అనంతపురం జిల్లాలో రైతుల్నిలా నిలువునా ముంచారు

1. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అనంతపురం జిల్లా ఉరవకొండకు మార్చి 10వ తేదీన వెళ్ళాను. గుంతకల్లులో రైలు దిగి ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తుంటే రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో గాలి మరలు(wind turbines) కంట పడ్డాయి. గతంలో వెళ్ళినప్పుడు అక్కడొకటి, అక్కడొకటి కనిపించేవి. ఇప్పుడు భారీ సంఖ్యలో నెలకొల్పబడ్డాయి.

2. గాలి మరల ఫోటోలను నా మొబైల్ లో బంధిస్తుంటే తోటి ప్రయాణికులు విచిత్రంగా నా వైపు చూడడం గమనించాను. నా ప్రక్క సీటులో ఒక సామాన్య రైతు కూర్చొని ప్రయాణిస్తున్నాడు. ఆయనతో మాట కలిపా. గాలి మరలను పెద్ద ఎత్తున పెట్టినట్టుందే అన్నాను. చాలా పెట్టారు. ఎన్ని పెట్టారో? ఏమో! లెక్క తెలియదు. పెట్టడానికి చాలానే పెట్టారు. ప్రభుత్వం మంచి పని చేసింది. గాలి మరలు పెట్టడానికి భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం బాగానే ఇచ్చారా? లక్షన్నర నుండి మూడు లక్షల వరకు ఇచ్చారని చెప్పుకొంటున్నారు. మీ వూరి దగ్గర కూడా పెట్టారా? పెట్టలే!

3. ఏం పంటలు పండిస్తారు? మిరప కాయలు, శెనగలు, జొన్నలు. మీ ఊరి పొలాలకు తుంగభద్ర డ్యాం నీళ్ళొస్తాయా? ఈ ఏడు రాలే.

4. హంద్రీ – నీవా కాల్వ ద్వారా నీళ్ళిచ్చారు కదా! అవి మీ ఊరికి రాలేదా? మా ఊరికి కాల్వ లేదు. వేరే ఊళ్ళకు ఇచ్చారు. పంపులతో నీళ్ళు తోడుకొని కొంత మంది మిరపకాయలు పండించుకొన్నారు.

5. పిల్లల్ని బడులకు పంపుతున్నారా? అప్పోసప్పో చేసి పంపుకొంటున్నారు.

6. కూళోళ్ళు పిల్లల్ని వెంట కూలి పనులకు తీసుకెళ్ళడం లేదా? కొందరు తీసుకెళ్తారు.

7. కరువులో పనులేముంటాయ్? కరువు పనులో, మిరపకాయలు కోసే పనులో, దొరికినకాడికి చేసుకొంటారు.

8. అక్కడక్కడ కొందరు రైతులు భూములను నాగళ్ళతో దున్నుతున్నారెందుకు? దున్ని పెడితే భూమి పొడి పొడిగా ఉంటుందని, నాలుగు చినుకులు పడితే ఇత్తనాలు విత్తు కోవచ్చన్న ఆశతో దున్ని పెడతారు.
ఇలా! ఆ రైతుతో సంభాషణ కొనసాగుతుండగా, ఆయన దిగాల్సిన ఊరు వచ్చేసింది, దిగిపోయాడు.

9. ఉరవకొండ చేరుకొన్నాక కొందరు మిత్రులు కలిశారు. నాకున్న జిజ్ఞాస కొద్దీ వారి నుండి గాలి మరలకు సంబంధించి మరికొంత సమాచారాన్ని వారినడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశా. సంతృప్తికరమైన పూర్తి సమాచారం ఆ మిత్రుల నుండి కూడా లభించ లేదు.

10. 1500 నుండి 3000 వరకు ఉరవకొండ శాసనసభ నియోజకవర్గం పరిథిలోకి వచ్చే రెండు మండలాల్లో నెలకొల్పబడ్డాయని, ఆరేడు ప్రయివేటు కంపెనీలు వాటిని నెలకొల్పాయని, రాజకీయ దళారులు రైతులను దగా చేసి కోట్లు అక్రమంగా సంపాదించుకొంటే, నాయకులు వందల కోట్లు దండుకొన్నారని వాళ్ళు చెబుతుంటే అవినీతి ఏ విధంగా రాజ్య మేలుతున్నదో కళ్ళకు కట్టినట్టు అనిపించింది.

11. కరవు కాటకాల మధ్య జీవచ్ఛవాల్లా కాలం వెళ్ళబుచ్చుతూ, డొక్కలెండి, అప్పుల్లో కూరుక పోయి ఉన్న బక్కచిక్కిన రైతులు తమకున్న ఏకైక ఆధారమైన భూముల్ని గాలి మరలను నెలకొల్పు కోవడానికి ప్రయివేటు కంపెనీలకు ఇస్తే, న్యాయబద్ధమైన నష్ట పరిహారం చెల్లించకుండా ప్రయివేటు సంస్థలు, రాజకీయ దళారులు, నాయకులు కుమ్మకై నిలువు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఇంత కంటే నికృష్టమైన దోపిడీ మరొకటి ఉంటుందా?

12. గాలి మరల ఏర్పాటుకు లాకీ అయిన భూములను ప్రయివేటు సంస్థలు అధ్యయనం చేసుకొని, ఎంపిక చేసుకొని, రాజకీయ నేతలకు ఆ సమాచారాన్ని ఇస్తే, రాజకీయ దళారులు రంగ ప్రవేశం చేసి, రైతులతో కారు చౌకగా(లక్షన్నర మొదలు మూడు లక్షల రూపాయల లోపు) కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం, అడ్వాన్సులు ఇవ్వడం, అటుపై ఆ భూములను గాలి మరలను నెలకొల్పే ప్రయివేటు సంస్థలకు ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల రూపాయలకు అమ్మినట్లు చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారని, ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకు రావాలని కొందరు సమాచార చట్టం క్రింద దరఖాస్తు చేస్తే తిరస్కరించబడ్డాయని ఆ మిత్రులు చెప్పారు.
ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏ మాత్రం స్పందించ లేదని, కంచే చేను మేస్తుంటే, ఇహ! ఎవరికి చేప్పుకోవాలో దిక్కుతొచని స్థితిలో రైతులు, ప్రజలు ఉన్నారని నిర్వేదంతో ఆవేదన వ్యక్తం చేశారు.

13. ఎన్ని గాలి మరలను నెలకొల్పారో, ఎన్ని ఎకరాల భూమిని సేకరించారో, ఎంత విద్యుత్తును ఉత్ఫత్తి చేస్తున్నారో, ఉత్ఫత్తి చేస్తున్న విద్యుత్తులో రాష్ట్ర గ్రిడ్ కు ఎంత సరఫరా చేస్తున్నారో, బహిరంగ మార్కెట్ లో ఉత్ఫత్తి సంస్థలు అమ్ముకొని లాభాలు గడిస్తున్నాయో! అన్న అంశాలపై ప్రజలకు ఏ మాత్రం తెలియదు. గాలి మరలను నెలకొల్పి, పవన విద్యుదుత్ఫాదన చేస్తున్న ప్రయివేటు సంస్థల కార్యాలయాల్లో లేదా జెన్కో అధికారులు ఎవరైనా అందుబాటులో ఉంటే కలిసి విశ్వసనీయమైన సమాచారాన్ని కొంత సేకరించుకొందామన్న అభిలాషతో మిత్రులను అడిగా, అలాంటి అవకాశం లేదని చెప్పారు.
ఈ సమాచారాన్ని ప్రజలకు తెలిజేయాలన్న జవాబుదారీతనాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.

14. ఆంధ్రప్రదేశ్ ‘జెన్కో’ అధికారిక వెబ్ సైట్ లో సమాచారం ఉన్నదేమోనని చూశాను. కనీసం ‘విండ్ పవర్’ ఉత్ఫత్తికి సంబంధించిన గణాంకాలు, ఇప్పటి వరకు రాష్ట్రంలో నెలకొల్పబడ్డ గాలి మరల సంఖ్య, వాటి ఉత్ఫాదక సామర్థ్యానికి సంబంధించిన సమాచారమన్నా దొరుకుతుందని వెతుకులాడా! నిరాశే మిగిలింది.

15. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, గాలి మారలు నెలకొల్పడానికి భూములిచ్చిన రైతాంగానికి న్యాయం జరిగేలా యుద్ధ ప్రాతిపదికపై ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలి. అక్రమాలకు, అక్రమార్జనకు పాల్పడిన రాజకీయ నాయకులు, దళారులను కఠినంగా శిక్షించాలి.

16. పవన విద్యుదుత్ఫాదన రంగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించడం అభినందనీయం. మరింత కేంద్రీకరణ పెట్టాలని ప్రజలు కోరుకొంటున్నారు.

17. ఒక్కొక్క గాలి మరను నెలకొల్పడానికి ఎంత భూమి కావాలి? ప్రయివేటు సంస్థలు ఎంత భూమిని సేకరించుకొన్నారో కూడా బహిర్గతం చేయాలి. అవసరానికి మించి భూమిని సేకరించుకొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలా సేకరించుకొన్న భూమిని ఉపయోగించుకొని ‘సోలార్ ప్యానల్స్’ను ఏర్పాటు చేసుకొని, సౌర విద్యుదుత్ఫాదన చేసుకొవాలన్న కార్యాచరణను సిద్ధం చేసుకొనే ఎక్కువ భూమిని సేకరించుకొన్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

18. వెనుకబడ్డ, కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో పవన మరియు సౌర విద్యుదుత్ఫాదనకు లాకీ అయిన భూములు విస్తారంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొని విద్యుత్తు అవసరాలను తీర్చుకోవడానికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేయాలి. ఆ అభివృద్ధిలో ఆ వెనుకబడ్డ ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయాలి. భూములు కోల్పోతున్న రైతులు ఆ అభివృద్ధిలో మొదటి లబ్ధిదారులుగా ఉండాలి. ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న పేద ప్రజానీకాన్ని భాగస్వాములను చేయాలి. ఆ వైపు ఆలోచనే చేయలేదు.

19. రైతుల నుండి భూమిని కౌలుకు తీసుకొని, అద్దె, లాభాల్లో వాటా, ఉపాథి కల్పన వగైరా అంశాలతో సమగ్ర విధానాన్ని చట్టబద్ధంగా అమలు చేయడానికి పూనుకొని ఉండాల్సింది. ఉపాథి కల్పిస్తామన్న హామీని పవన విద్యుదుత్ఫాదన సంస్థలు ఇచ్చి అమలు చేయలేదు. నిర్వహణ పనులన్నింటినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వియోగించుకోవడం ద్వారా చక్కబెట్టు కొంటున్నారు. అవసరమైన కొద్దిపాటి అసంఘటిత కార్మికుల నియామకంలో కూడా భూములు కోల్పోయిన రైతాంగ కుటుంబాల వారికి ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

20. ఈ అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సముచిత రీతిలో సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నా. నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం డైరెక్టరుగా నేను బాధ్యత నిర్వహించిన కాలంలో మిత్రులు పి.యస్.వి.ప్రసాద్ సహకారంతో విద్యుత్తు రంగానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసి, నిపుణులతో చర్చలు – చర్చా వేదికలు నిర్వహించి, అభిప్రాయాలు – సమాచారాన్ని సేకరించి 2013 ఏప్రిల్ లో “విద్యుత్ ఉత్ఫత్తి – హేతుబద్ధ వినియోగం – అక్షయ వనరుల వినియోగం” అన్న శీర్షికతో ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించిన అనుభవం కూడా నాకున్నది. ఆ అవగాహనతోనే పైన పేర్కొన్న అంశాలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. ఆలోచించండి!

-టి.లక్ష్మీనారాయణ, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *