నంబర్ ఫోర్ స్పాట్ పై కోహ్లీ కొత్త రాగం

తాంబూలాలిచ్చేశాం, ఇక తన్నుకు చావండన్నట్టు క్రికెట్ సెలెక్షన్ కమిటీ భారత ప్రపంచ కప్ జట్టును ప్రకటించేసింది. రాయుడు పోయె-శంకర్ వచ్చే రాంరాంరాం అంటూ ప్రింట్ మీడియా కాలమిస్టులు రవంత సానుభూతీ ఒకింత మెచ్చుకోలూ కలగలిపి ఎవరి ఉక్రోషం వాళ్లు వెలిగ్రక్కారు. ఈ సారి ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ అద్దాలు కొనబోతున్నానంటూ అప్పటికప్పుడు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ను ట్విటర్ తో కొట్టిన రాయుడు కూడా వెంటనే తేరుకుని మొట్టమొదటి అవకాశం (సిఎస్ కె-ఎస్ ఆర్ హెచ్ పోటీ సందర్భంగా) వచ్చీ రాగానే విజయ్ శంకర్ తో కరచాలనం చేసి కౌగలించుకుని క్రీడా స్ఫూర్తి చాటాడు.

భారత వన్ డే జట్టులో నంబర్ 4 స్థానంపై చర్చ ఇప్పట్లో కాదు గదా ప్రపంచకప్ సాంతం పూర్తయ్యేదాకా ముగిసేలా లేదు. మొన్నటికి మొన్న ఇండియా టుడే కిచ్చిన ఇంటర్వ్యూలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రాగం అందుకున్నాడు. విజయ శంకర్ ఎంపికతో నంబర్ ఫోర్ స్పాట్ కు ఇప్పుడు మొత్తం మూడు ఆప్షన్ లు ఉన్నాయని వాదించాడు. (విజయ శంకర్ ను ఎంపిక చేయడం గురించి వివరించేప్పుడు ప్రసాద్ త్రీడి అన్నాడు. కోహ్లీ ఏమో ఇప్పుడు త్రీ ఓ అంటున్నాడు) విజయ శంకర్ ను నాలుగో స్థానం కోసం తీసుకున్నాం కాబట్టి అతను ఆ స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు. ఒకవేళ అతను విఫలమైతే కెఎల్ రాహుల్, దినేశ్ కార్తిక్ లలో ఒకరికి అవకాశం లభిస్తుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అంటే నాలుగో స్థానంలో తొలి అవకాశం శంకర్ దే కాగా అతను విఫలమయ్యేదాకా రాహుల్, దినేశ్ లు బెంచ్ స్ట్రెంత్ కిందే లెక్క.

అయితే ఈ ఇద్దరిలో మళ్లీ రాహుల్ పరిస్థితి కాస్త మెరుగు. ఇంగ్లండ్ లో ప్రపంచకప్ పోటీలు జరిగే కేంద్రాల్లో గల విభిన్నమైన వాతావరణ పరిస్థితులు, పిచ్ ల దృష్ట్యా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ల ఆరంభ జంట విఫలమైనా, లేక మార్పు అవసరమని టీమ్ మేనేజ్ మెంట్ భావించినా రాహుల్ కి ప్రపంచ కప్ లో ఆడే అదృష్టం లభిస్తుంది. కాబట్టి దినేశ్ కార్తిక్ కు నూటికి తొంభైతొమ్మిది పాళ్లు భారత జట్టు ఎక్కడికి వెళితే అక్కడకు తానూ వెళ్లి, ఆడేవాళ్లకు అప్పుడప్పుడూ డ్రింకులూ, బ్యాట్లూ, గ్లోవ్స్ వగైరాలు అందించడం తప్ప ఆడే పని మాత్రం ఉండదు.

ప్రపంచ కప్ యాత్రలో భారతజట్టుకు వికెట్ కీపరూ, కెప్టెన్ కింగ్ కోహ్లీకి ఫీల్డులోనూ, జట్టు మీటింగుల్లోనూ ప్రధాన సలహాదారూ, జట్టుకు వ్యూహకర్త, మార్గదర్శకుడూ, పెద్ద దిక్కూ, ఇంకా ఎన్నెన్నో అయిన మహేంద్ర సింగ్ ధోనీ అయిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగడం ఖాయం. అటు తర్వాత ఇద్దరు బౌలింగ్ ఆల్ రౌండర్లు కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్య భారత స్కోరుకు నిలకడ ఇచ్చేందుకు ఒకరు, వీరబాదుడుతో దూకుడు ఇచ్చేందుకు ఒకరు బ్యాటింగ్ కు వస్తారు. ఈ ఇద్దరిలో జాధవ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కాగా పాండ్య మీడియం పేస్ బౌలరు. ఇకపోతే ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు స్థానాల్లో నలుగురు బౌలర్లు టెయిల్ గా వస్తారు. వీళ్లలో ఎనిమిది, తొమ్మిది స్థానాలు భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు ఖాయం. పదిలో షమీ, చివరి స్థానంలో చహాల్ లేదా కుల్ దీప్ యాదవ్ లలో ఒకరు ఆడవలసి ఉంటుంది. స్పిన్ లో వెరైటీ కావాలనుకున్నప్పుడు జడేజా చక్రం తిప్పేందుకు రెడి. అంటే టీమిండియా జట్టులో మొత్తం ఏడుగురు బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు ఉన్నట్టు లెక్క. ఒకవేళ ఏదైనా స్పిన్ పిచ్ పై పోటీ కోసం చహాల్, కుల్ దీప్ ఇద్దరూ ఆడటం మేలని భావిస్తే షమీ లేదా భువీల స్థానంలో ఆడించవచ్చు. ఇంతకంటే సమతూకం గల జట్టును ఎంపిక చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు.

దాదాపు నెలరోజుల నుంచి హోరాహోరీగా సాగుతున్న ఐపిఎల్ టోర్నీలో కుల్ దీప్ యాదవ్, దినేశ్ కార్తిక్ మినహా మిగత అందరూ అద్భుతంగా ఆడుతూ ప్రచండమైన ఫార్మ్ లో ఉన్నారు. రిషభ్ పంత్, అంబటి రాయుడు మొదటి, రెండవ స్టాండ్ బైలుగా, ఐపిఎల్ లో 150 ప్లస్ తో బౌల్ చేస్తున్న నవ్ దీప్ సైనీ స్టాండ్ బై బౌలర్ గా టీమిండియా పిలుపు కోసం నిరీక్షిస్తూ సర్వధా సిద్ధంగా ఉంటారు.

ప్రపంచ కప్ భారత జట్టు కూడిక బ్రహ్మాండంగా ఉంది కానీ ఇంగ్లండ్ లోని స్వింగ్, బౌన్స్ పరిస్థితులు గ్రౌండ్ గ్రౌండ్ కూ పిచ్చిపిచ్చిగా మారిపోయే ప్రత్యేక పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సన్నద్ధమవుతూ ప్రత్యర్థులను మట్టి కరిపించడం ముఖ్యం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు కేవలం స్పీడ్ కోసం యత్నించకుండా బంతి మూవ్ మెంట్ పై దృష్టి కేంద్రీకరించడం, వైడ్స్, నోబాల్స్ పై అదుపుతో స్టంప్ టు స్టంప్ లైన్ కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. నెల రోజులుగా సాగుతున్న ఐపిఎల్ లో నిరంతరం ఆడుతూనే ఉన్నారు గనుక టీమిండియా సభ్యులకు ఈ సారి యోయో ఫిట్ నెస్ టెస్టు అక్కర్లేదని మినహాయించారు. జూన్ 5న సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికాతో భారత తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆల్ ది బెస్ట్ టీమిండియా!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *