‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌‘ మూవీ రివ్యూ

రాజకీయాలకు అతీతంగా సినిమాలుండవు. సినిమా అనేది అంత అమాయకపు మీడియం కాదు. సినిమా కూడా ఒక నిరంతర క్యాం పెయిన్ లో భాగమే. ఇపుడు సంచలనాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తీసిన బయోగ్రాఫిక్ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కూడా ఒక రాజకీయ సందేశాత్మక చిత్రమే.

ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించేనాటికే తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆమె ప్రవేశం రాజకీయాలలో భాగమయింది. ఆమె ప్రవేశం తర్వాత జరిగిన రాజకీయ సంఘటనలను లక్ష్మీ పార్వతి కోణంలో నుంచి చూపించే ప్రయత్నమే ఈ చిత్రం.

ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల మధ్య ప్రేమ,  పెళ్లి,  లక్ష్మీ పార్వతిరాజకీయ ప్రాముఖ్యం, ఈ ప్రాసెస్ లో ఆమెకి ఎదురైన సమస్యలు, అవమానాలు సినిమాకు టాపిక్ అయ్యాయి.

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పతనానికి ఒక విధంగా కారణమయ్యారు.ఎన్టీఆర్ పదవీచ్యుతుని చేశాక పార్టీ చంద్రబాబు తెలుగుదేశంగా మారింది. ఈ మార్పులో వెన్నుపోటు ప్రధానాంశమయింది.చంద్రబాబు ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు ఈ వెన్నుపోటు అనే మాటను ప్రధానాస్త్రంగా ప్రయోగిస్తున్నారు. ఇది ఇంకా జరుగుతూ ఉంది.

ఈ సినిమా విడుదలయ్యే నాటికి చంద్రబాబు వెన్నుపోటు దారుడని రోజు ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అందుకే ఈ సినిమా వల్ల మరింత హాని జరుగుతుందనే ఆందోళన టిడిపి వర్గాల్లో ఉంది. ఈ చిత్రం చంద్రబాబు నాయుడి తెలుగుదేశం విజయావకాశాలను దెబ్బతీస్తుందని కోర్టు కెళ్లారు. దీనిఫలితమే ఈ చిత్రం అంధ్రలో విడుదల కాలేదు. తెలంగాణలో విడుదలయింది.

కథ‌ :

టైటిల్ చిత్రంగానే ఉన్నా, అందులో కొంత నిజాయితీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే, రామ్ గోపాల్ వర్మ కచ్చితంగా చెప్పాడు, సినిమా పేరు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ’ అని. ఒక సినిమాను ఉమన్ గేజ్ నుంచి చూపిస్తున్నాడు. ఇదే కొత్త మనకి.

1989లో తెలుగుదేశం పార్టీ   అధికారం కోల్పోయిన సమయంలో ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతి (యజ్ఞ శెట్టి) వచ్చారు.

ఆమె విద్యావంతురాలు అని తెలిసి జీవిత చరిత్ర రాసే సామర్థ్యం ఉందని భావించి ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతికి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశిస్తారు.

ఒక స్త్రీ పురుషుడు సన్నిహితంగా మెలిగితే ఎన్ని పుకార్లు వస్తాయో అన్ని పుకార్లు ఎన్టీఆర్ , లక్ష్మి పార్వతి కలయిక మీద కూడా వచ్చాయి.అసలు జరగుతున్నదేమిటో క్లియర్ చేస్తే పోలా అని ఎన్టీయార్ మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్‌ ప్రకటిస్తాడు.

అంతేకాదు, 1994లో లక్ష్మీ(పార్వతి) తో కలిసి ప్రచారం చేసి భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు.  ఆమె హోదా పెరిగిపోయింది. దీనితో తిరుగుబాటు  మొదట కుటుంబంలో మొదలవుతుంది. కుటుంబాన్ని ‘బెదిరించి‘ తనవైపు తిప్పుకుంటాడు బాబు రావు.  ఈ కుట్ర విజయవంతమవుతుంది.

సీన్  వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర కు మారుతుందది.  అక్కడ ఆయనపై చెప్పులు వేయిస్తారు.  అందరూ కొత్తవారిని తీసుకుని ఈ రాజకీయ పరిణామాలను  వర్మ చాలా బాగా తీశారు. ఆయన చిత్రాలన్నీ చాలా మటుకు సాహస ప్రయత్నాలే.

విశ్లేషణ :

సినిమాలో రాజకీయం చక్కగా చూపించారు. రాజకీయాలు అనేది పెత్తనం కోసం సాగే ప్రయత్నమే. అది ఇల్లు కావచ్చు, ఆఫీసు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు. అధికారం. కావచ్చు. రామ్ గోపాల్ వర్మ సినిమా ఎన్టీఆర్ కుటుంబ రాజకీయాలను చక్కగా చూపింది. కుటుంబ రాజకీయాలతో తెలుగుదేశం పార్టీని, రాష్ట్రంలో అధికారాన్ని ఒక వ్యక్తి ఎలా దక్కించుకున్నారో చూపించింది. ఇంతవరకు ఎక్కడో న్యూస్ పేపర్లలో చర్చలలో లేదా బ్లాగ్ లలో ప్రత్యర్థుల రాజకీయోపన్యాసాలలో మాత్రమే వింటూవచ్చిన విషయాలు, అందరికి తెలిసినా, డాక్యుమెంటరీ వత్తాసులేని అనేక విషయాలను రామ్ గోపాల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించారు. ఆమోద ముద్ర వేశారు.

సినిమాలో స్పృశించిన సెన్సిటివ్ అంశాలు:

దేశ రాజకీయాలనే ప్రభావితం చేసిన ఎన్టీఆర్‌ వంటి మహానాయకుడు ఎలా ఒంటరి వాడయ్యాడు? లక్ష్మీ పార్వతి కి ఎలా దగ్గరయ్యాడు.? వారిద్దరి మధ్య ప్రేమ,దాని పర్యవసానాలు, లక్ష్మీపార్వతి తో పెళ్లి విషయంలో ఎన్టీఆర్‌ కుటుంబం విబేధాలు, కుట్రలు, కుట్ర దారులు, వెన్నుపోటు, వెన్నపొటు పొడిచిందెవరు? ఈ మెసేజ్ ను వర్మ సక్సెస్ ఫుల్ గా జనంలోకి పంపగలిగారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
తారాగణం : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌
సంగీతం : కల్యాణీ మాలిక్‌
దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి

 

ఇదీ అసలు కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *