శ్రీవారి ఆలయంలో జూలై 16న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 16న మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనున్నారు.
 ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం. కోయిల్ అళ్వార్ అంటే పవిత్ర ఆలయం, ఆళ్వార్ అంటే భక్తులు, తిరుమంజనం అంటే సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేయడం.
ఆలయాన్ని భక్తులే శుభ్రం చేయడం దీని విశేషం. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడి లో మూల విరాట్ ని నీళ్లు పడకుండా కప్పి ఉంచుతారు. మిగతా విగ్రహాలను, ఇతర సామాగ్రిని బయటు తీసి కర్పూరం, గంధం, కుంకుమ పువ్వు,పసుపు గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేస్తారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ‌ సేవల‌ను టిటిడి రద్దు చేసింది.
తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.