరిన ఒప్పందాలను ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్దం చేయాలని  గ్రేటర్ రాయలసీమ శ్రేయోభిలాషుల సమితి ఆ లేఖలో కోరింది.
హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఈ గ్రేటర్ రాయలసీమ శ్రేయోభిలాషుల సమావేశంలో మైసూరారెడ్డితో పాటు, కడప, అనంతపురం, కర్నూల్, చిత్తూర్, నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుండి మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏలు  మధుసూదన్ గుప్త, డాక్టర్ శివరామ క్రిష్ట్నా రావు, రిటైర్డ్ న్యాయమూర్తి లక్ష్మణ రెడ్డి, హనుమంతరెడ్డి, మాజీ సమాచార కమీషనర్ డాక్టర్ ఇంతియాజ్ అహమ్మద్, దేశం సుధాకర్,డాక్టర్ మధు,రఘు కార్తీక్ రెడ్డి, వీరారెడ్డి,గంగాధర నాయుడు, మాధవి కుమారి, గౌతమ్ రెడ్డి,ప్రసాదరావు పాల్గొన్నారు. వారు రాసిన ఈ లేఖను మైసూరారెడ్డి, శైలజానాథ్, తదితరులు ఇటీవల అనంతపురంలో పత్రికలకు విడుదల చేయడంతో పాటు, ముఖ్యమంత్రికి పంపారు.