‘తెలంగాణ జాగృతి’ని భుజాల మీద మోసిన దాసరి శ్రీనివాస్ రాజీనామా

ఉన్నత విద్యావంతుడు, తెలంగాణ ఉద్యమంలో కాలేజీ రోజుల నుంచి చురుకుగా పాల్గొన్నవాడు, బిసి నాయకుడు, శంకించడానిక వీల్లేని తెలంగాణ కట్టుబాటు ఉన్న యువనాయకుడు దాసరి శ్రీనివాస్ తెలంగాణ జాగృతికి రాజీనామా చేశాడు. నిజామాాబాద్ ఎంపి కవిత నాయకత్వంలోని తెలంగాణ జాగృతిని ప్రపంచం నలుమూలల  ఉన్న  తెలంగాణ ప్రవాసలకు చేరువ చేయడంలో దాసరి కృషి ఎనలేనిది. ఒక విధంగా చెబితే కనిపించకుండా తెలంగాణ జాగృతిని భుజాలలో మీద మోస్తున్న యువనాయకులెవరైనా ఉంటే వారిలో మొదట చెప్పుకోవలసిన పేరు దాసరిదే. వరంగల్ నిట్ లో ఎమ్ టెక్ చేసిన దాసరి గత నాలుగేళ్లలో  జాగృతికి నేపథ్యం నుంచి సేవలందిస్తూ వచ్చారు. అయితే ఇపుడున్న నాయకత్వంలో  తెలంగాణ  ఏర్పాటు ఆశయాలు నెరవేరడంలేదనే  నిరాశలో ఉన్నారు. పెడధోరణులు పెద్ద ఎత్తున సంస్థలో పొడసూపుతున్నందున తెలంగాణ జాగృతిలో ఉండటం సాధ్యంకావడం లేదని ఆవేదన చెందుతూ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన కవితక పంపించారు.  ఇదే ఆయన రాజీనామా లేఖ:

గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి …నమస్కారములు

నా బాల్యం నుండి నేను పెరిగిన వాతావరణం కానీ, నేను నా జీవితంలో అనుభవించిన కష్టాలు నన్ను ప్రజలకి సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని ప్రేరేపించింది . అందుకు నేను చిన్నప్పటినుండి నేను ఎంచుకున్న ఏకైక మార్గం రాజకీయాలు . భూమ్మీద ఉన్న ప్రతి విషయం కూడా రాజకీయ కోణం లో నుండే ఉద్భవించిందనేది నేను నమ్మి పాటించే సిద్ధాంతం . అందుకే రాజకీయ రంగాన్ని నేను ఎంచుకున్నాను . రాజకీయమనే విషయాన్నీ ఒక ఉన్నతమైన స్థానంగా కాకుండా ఒక బాధ్యత గా నేను భావిస్తాను .

చిన్నప్పటినుండి నేను ఒక విప్లవ భావజాలంలో పెరగడం వలన స్వతహాగా నేను అన్యాయాన్ని చూసినా ఆవేదనని చూసినా తొందరగా స్పందించడం నా చిన్నతనం నుండే నాకు అలవాటు అయింది .అందుకే తెలంగాణాలో చూసిన అన్యాయాలను అక్రమాలను దోపిడీని సహించలేక చాలా తొందరగా తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడనయ్యాను .

2009 మలి దశ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు ఏకం అవుతున్న తరుణంలో నా వంతుగా తెలంగాణ ఉద్యమానికి దోహద పడాలనే ఉద్దేశంతో ,కాళోజి , ప్రొఫెసర్ జయశంకర్ , ప్రొఫెసర్ కొదండరాం , కెసిఆర్ గార్ల స్పూర్తితో   ప్రతిష్టాత్మకమైన నిట్ వరంగల్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న నేను నా యూనివర్సిటీ లోనే ఉద్యమం మొదలుపెట్టాలని నిర్ణయించుకొని “నిట్ తెలంగాణ స్టూడెంట్స్” ఫోరమ్ ని ఏర్పాటు చేసి యూనివర్సిటీ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఏకం చేసి “నిట్ జాక్” తరపున తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది . ధర్నాలు , రాస్తా రోకో , వంట వార్పూ , నిరాహార దీక్షలు , ర్యాలీ లు ఇలా అనేక రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది . ఆ తదనంతరం టెక్నికల్ విద్యార్థుల భాగస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో మరింత ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో వరంగల్ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీలు , ఫార్మసీ కాలేజీలు , మెడికల్ కాలేజీ లను ఏకం చేసి తెలంగాణ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఫోరమ్ స్థాపించి ఆ ఫోరమ్ కి అధ్యక్షుడిగా ఎన్నికై ఒక్క వరంగల్ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఢిల్లీ వేదికగా ఆనాడు ఏర్పడిన “నేషనల్ సాలిడారిటీ కమిటీ ఫర్ సెపరేట్ తెలంగాణ” సంస్థ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించి వేలాది మంది ఇతర రాష్ట్ర విద్యార్థులతో కలిసి జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం పోరాడటం జరిగింది .

నిట్ వరంగల్ లో నా విద్యాభ్యాసం పూర్తి అయ్యాక  నేను ఇంకా ఎదో చేయాలనే తలంపుతో నా మకాం ని హైదరాబాద్ కి మార్చాను . అప్పటికే కొదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ జాక్ మరియు తెరాస లాంటి సంస్థలు ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తూ ఉండగా , నేను హైదరాబాద్ మకాం మార్చే సమయానికి సకల జనుల సమ్మె చాలా ఉదృతంగా నడుస్తుంది . కొంచెం ఉద్యమంలో ప్రత్యేకంగా ఇంకా ఏదో చేయాలనే తలంపుతో సోషల్ మీడియా లో కూడా తెలంగాణ వాదాన్ని వినిపించాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన కొంతమంది సోషల్ మీడియాలో ఆక్టివ్ గా తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఆన్ లైన్ ఉద్యమకారులను కలిసి మనం కూడా ఏకం అయ్యి తెలంగాణ ఉద్యమంలో ఆక్టివ్ భాగస్వామ్యం అవుదామని “తెలంగాణ నెటిజన్స్ ఫోరమ్ “ని 2011 లో  ఏర్పాటు చేసి ఆన్ లైన్ ఉద్యమకారులని ఆన్ రోడ్ కార్యక్రమాల్లో పాలుపంచుకునే చేయడం జరిగింది . తెలంగాణ నెటిజన్స్ ఫోరమ్ కి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొద్దీ రోజుల్లోనే హైదరాబాద్ వేదికగా చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది . తెలంగాణ ఉద్యమంలో రోజు రోజుకి సీరియస్ గా కార్యక్రమాలు చేపట్టడం , జాక్ ఇచ్చిన పిలుపులను అమలు చేయడం ఇలా తీరిక లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వలన నా కెరీర్ ని పట్టించుకోలేదు . అప్పటికే నిట్ వరంగల్ లో కాంట్రాక్టు లెక్చరర్ గాను ఒక సంవత్సరం పని చేయడం జరిగింది . ఆ తదనంతరం నా కెరీర్ ని కాపాడుకోవాలని ఉద్దేశంతో మళ్ళీ 2012 లో వరంగల్ కి నా మకాం ని మార్చి కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లో మళ్ళీ లెక్చరర్ గా చేరాను . కానీ ఎందుకో అక్కడి పరిస్థితులు నచ్చక చేరిన కొద్దీ రోజులకే నా జాబ్ కి రాజీనామా చేసాను . ఎందుకో నా మనసంతా తెలంగాణ ఉద్యమం వైపు ఉంది కనుక నాకు వేరే ఎలాంటి జాబ్ చేయడం ఇష్టం లేదు .

ఆ తదనంతరం 2012 సంవత్సరంలో మీ పిలుపు మేరకు తెలంగాణ జాగృతిలో చేరడం జరిగింది . చేరిన కొద్దీ రోజులకే తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా నియమింపబడ్డాను . అప్పటి నుండి తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతానికి కృషి చేస్తూనే గ్రామా గ్రామాన సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తూ కమిటీలు కూడా వేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది . బతుకమ్మ ఉత్సవాలు కానీ , బోనాల పండుగలతో పాటు తెలంగాణ ఉద్యమం లో తెలంగాణ జాగృతి తరపున అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది . ఆ తర్వాత అనేక వీరుల త్యాగాలు , ఉద్యమకారుల బలి దానాలను చూసి చలించిన ఆనాటి యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ గారు పది జిల్లాలతో కూడిన తెలంగాణ ని 29 వ రాష్ట్రంగా లోక్ సభలో బిల్లు పాస్ అయ్యేలా కృషి చేయడం జరిగింది .

2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిదప జరిగిన సాధారణ ఎన్నికల్లో తెరాస పార్టీ ఘన విజయం సాధించి తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది . ఆ ప్రభుత్వ అధినేతగా తొలి ముఖ్యమంత్రి గా కెసిఆర్ గారు ఎన్నికయ్యారు . అప్పటికే మీరు కూడా నిజామాబాద్ ఎంపీ గా భారీ మెజారిటీ తో గెలుపొందారు. కొత్త రాష్ట్రంలో తొలి మహిళా ఎంపీగా మీరు ఎన్నిక కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది . ప్రభుత్వం ఏర్పడిన కొద్దీ నెలల్లోనే నా పని తనాన్ని మెచ్చుకొని తెలంగాణ జాగృతి ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు నన్ను నియమించి నా భాధ్యతను మరింత పెంచారు . తెలంగాణ జాగృతి ఐటి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించి ఐటి విభాగం బలోపెతానికి కృషి చేసిన విషయం మీకు తెలిసిందే.

కానీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఆంధ్ర పెట్టుబడి దారుల ఆధిపత్యం అలాగే కొనసాగించడానికి కెసిఆర్ గారి అంగీకారం , తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన నాయకులను తెరాస పార్టీ లోకి తీసుకొని వాళ్ళని మంత్రులుగా చేయడం , ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ఇలా అనేక కార్యక్రమాలను చూసి చాలా బాధపడ్డాను . అయినప్పటికీ ఎక్కడో చిన్న ఆశ … తెలంగాణ కోసం కెసిఆర్ గారు ఎదో చేస్తారనే ఆశ ఉండేది . కానీ సంవత్సరాలు గడుస్తున్నా గాని ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోను ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నన్ను కలచి వేసాయి . అంతే కాకుండా కెసిఆర్ కుటుంబ పాలనా వల్ల తెలంగాణ రాష్ట్రం ఒక రాచరిక రాజ్యంగా తయారు అయింది. ప్రజా సమస్యల పరిష్కారాలన్నీ తమ కుటుంబ గుప్పిట్లో పెట్టుకొని మంత్రులను , ఎమ్మెల్యేలను రబ్బర్ స్టాంపులుగా తయారు చేశారు.

రాజ్యాధికారం కింది స్థాయిలోకి వెళితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని గాఢంగా విశ్వసించే నేను తెలంగాణ రాష్ట్రం లో రాజ్యాధికామంతా ఆ ఒక్క కుటుంబం గుప్పిట్లో పెట్టుకోవడం మూలాన ప్రజా సమస్యలన్నీ సమస్యలుగానే మిగిలిపోతున్నాయని భాావిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రం లో రాజ్యాధికారమంతా ఆ ఒక్క కుటుంబం గుప్పిట్లో పెట్టుకోవడం మూలాన ప్రజా సమస్యలన్నీ సమస్యలుగానే మిగిలిపోతున్నాయని భాావిస్తున్నాను

తెలంగాణ రాష్ట్రం లో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ కుటుంబం మినహా ఏ ఒక్కరు కూడా బాగుపడలేదు అన్నది జగమెరిగిన సత్యం . తెలంగాణ లో అభివృద్ధి పేరిట జరుగుతున్న దోపిడీకి కానివ్వండి తన మాటలతో గారడీ చేస్తూ ప్రజలని మభ్య పెడుతున్న తీరు కావొచ్చు నన్ను ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని నిర్ణయించుకున్నాను .

తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని సియం చేస్తా అని ఉకదుంపుడు ఉపన్యాసాలతో హామీ ఇచ్చిన కెసిఆర్ గారు దళితుడిని సీఎం చేయక పోగా కనీసం వారికి రాజ్యంగా  పరంగా రావాల్సిన నిధులను కాలరాస్తూ వారిని మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు . తెలంగాణ రాష్ట్రం వస్తే వెనకాడిన వర్గాలకి న్యాయం జరుగుతదని ఆశించిన నా లాంటి ఉద్యమకారులకు నిరాశే మిగిలింది . తెలంగాణ లో బిసి , ఎస్సి , ఎస్టీ లకు కెసిఆర్ పాలనలో న్యాయం జరగక పోగా నష్టమే ఎక్కువ వాటిళ్లుతుంది . కెసిఆర్ కుటుంబ దాస్య శృంఖలాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి నేను సైతం నా వంతుగా ప్రయత్నం చేయడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంలో తెలంగాణ జాగృతి లో కొనసాగుతూ కెసిఆర్ గారు  తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించడం భావ్యం కాదనే ఉద్దేశంతో నేను తెలంగాణ జాగృతి ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను . ఇప్పటివరకు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా ఒకసారి మరియు రెండు మార్లు తెలంగాణ జాగృతి ఐటి విభాగం రాష్ట్ర అద్యక్షుడిగా నన్ను నియమించి అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞుడను . తెలంగాణ జాగృతిలో నాకు సహకరించిన ప్రతి నాయకునికి ,ప్రతి కార్యకర్తకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు .

ఇట్లు

-దాసరి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *