రాయలసీమ నీటి సమస్య ఎన్నటికి తీరేను?

(టి లక్ష్మినారాయణ)
1. ఈ రోజు ఉదయం రైల్వే కోడూరులో వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్ దిగి చిట్వేలి మండలంలోని కె.కందులవారిపల్లి, మా వూరికి వెళ్ళాను. చూడ్డానికి దారి పొడవునా పచ్చగానే కనిపించింది. వర్షమేమైనా పడ్డదా! అని విచారించా. చినుకు కూడా పడలేదన్న సమాధానం వెంటనే వచ్చేసింది.
2. గడచిన ఏడాది వర్షం పడలేదు. ఈ ఏడాది వర్షం పడే సూచనలు కనపడడం లేదు. ప్రజలు తలలు పట్టుకొని దిగాలు పడి ఉన్నారు.
3. కరవు పరిస్థితులు నెలకొన్నాయి. మా గ్రామానికి చుట్టు ప్రక్కల ఉన్న పల్లెల్లో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, మా వూరిలో ఒకటి, రెండు బోరు బావుల్లో నీళ్ళు లభిస్తుండడంతో ప్రస్తుతానికి గ్రామవాసులు ఊపిరి పీల్చుకొంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా మరొక బోరు వేస్తే, అందులో నీళ్ళు పడ్డాయన్న ఊరట కాస్త వారి మాటల్లో ధ్వనించింది.
4. కడప జిల్లా సాధారణ వర్షపాతం 645 మి.మీ. ప్రత్యేకించి మా మండలంలో వర్షం కురవాలంటే, నెల్లూరు జిల్లాలో కుంభవర్షం పడాలి. మాది గుంజన వ్యాలి. వెలుగొండలు, బాలాజీ అడవులు, పెంచలకోన, గుండాలకోన ఉన్న ప్రాంతం. సాధారణ వర్షం కురిస్తే చాలు కోనసీమ దృశ్యాలను తిలకించవచ్చు. కానీ, దశాబ్ధాలుగా కరవు పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి.
5. నా బాల్యంలో వారం, పది రోజుల పాటు గుంజన దాటడానికి వీల్లేకుండా ఉదృతంగా ప్రవహించిన ఉదంతాలున్నాయి. కాలినడకన ఐదు కి.మీ. దూరంలోని చిట్వేలి ఉన్నత పాఠశాలకు వెళ్ళే వాళ్ళం. గుంజన వరదల వల్ల పాఠశాలకు వెళ్ళలేక పోయిన అనుభూతులు నా మెదడులో కదలాడాయి.
6. నేడు ఆ గుంజన ఎండి పోయింది. భూగర్భజలాలు ఏడాది ఏడాదికి అడుగంటి పోతున్నాయి. 640 అడుగుల లోతు బోరు వేసినా నీళ్ళు పడలేదని మా వూరి పెద్ద రైతు నిట్టూరుస్తూ చెప్పారు. పది, పదిహేనేళ్ళ పాటు కంటికి రెప్పలా కాపాడుకొంటూ వచ్చిన మామిడి చెట్లు ఎండి పోతుంటే రైతుల కడుపు తరుక్కు పోతున్నది.
7. ఒకప్పుడు బావుల మీద ఆధారపడి పసుపు తదితర వాణిజ్య పంటలు, అరటి, నిమ్మ, బత్తాయి, మామిడి వగైరా వగైరా పండ్ల తోటలు ద్వారా వ్యవసాయ ఉత్ఫత్తులు చేసి, మద్రాసు మార్కెటుకు తీసుకెళ్ళి, అమ్మి, వచ్చిన ఆధాయంతో తృప్తిగా జీవించే వారు.
8. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. బావులు అంతరించి పోయాయి. గుంజనులో వర్షపు నీరు ప్రవహించడం లేదు. చెరువుల్లో సర్కారు కంప చెట్లు పెరిగి పోయాయి. బోరు బావులపై ఆధారపడి చేసే సేద్యం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. అప్పుల పాలౌతున్నారు.
9. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణ మాఫీ పథకం ద్వారా చిట్వేలి మండలంలో కేవలం ఏడు మంది రైతులకే లబ్ధి చేకూరింది. ఈ అంశాన్ని నేను టీవి చర్చల్లో పలు దఫాలు ప్రస్తావించినా, నాటి ప్రభుత్వం చెవుకెక్కించుకొని, న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు.
10. రాజంపేట, కోడూరు శాసనసభ నియోజక వర్గాల పరిథిలోని ప్రజల త్రాగు నీటి, సాగు నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో రూపొందించబడిన గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణం పట్ల గత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించి, అటకెక్కించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. ఈ ప్రాంత ప్రజల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే యుద్ధ ప్రాతిపధికపై గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్మించాలి.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక,రాజకీయ విశ్లేషకుడు)