ఐపిఎల్ పేరంటంలో బోల్డంత ప్రాక్టీసే కాదు మంచి సంభావన కూడా!

 

(బి వి మూర్తి బెంగుళూరు నుంచి)

బెంగుళూరు: ఐపిఎల్ పుణ్యమా అని కేవలం మన వాళ్లకే కాదు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ జట్లలోని కొందరు కీలకమైన ఆటగాళ్లకు ప్రపంచకప్ ముందు చక్కని ప్రాక్టీస్ అవకాశం లభించింది. నెల రోజుల పాటు ఐపిఎల్ మ్యాచ్ లలో వీలైనంత మేరకు ప్రాక్టీస్ చేసుకుని విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు తిరిగివెళ్లారు. వేలంపాట కాంట్రాక్టు డబ్బులతో పాటు తాము గెల్చుకున్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ వగైరా వగైరా అవార్డుల ధన రాశులను మూటగట్టుకుని ఐపిఎల్ పేరంటం ముగించుకుని మరీ తిరిగి వెళ్లారు విదేశీ క్రికెటర్లు.

నెట్ ప్రాక్టీస్ కంటే మ్యాచ్ ప్రాక్టీసే అన్ని విధాలా శ్రేష్ఠమని క్రికెట్ పండితులు చెబుతారు. ఎందుకంటే నెట్ ప్రాక్టీస్ లో బౌలింగ్ ప్రాక్టీస్, బ్యాటింగ్ ప్రాక్టీస్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ దేనికదే వేర్వేరు. ఎంతగా శక్తిసామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగించి క్రికెట్  ఆడినా అది ఉత్తుత్తి ప్రాక్టీసేనని అందరికీ తెలుసు. ఉదాహరణకు నెట్ లో లాగా మ్యాచ్ లో వరసగా బౌన్సర్లు ఎవరూ వేయరు. నిజంగా మ్యాచ్ ఆడేప్పుడు క్యాచ్ లు చెప్పి రావు.

ప్రపంచ కప్ టీమిండియా ఓపెనర్లలో శిఖర్ ధావన్ ఐపిఎల్ లో దూకుడుగా ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శనతో మొత్తం 521 పరుగులు మూటగట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 34.73 పరుగుల సగటు సాధించిన ధావన్ ఈ సీజన్ లో అందరి కంటే ఎక్కువగా 64 బౌండరీలు కొట్టాడు. 16 పోటీల్లో మొత్తం 5 అర్ధ సెంచరీలు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈ సారి కప్పు సాధించింది గానీ శర్మ నిలకడగా ఆడలేకపోయాడు. 15 పోటీల్లో 28.92 సగటుతో శర్మ 405 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు చేసిన శర్మ 52 బౌండరీలు, 11 సిక్సర్లు కొట్టాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాలూకు ఆర్ సి బి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో మిగిలింది కానీ కెప్టెన్ మాత్రం తన సహజ ధోరణిలో 14 పోటీల్లో 33.14 సగటుతో మొత్తం 464 పరుగులు స్కోరు చేశాడు. అతని స్కోరులో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలున్నాయి. అతని ఇన్నింగ్స్ లో 46 బౌండరీలు, 13 సిక్సర్లున్నాయి.

కాఫీ విత్ కరణ్ టివి షో లో అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలతో సస్పెన్షన్ శిక్ష అనుభవించడమే గాక ప్రపంచ కప్ బస్సు మిస్సవుతారేమో అని భయపడిన కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య టీమిండియాకు ఎంపికవడమే గాక ఈ ఐపిఎల్ సీజన్ లో అద్భుతంగా ఆడి సత్తా చాటారు. కింగ్స్ లెవెన్ పంజాబ్ ప్లేఆఫ్ స్థాయికి కూడా నోచుకోకుండా మిగిలిపోయింది గానీ రాహుల్ 53. 93 సగటుతో 14 పోటీల్లో మొత్తం 593 పరుగులు మూట గట్టి భారత ఆటగాళ్లలో టాప్ స్కోరర్ గా ఘనత సాధించాడు. ఓ సెంచరీ, ఆరు అర్ధ సెంచరీలు చేయడమే గాక 49 పోర్లు, 25 సిక్సర్లు కొట్టాడు. బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 9.27 ఎకానమీతో 16 మ్యాచ్ ల్లో 14 వికెట్లు పతనం చేశాడు. టి20 ఫార్మాట్ లో ఓవర్ కు పది పరుగుల స్కోరింగ్ రేటు సర్వసాధారణమై పోయింది గనుక పాండ్య ఎకానమీ మరీ అంత ఘోరమేమీ కాదు. ఇక బ్యాటింగ్ లో తన స్లాగ్ హిటర్ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన భారత ఆటగాళ్లలో పాండ్యనే అగ్రగామి అని చెప్పవచ్చు. అతని స్ట్రైక్ రేట్ 191.62. మొత్తం 15 ఇన్నింగ్స్ లో 402 పరుగులు. అందులో ఓ అర్ధ సెంచరీ, 91 పరుగుల అత్యధిక స్కోరు ఉన్నాయి. కెకెఆర్ తో కోల్కతాలో జరిగిన పోటీలో అమాంతం 17 బంతులకే అర్ధసెంచరీ పూర్తి చేసిన పాండ్య ఈ ఐపిఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మొనగాడుగా రికార్డు సొంతం చేసుకున్నాడు.

క్రికెట్ లో నిత్యనూతన యౌవనుడు మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ గత సీజన్ కంటే ఈ ఐపిఎల్ లో ఎన్నో రెట్లు మెరుగు పడటం ప్రపంచ కప్ ముంగిట భారత జట్టుకు గొప్ప శుభ సూచకం. మొత్తం 16 పోటీల్లో 12 సార్లు బ్యాటింగ్ చేసిన ధోనీ 83.20 సగటుతో 416 పరుగులు చేశాడు. వయసు మీద పడుతున్న ధోనీ మరీ ఎక్కువగా బంతులు తినేస్తూ నిదానంగా ఆడుతున్నాడని ఫిర్యాదు చేసే వాళ్లు ఈ సీజన్ లో అతని స్ట్రైకింగ్ రేటు 134.62 ఉండటాన్ని ఓ సారి గమనించాలి. నిదానంగా ఆరంభించి, తాను అవసరమనుకున్నప్పుడు ఇంకో నాలుగైదు ఓవర్లుండగా స్పీడు పెంచి, చివర్లో కిక్కు నెత్తి కెక్కేలా విధ్వంసక విన్యాసాలతో స్టేడియం హోరెత్తించడం అనితర సాధ్యమైన అతని శైలి. రెండ్రోజుల క్రితం ముంబై ఇండియన్స్ తో జరిగిన తుదిసమరంలో అనూహ్యంగా ధోనీ రనౌట్ కావడం వల్లే చెన్నై కింగ్స్ కి కప్పు చేజారిపోయిందని గట్టిగా వాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు.

పోతే, తీరా ప్రపంచ కప్ మరీ దగ్గరి కొచ్చేసిన ఈ దశలో ఆల్ రౌండర్ కేదార్ జాధవ్ భుజానికి గాయంతో చివరి లీగ్ మ్యాచ్ లో వైదొలగడం ఆందోళనకరం. గాయం అంత తీవ్రమైనదేమీ కాదనీ, ప్రపంచ కప్ సమయానికి జాధవ్ పూర్తి ఫిట్ నెస్ తో సంసిద్ధమవుతాడని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నమ్మకంగా చెబుతున్నాడు. అయితే, భుజం, వెన్నెముక, మోకాలి నొప్పి గాయాలు క్రీడాకారుల పాలిట మొండి గాయాల వంటివి. అంత సులభంగా మానవు సరికదా తిరగబెట్టే అవకాశాలెక్కువ. ఈ సరికే ప్రకటించిన టీమిండియాలో మార్పులూ, చేర్పులూ చేయడానికి తుది గడువు మే 23. అంటే ఈ లోగా జాధవ్ చికిత్స పూర్తి చేసుకుని, గాయం మానిపోయిందని వైద్యుల నిర్ధారణ పొంది, ఫిట్ నెస్ టెస్టు అర్హత సాధించాలి. ఒకవేళ జాధవ్ ప్రపంచకప్ ఫ్లైట్ మిస్సయితే, తీవ్ర నిరాశా నిస్పృహలకు గురైన అంబటి రాయుడు,  రిషభ్ పంత్ లలో ఎవరో ఒకరికి పంట పండినట్టే.

టీమిండియా ప్రధాన బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా (19), భువనేశ్వర్ కుమార్ (13), మహమ్మద్ షమీ (19), యజువేంద్ర చహాల్ (18) అద్భుతంగా బౌల్ చేసి తమ తమ జట్లకు కీలక విజయాలు సాధించి పెట్టారు. చెన్నై హోమ్ అడ్వాంటేజ్ ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న రవీంద్ర జడేజా (16) కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎటు తిరిగీ టీమిండియా ఆటగాళ్లందరిలో స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ఒక్కడే ఆశించిన స్థాయిలో ఐపిఎల్ లో రాణించలేక పోయాడు.

కేవలం 12 పోటీల్లోనే ఆడినప్పటికీ మొత్తం 692 పరుగుల అత్యధిక స్కోరుతో ఆరెంజ్ క్యాప్ సాధించిన డేవిడ్ వార్నర్, 26 వికెట్ల పర్పుల్ క్యాప్ హీరో ఇమ్రాన్ తాహిర్ ఇద్దరూ విదేశీయులే కావడం ఐపిఎల్ లో ఇంకో విశేషం.

ఐపిఎల్ తో అందరికీ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించిన మాట నిజమే గానీ ఇంగ్లండ్ లోని ప్రపంచ కప్ గ్రౌండ్లలో పూర్తిగా విభిన్నమైన వికెట్లు, వాతావరణ పరిస్థితులు ఉంటాయని మర్చిపోరాదు. లార్డ్స్, ఓవల్, ఓల్డ్ ట్రఫర్డ్ వంటి వందేళ్లకు పైగా పాతవైన గ్రౌండ్లతో పాటు రివర్ సైడ్ దుర్హమ్, హాంప్ షైర్ బౌల్ వంటి సరికొత్త గ్రౌండ్లలో మొత్తం 12 చోట్ల ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. కలెక్షన్ల కనకవర్షం కోసం పరుగుల కుంభవృష్టి కురిపించేలా బ్యాటింగ్ పిచ్ లు తయారు చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న సంప్రదాయం. అయితే ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అడపాదడపా బంతి స్వింగ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. 1975తో ఆరంభించి మొదటి మూడు ప్రపంచకప్ పోటీలను తానే నిర్వహించిన ఇంగ్లండ్, ఐసిసి సభ్య దేశాలన్నింటికీ టోర్నీ నిర్వహించే అవకాశమిచ్చే బిడింగ్ సంప్రదాయం మొదలయ్యాక 1999లో ఒక్కసారి మాత్రమే పోటీలకు ఆతిథ్యమిచ్చింది. ఇరవయ్యేళ్ల తర్వాత ఆహ్లాదకరమైన ఇంగ్లీషు వాతావరణంలో జరుగుతున్న పోటీల్లో మొత్తం పది జట్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. హేమాహేమీ జట్ల బాహాబాహీ క్రికెట్ యుద్ధానికి ఈ నెల 30న ఓవల్ లో తెరతీసే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తొలి సమరానికై ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *